Neelima Marriage Controversy: ప్రతీ మనిషికి ఒక దశలో సమాజం ఎదురుతిరుగుతుంది. సత్యం మాట్లాడినా శబ్దం వినిపించదు. అసత్యం మాట్లాడినా సంచలనం మాత్రం అయ్యేలా ఉంటుంది. ఎవరు నిజం? ఎవరు నటన? అన్నదానిపై తీర్పు తేలకముందే మనం ఒకర్ని నిందించడం మొదలుపెడతాం. కానీ ఈసారి ఆమె మౌనం వదిలేసింది. తానే స్వయంగా వచ్చి చెప్పింది. ఇంతకు ఈమె ఎవరో అనుకోవద్దు.. నిన్నటి నుండి 12 పెళ్లిళ్లు చేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న నీలిమ. ఈ ఆరోపణలపై తాజాగా నీలిమ స్పందించారు.
కోనసీమ నిత్య పెళ్లికూతురు అంటూ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందన్న ఆరోపణలపై తాజాగా స్పందించింది బేతి వీర దుర్గా నీలిమ. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురానికి చెందిన ఆమె.. తాను నిత్య పెళ్లికూతురిని కాదని, 12 పెళ్లిళ్లు చేసుకున్నట్టుగా జరుగుతున్న ప్రచారమంతా అసత్యమని స్పష్టం చేసింది. నీలిమ మాట్లాడుతూ ‘నన్ను నేను తెలుసు. నేను ఎలాంటి మోసం చేయలేదు. నేను చేసిన తప్పేమైనా ఉంటే, చట్టపరంగా శిక్షించండి. కానీ సత్యం బయటకురాకముందే నన్ను నిందించడం న్యాయమా? అని ఆమె ప్రశ్నించింది.
నీలిమపై వచ్చిన ఆరోపణలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా నుంచి వార్తా ఛానళ్లు దాకా విస్తరించాయి. ‘నిత్య పెళ్లికూతురు.. ఇప్పటికే 12 మందితో పెళ్లిళ్లు చేసి మోసం చేసిందనే కథనాలు సంచలనం సృష్టించాయి. వాటిపై స్పందించిన నీలిమ, ఇది నన్ను నాశనం చేయాలని చేస్తున్న కుట్ర. ఇదంతా అసత్యపు ప్రచారం. నాకే ఇదంతా మాయగా ఉంది అంటూ భావోద్వేగంగా స్పందించింది.
ఈ ప్రచారాలపై నీలిమ రామచంద్రపురం పోలీసులను ఆశ్రయించింది. నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. దర్యాప్తు జరిగి నిజం బయట పడాలే గానీ.. ఎవరైనా కేవలం వదంతులతో నన్ను నిందించడం బాధాకరం. నా జీవితాన్ని గందరగోళంగా మలచేశారు. నన్ను దుశ్చర్యలకు పాల్పడ్డవారిగా చూపించాలనే కోణంలో కథనాలు వస్తున్నాయని ఆమె వాపోయింది.
తనపై తప్పుడు ప్రచారాల కారణంగా ఇంట్లో నుంచే బయటకు రావాలన్న ఆత్మవిశ్వాసం కోల్పోయినట్టు చెప్పిన నీలిమ, రాజకీయ నాయకులను ఆశ్రయించాను. వారికి నా బాధను చెప్పాను. కానీ న్యాయం జరగలేదని తెలిపింది. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలంటూ విజ్ఞప్తి చేసింది. ఒక మహిళగా మిమ్మల్ని ఆశ్రయించాను. నా గౌరవం కోసం పోరాడుతున్నాను. నన్ను తప్పుగా ముద్రవేసే ప్రయత్నం చేస్తున్న వారిని శిక్షించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరుతోంది.
నిత్య పెళ్లికూతురు ఆరోపణలపై స్పందించిన నీలిమ
అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ తాను నిత్య పెళ్లికూతురిని కాదని, 12 పెళ్లిళ్లతో మోసం చేసినట్లు మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని తెలిపింది. తప్పుడు ప్రచారాలపై రామచంద్రపురం పోలీసులకు ఫిర్యాదు… https://t.co/vMVKxbtsS1 pic.twitter.com/eB1Zju49Gt
— ChotaNews App (@ChotaNewsApp) June 24, 2025
నీలిమ మాటల్లో ఆవేదనతో పాటు ఒక పోరాటం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకరికి ఆర్థికంగా సహాయం చేస్తే.. అది మానవత్వం. కానీ అది పెళ్లి అయిపోతుందా? ఒకరి ఇంటికి వెళ్లితే.. అది సంసారం అయిపోతుందా? ఇలా తప్పుడు అర్థాలు వేసుకుని నన్ను నిత్య పెళ్లికూతురుగా చూపించడం సమాజం గౌరవాన్ని దిగజార్చడమే అని నీలిమ ఘాటుగా పేర్కొంది.
తన కుటుంబం కూడా ఈ తప్పుడు ప్రచారాల వల్ల బాగా ఇబ్బంది పడుతోందని చెప్పింది. ఈ ఘటన సామాజిక మీడియా వ్యవహార శైలిపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒకరి పట్ల ఆరోపణలు వస్తే, నిజానిజాల దృష్టికోణంలో కాకుండా ట్రెండింగ్ కోణంలో చూడడం, షేర్ చేయడం, వీడియోలుగా మార్చడం.. ఇవన్నీ వ్యక్తిగత గౌరవాన్ని ఎలా నాశనం చేస్తున్నాయో ఈ ఘటన ఓ ఉదాహరణగా మారిందని ఆమె మద్దతుదారులు అంటున్నారు.
నీలిమ చివరగా చెప్పింది ఏమిటంటే.. నిజం తేలేదాకా నేను పోరాడుతాను. ఎవరు నన్ను అపహాస్యం చేయాలనుకుంటే.. వారికే చివరకు నిజం ఎదురవుతుంది. నేను నిత్య పెళ్లికూతురు కాదు. నేను గౌరవంగా బతకాలనుకుంటున్న సాధారణ యువతి. సత్యం ఎప్పుడైనా వెలుగు చూసే రోజుకొస్తుంది. కానీ అప్పటివరకు మౌనంగా ఉండకూడదనేది మీడియా ముందుకు వచ్చినట్లు నీలిమ చెప్పుకొచ్చారు. మరి నీలిమ వ్యవహారం భవిష్యత్ లో ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.