France Lottery Thief Winner | ‘దేవుడు కరుణించినా పూజారి శనిరూపంలో అడ్డుపడ్డాడట’.. అనే నానుడి తాజాగా ఒక దొంగ విషయంలో నిజమైంది. దొంగతానికి అలవాటు పడ్డ యువకులు ఒక కారులో నుంచి ఒక బ్యాగు కాజేశారు. అందులో ఉన్న డెబిట్ కార్డుతో షాపింగ్ చేశారు. ఈ క్రమంలో ఒక లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. ఇప్పుడా లాటరీ టికెట్ యజమానినే లాటరీ సంస్థ విజేతగా ప్రకటించింది. ఆ లాటీర మొత్తం విలువ రూ.4.5 కోట్లు. కానీ ఆ లాటరీ గురించి ఆ డెబిట్ కార్డు యజమానికి తెలిసింది. దీంతో ఆ యజమాని లాటరీ నగదు బహుమతి కావాలంటున్నాడు. కానీ అరెస్టు భయంతో దొంగలు బయటికి రావడం లేదు. దీంతో రూ.4.5 కోట్ల లాటరీ బహుమతి అలాగే ఊగిసలాడుతోంది. ఇదంతా ఫ్రాన్స్ దేశంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఫ్రాన్స్ దేశంలోని టౌలౌస్ అనే నగరానికి చెందిన జీన్ డేవిడ్ అనే వ్యక్తి తన కారులో కొన్ని రోజుల క్రితం ప్రయాణిస్తుండగా.. మార్గమధ్యంలో కాసేపు ఆగి బాత్ రూమ్ కోసం వెళ్లాడు. అప్పుడే అతని కారులో నుంచి దొంగలు అతని బ్యాగుని కాజేశారు. ఆ బ్యాగులోనే డేవిడ్ పర్సు ఉంది. అందులో అతని నగదు, డెబిట్, క్రెడిట్ కార్డులున్నాయి. అయితే ఆ దొంగలు అక్కడి నుంచి బయలుదేరి కొంత దూరంలో ఉన్న సూపర్ మార్కెట్ లో షాపింగ్ చేశారు. ఆ సమయంలోనే అక్కడ ఉన్న ఒక లాటరీ టికెట్ కొనుగోలు చేశారు.
Also Read: పెళ్లికూతురు బట్టలు లేకుండా వారం పాటు ఉండాల్సిందే.. విచిత్ర సంప్రదాయం
మరోవైపు జీన్ డేవిడ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తన కారులో నుంచి ఎవరో తన బ్యాగు కాజేశారని అందులో తన ఏటియం కార్డు, నగదు, ముఖ్యమైన వస్తువులున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు అతని డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల నెంబర్ తో బ్యాంకు వారిని సంప్రదించి విచారణ చేశారు. అప్పుడే వారికి ఒక విషయం తెలిసింది. డేవిడ్ డెబిట్ కార్డుతో ఫలానా సూపర్ మార్కెట్ లో షాపింగ్ చేశారని.. పోలీసులు ఆ సూపర్ మార్కెట్ వెళ్లి.. దర్యాప్తు చేయగా.. వారికి మొత్తం షాపింగ్ వివారాలు తెలిశాయి.ఈ క్రమంలో ఆ దొంగలు ఏ లాటరీ టికెట్ కొన్నారో దాని నెంబర్ కూడా తెలిసింది.
ఈ విషయాలన్నీ పోలీసులు ద్వారా డేవిడ్ కు తెలిశాయి. అయితే ఆశ్చర్యకరంగా డేవిడ్ ఆ లాటరీ ఫలితాలు చూశాడు. అందులో ఆ లాటరీ విలువ రూ.4.5 కోట్ల (5,00,000 యూరోలు) అని.. ఆ దొంగ కొన్ని లాటరీ నెంబర్ నే విన్నర్ అని లాటరీ కంపెనీ ప్రకటించింది. ఇది చూసి డేవిడ్ నమ్మలేకపోయాడు. ఎలాగైనా ఆ లాటరీ బహుమతి పొందాలని ప్రయత్నిస్తున్నాడు. తన కార్డుతో లాటరీ కొనుగోలు చేశారు కాబట్టి ఆ బహుమతి తనకే దక్కాలని కోర్టులో కేసు వేశాడు. కానీ లాటరీ కంపెనీ మాత్రం లాటరీ తీసుకొస్తేనే బహుమతి అని స్పష్టం చేసింది.
దీంతో ఇప్పుడు స్థానిక పోలీసులు, డేవిడ్ ఆ దొంగలను వెతికేపనిలో పడ్డారు. చివరి డేవిడ్ తాను దొంగలకు సగం లాటరీ బహుమతి ఇస్తానని తన లాయర్ ద్వారా ప్రకటించాడు.అయినా ఆ దొంగలు అరెస్టు భయంతో బయటికి రాలేదు. లాటరీ విక్రయించిన సూపర్ మార్కెట్ ఓనర్ మాట్లాడుతూ.. ఆ రోజు ఇద్దరు యువకులు తన స్టోర్ లో వచ్చి సిగరెట్లు, బ్రెడ్, ఒక లాటరీ టికెట్ కొన్నారని.. వారు అప్పుడే లాటరీ టికెట్ స్క్రాచ్ చేసి విజేత నెంబర్ అని చూసుకున్నారని తెలిపాడు. ఆ దొంగలు దీన స్థితిలో కనిపించారని.. లాటరీ గెలిచిన సంతోషంలో సిగరెట్లు అక్కడే మరిచిపోయి త్వరగా అక్కడి నుంచి వెళ్లిపోయారని అన్నాడు.