Nagababu: నాగబాబు పదవి విషయంలో ఏం జరుగుతోంది? రాష్ట్రంలో ఉంటారా? లేక సెంట్రల్‌కి వెళ్తున్నారా? ఇంతకీ మార్చిలో మంత్రిగా నాగబాబు ప్రమాణ స్వీకారం చేస్తారా? ఇవే ప్రశ్నలు జనసేన నేతలను వెంటాడుతున్నాయి.
జనసేన నేత నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు ఆ మధ్య సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆ విషయం జరిగి దాదాపు రెండు నెలలు గడిచిపోయాయి. కాకపోతే కూటమి పార్టీల నుంచి ఎలాంటి కదలిక రాలేదు. దీంతో నాగబాబు పదవిపై రకరకాల ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో ఆయన ఎంపీ పదవిపై ఫోకస్ చేసినట్టు ఊహాగానాలు గుప్పుమన్నాయి. ఇంతకీ కూటమిలో ఏం జరుగుతోంది?
మార్చి తర్వాత నాగబాబు మంత్రివర్గంలోకి వస్తున్నారని అధికార పార్టీ నేతల మాట. ఇప్పటికే నలుగురు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. వీరంతా గవర్నర్, ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికయ్యారు. వారిలో కర్రిపద్మ గవర్నర్ కోటా కాగా, ఎమ్మెల్యేల కోటాలో కల్యాణ చక్రవర్తి, పోతుల సునీత, వెంకటరమణ ఉన్నారు.
ఇంతవరకు ఆయా సభ్యుల రాజీనామాలను మండలి ఛైర్మన్ ఆమోదించలేదు. ఆయన ఆమోదించే ఉంటే ఈపాటికి ఎన్నికలు జరిగేవి. దీంతో నాగబాబు పరిస్థితి ఏంటన్నది అసలు ప్రశ్న. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలను గమనించిన కొందరు జనసేన సీనియర్లు, నాగబాబు రాజ్యసభకు వెళ్తే బెటరని అంటున్నారు.
ALSO READ: ఏపీలో ఐప్యాక్ రీఎంట్రీ..
ఇదిలాఉండగా మార్చి 29న ఐదు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతున్నాయి. టీడీపీ నుంచి దువ్వారపు రామారావు, అశోక్ బాబు, తిరుమలనాయుడు, యనమల, జంగా కృష్ణమూర్తి పదవీకాలం ముగియనుంది. అందువల్లే ఆలస్యమవుతోందన్నది అధికార పార్టీ నేతల మాట. ఎమ్మెల్సీ అయిన తర్వాత మంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని ఒకానొక సందర్భంలో పవన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో నాగబాబు రాజ్యసభకు వెళ్తే బెటరని అంటున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఆ సీటు ఖాళీ అయ్యిందని అంటున్నారు. ఒకవేళ నాగబాబు రాజ్యసభకు వెళ్తే.. మంత్రి పదవి కోసం జనసేన నుంచి దాదాపు అరడజను మంది పోటీ పడుతున్నారు. మొత్తానికి రానున్న రోజుల్లో ఏం జరగనుందో చూడాలి.