Jagan Letter :
Jagan Letter : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ అధికార కూటమి నేతల ఆగ్రహంతో.. వరుస అరెస్టులకు పోలీసులు సిద్ధమైన వేళ.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. సీఎం చంద్రబాబు నలబై ఏళ్లుగా వ్యవస్థీకృత నేరాలు చేస్తూ.. ఇప్పుడు ఆయన లానే అందరూ చేస్తారన్నట్లు ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేయడాన్ని తప్పుపడుతూ.. ఐదు ప్రశ్నలతో సీఎం చంద్రబాబుకు.. సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
నియంతలా మారావు..
చంద్రబాబు తీరు దొంగే ఎదుటివారిని పట్టుకుని దొంగా అన్నట్టుగా ఉందని.. నలభై ఏళ్లుగా అర్గనైజ్డ్ క్రైమ్స్ కు పాల్పడుతున్న చంద్రబాబు ఇప్పుడు కూడా అదే చేస్తూన్నారని అన్నారు. పైగా.. ఆ ఎదుటివారి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని చేసిన స్కాం లు, అవినీతిని బయట పెడుతున్నారని, తన పాలనా వైఫల్యాల్ని ఎత్తిచూపుతున్నారనే.. దురహంకారంతో నియంతలా వ్యవహరిస్తున్నారని అన్నారు. అందుకే.. సోషల్ మీడియా వేదికగా గొంతు విప్పుతున్నవారిని, ముఖ్యంగా చంద్రబాబు తప్పుల్ని నిలదీస్తున్న యువతను లక్ష్యంగా చేసుకుని చట్టవిరుద్ధంగా, అన్యాయంగా, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని అన్నారు. తన అడుగులకు మడుగులొత్తే పోలీసులను వాడుకుంటూ.. సోషల్ మీడియా యాక్టివిస్టులపై భౌతిక దాడులు చేయిస్తూ, హింసిస్తున్నారని ఆరోపించారు.
సోషల్ మీడియా అంటే భయం
రాష్ట్రంలోని మెజార్టీ న్యూస్ పేపర్లు చంద్రబాబు చేతిలోనే ఉన్నాయని, తమ మాటవినని కొన్ని టీవీలని వస్థీకృతంగా దెబ్బ తీశారని అరోపించారు. తనకు నచ్చని ఛానళ్లను కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి వాటి ప్రసారాలు నిలిపివేశారని అన్నారు. వీటన్నింటి మధ్య చంద్రబాబుకు సోషల్ మీడియా ఇబ్బందికరంగా మారిందని జగన్ ఆరోపించారు. అందుకే బరితెగించి.. అరెస్టులు చేయిస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఒక చేత్తో తన మీడియాను, మరో చేత్తో వ్యవస్థలను, ఆ వ్యవస్థల్లోని తన మనుషులను వాడుకుని నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబు చేస్తున్న ఆర్గనైజ్డ్ క్రైమ్స్ చూస్తూనే ఉన్నాం. మరి ఆర్గనైజ్డ్ క్రైమ్స్‌కు పాల్పడుతున్నది ఎవరు? అంటూ ప్రశ్నించారు.
అబద్ధాలు చెప్పేందుకు ఓ వ్యవస్థ..
ప్రజలను మభ్యపెట్టి, మోసం చేసి, అబద్ధాలాడైనా అధికారంలోకి రావాలని, వచ్చాక దాన్ని నిలబెట్టుకోవాలనేదే చంద్రబాబు సిద్ధాంతమన్నారు. తన అవసరం కోసం బాబు ఓ అబద్దాన్ని సృష్టిస్తే.. దానికి రెక్కలు తొడిగి బాబు మీడియా ప్రచారం చేస్తుందని ఆగ్రహించారు. దానిపైనే వారి పార్టీ నాయకుల చేత మాట్లాడిస్తారు. పనిలో పనిగా దత్తపుత్రుడిని, ఇతర పార్టీల్లో తనకు అనుకూలంగా ఉన్న వారిని కూడా దీనికి వాడుకుంటారు. ఆ తర్వాత డిబేట్లు చేయిస్తారు. దీనికి మరిన్ని అవాస్తవాలు జోడించి తన కుమారుడు లోకేష్‌ద్వారా సోషల్ మీడియాలో విష ప్రచారం చేయిస్తారు. వాళ్లే ఆరోపణలు చేసి, వాళ్లే మీడియా ట్రయల్ చేసి, వాళ్లే దోషులెవరో నిర్ధారించి, వాళ్లే శిక్షలు విధిస్తారు. ఒక పథకం ప్రకారం, మాఫియా ముఠా మాదిరిగా చంద్రబాబు ఈ నేరాలు చేస్తూనే ఉన్నారు. ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీయడానికి, రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. మరి ఇది వ్యవస్థీకృత నేరం కాదా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
మొన్న మీరు చేసిన పనేంటి?
అయ్యా చంద్రబాబూ, మీ టీడీపీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో మీరే ఫేక్ న్యూస్ పెట్టి, దాన్ని మీరే ప్రొపగండా చేసిన లేటెస్ట్ ట్వీట్‌ను రాష్ట్ర ప్రజలంతా గమనించారు. ఎప్పుడో రెండేళ్ల కిందట మా అమ్మ కారు టైర్ బరస్ట్ అయితే, అప్పటి వీడియోను ఇప్పుడు బయటకు తీసి, లేటెస్ట్‌గా ఇప్పుడే జరిగినట్టుగా, మీరు ట్వీట్‌లో పెడుతూ, నా తల్లిని నేను చంపాలని అనుకున్నానని సిగ్గుమాలిన వ్యక్తిత్వ హననానికి నువ్వు దిగావు. దీన్ని ఖండిస్తూ మా అమ్మ లేఖ రాస్తే దాన్ని కూడా ఫేక్ లెటర్‌గా పేర్కొంటూ నువ్వు పబ్లిసైజ్ చేయడం సిగ్గుమాలిన చర్య కాదా? మళ్లీ మా అమ్మ సాక్షాత్తూ వీడియో మెసేజ్ కూడా ఇస్తూ మీ తీరును దుయ్యబట్టింది. ఇంతలా ఉద్దేశ పూర్వకంగా వ్యక్తిత్వ హననం చేసిన నిన్ను, నీ కొడుకును ఇదే పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదు? ఇలాంటివి మీ అనుకూల మీడియా ఎన్ని చేసినా పోలీసులు ఏనాడైనా చర్యలు తీసుకున్నారా? నువ్వు చేస్తే ఏదైనా మంచే! కాని నువ్వు చేసిన తప్పుడు పనులను, ప్రజా వ్యతిరేక చర్యలను ఎవరైనా ప్రశ్నిస్తే అది చెడు అవుతుందా? వారిపై కేసులుపెట్టి వారిని హింసించడం ధర్మమేనా? అని జగన్ ట్వీట్ చేశారు.
తప్పించుకునేందుకే ఈ పనులు..
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్గనైజ్డ్ క్రైమ్‌తో కూడిన పాలిటిక్స్‌లో చంద్రబాబు మరింతగా బరితెగించారని వ్యాఖ్యానించిన జగన్.. మొన్నటి తిరుమల లడ్డూ వ్యవహారం వరకూ జరిగిన అనేక పరిణామాలు దీనికి ఉదాహరణ అని అన్నారు. కూటమి 100 రోజుల పాలన, మోసాలు, వైఫల్యాల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చంద్రబాబు సృష్టించిన అబద్ధాన్ని ఎల్లో మీడియా మోయడం, ఆ తర్వాత ఆ పార్టీల నాయకులు, వారిని మోస్తున్న అధికారులు ప్రజల్లో అశాంతిని రేపేలా చర్యలు, కార్యక్రమాలు చేయడం ఒక పన్నాగం ప్రకారం జరిగాయని ఆరోపించారు. మరి వ్యవస్థీకృత నేరాల కింద అరెస్టు చేయాల్సింది ఎవరిని? జీవిత ఖైదు వేయాల్సింది ఎవరికి? చంద్రబాబుకి కాదా? అంటూ ట్విట్టర్లో సుదీర్ఘ పోస్ట్ చేశారు.
1.దొంగే… ఎదుటివారిని పట్టుకుని దొంగా అన్నట్టుగా చంద్రబాబుగారి తీరు ఉంది. నలభై ఏళ్లుగా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న చంద్రబాబుగారు ఇప్పుడు కూడా అదే చేస్తూ ఎదుటివారి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తన స్కాంలు బయటపడుతున్నాయని, తాను చేసిన అవినీతి బయటకు వస్తోందని, తన పాలనా…
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 9, 2024