National Highway: ఎప్పుడెప్పుడు విశాఖ వెళ్దామా అనుకుంటే.. ట్రాఫిక్ ఇక్కట్లు చెప్పలేం! కిలోమీటర్లు కదలవు, గంటలు గడుస్తాయి. కానీ ఇప్పుడు అలా కాదు. సరికొత్త హైవే తో మీ ప్రయాణం వేగవంతం కానుంది. మరి ఈ మార్గం ఏమిటి? ఎప్పుడు అందుబాటులోకి రాబోతోంది? ఏం మారబోతోందో తెలుసుకుందాం.
ఇక యమ స్పీడ్..
తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రయాణం ఇక పూర్తిగా మారబోతోంది. సూర్యాపేట నుంచి దేవరపల్లి వరకు నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే చివరి దశలోకి చేరింది. ఇది 4 లేన్ల యాక్సెస్ కంట్రోల్ రహదారి. దాదాపు 162 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయ్యాయని అధికారిక సమాచారం. వచ్చే ఆగస్టు 15 నాటికి దీన్ని ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.
కోట్లల్లో ఖర్చు..
ఈ హైవే నిర్మాణానికి రూ.2,214 కోట్ల ఖర్చు అవుతోంది. ఒకసారి ఇది ప్రారంభమైతే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే మార్గం 56 కిలోమీటర్ల వరకు తగ్గనుంది. ప్రస్తుతం ప్రయాణికులు దాదాపు 622 కిలోమీటర్లు ప్రయాణిస్తున్న ఈ మార్గంలో, కొత్త హైవే ప్రారంభం అయితే సమయం, ఇంధనం, ఖర్చు అన్నీ గణనీయంగా తగ్గే అవకాశముంది.
ఇది కేవలం పక్కా రోడ్డే కాదు, రెండు రాష్ట్రాలను కలిపే ప్రధాన మార్గం. వ్యాపారానికి, పర్యటనలకు, రవాణాకు ఇది ఒక బలమైన గేట్‌వేలా మారనుంది. సరుకు రవాణా దృష్ట్యా చూస్తే.. ఇది ఓ ర్యాపిడ్ రూట్. ఇక ప్రయాణికులకు ఇది రహదారి మాత్రమే కాదు, గమ్యం చేరే దిశగా బలమైన మార్గం.
ప్రస్తుత పరిస్థితి ఇదే..
ఈ హైవే ఐదు ప్యాకేజీలుగా విభజించి నిర్మిస్తున్నారు. ప్యాకేజీ 1లో తల్లంపాడు నుంచి సోమవరం వరకు 33 కి.మీ.లో 30 కి.మీ. పూర్తయ్యాయి. ప్యాకేజీ 2లో సోమవరం నుంచి చింతగూడెం వరకు 29 కి.మీ.లో 26 పూర్తయ్యాయి. ప్యాకేజీ 3లో చింతగూడెం నుంచి రజోర్ల వరకు 43 కి.మీ.లో 37 పూర్తయ్యాయి. ఇందులో చాలా చోట్ల ఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాస్‌లు చివరి పనుల్లో ఉన్నాయి. మొత్తం ప్రాజెక్టులో 124 వంతెనలు, అండర్ పాస్‌లు ఉంటే ఇప్పటికే వాటిలో 117 పూర్తయ్యాయి. మిగిలిన భాగాలపై పనులు జోరుగా సాగుతున్నాయి.
Also Read: Khairatabad Ganesh 2025: ఆపరేషన్ సింధూర్ థీమ్‌తో ఖైరతాబాద్ గణేష్.. మోడీ, అమిత్ షాలకు ఆహ్వానం
ఇటీవల వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైవే పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. వేంసూరు నుంచి ధంసలపురం వరకు వెళ్లి పరిశీలించిన మంత్రి.. జూలై 15 నాటికి కనీసం ఒక క్యారేజ్‌వే అయినా అందుబాటులోకి రావాలని అధికారులకు సూచించారు.
సర్వీస్ రోడ్లపై కూడా సమాన అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ హైవే పూర్తి కాగానే, హైదరాబాద్ నుంచి విశాఖ వరకు ప్రయాణించే వారికి ఇది వరంగా మారుతుంది. ట్రాఫిక్ తగ్గుతుంది. సమయం తగ్గుతుంది. ఇంధన వ్యయం తగ్గుతుంది. ముఖ్యంగా ప్రజలకు ఇది ఒక భరోసా మార్గంగా నిలుస్తుంది.
పక్కా ప్లాన్‌తో నిర్మించిన ఈ హైవే, రెండు రాష్ట్రాలకు మధ్య ఉన్న అనుసంధానాన్ని మరింత పటిష్టం చేస్తుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇది చక్కటి ఉదాహరణ. రేపటినుంచి ప్రయాణం మరో మెట్టు ఎక్కబోతోంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు!