Selfie with YS Jagan: అన్నా.. జగనన్నా.. ఒక్కసారి చేయి చాచన్నా.. ప్లీజ్ అంటూ ఓ చిన్నారి ఏడుస్తూ.. మాజీ సీఎం జగన్ ను ప్రాధేయపడింది. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విజయవాడలో జగన్ పర్యటన సంధర్భంగా మంగళవారం ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ జైలులో ఉన్న విషయం తెల్సిందే. వంశీని పరామర్శించేందుకు బెంగుళూరు నుండి జగన్ విజయవాడకు వచ్చారు. జగన్ వస్తున్న సంధర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు జైలు ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. వంశీని పరామర్శించి మీడియాతో జగన్ మాట్లాడారు. అక్కడ మాట్లాడిన జగన్, నేరుగా తన వాహనంలోకి ఎక్కే ప్రయత్నం చేస్తుండగా, ఓ చిన్నారి రోదిస్తూ తనవైపు చేయి చాచుతున్న దృశ్యాలు జగన్ కంట పడ్డాయి. వేలాదిగా వచ్చిన అభిమానుల మధ్య ఆ చిన్నారిని ఎవరో ఎత్తుకొని ఉన్నారు. అంతమంది జనంలోనూ, ఆ చిన్నారి మాత్రం జగనన్నా అంటూ గట్టిగా కేకలు వేస్తోంది.
అంతేకాదు.. చేయి చాచుతూ ఒక్కసారి చేయి తాకన్నా అంటూ కేకలు వేసింది. కొద్దిక్షణాల్లోనే రోదిస్తూ ఒక్కసారి జగనన్నా కలుస్తానంటూ గట్టిగా అరిచింది. ఆ దృశ్యాన్ని చూసిన జగన్ వెంటనే తన సిబ్బందికి తప్పనిసరిగా ఆ చిన్నారిని తీసుకురండి అంటూ పురమాయించారు. అలా ఆ చిన్నారి వచ్చిందో రాలేదో.. జగన్ ను గట్టిగా హత్తుకోగా అభిమానులు జై జగన్ అంటూ నినదించారు. సెల్ఫీ కావాలని చిన్నారి అడగగా, జగన్ స్వయంగా సెల్ఫీ తీసి ఆ చిన్నారి కోరికను తీర్చారు. అలాగే చిన్నారి వివరాలు తెలుసుకొని, జాగ్రత్త అంటూ జగన్ సూచించారు.
జగన్ ను కలిసిన ఆనందంలో చిన్నారి చిరునవ్వులు చిందిస్తూ, అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అభం శుభం తెలియని చిన్నారి.. జగన్ పై చూపిన ప్రేమనే నాటి వైసీపీ పాలనకు సాక్ష్యమని వైసీపీ సోషల్ మీడియా కోడై కూస్తోంది. చిన్నారి అరుపులు విని, ఆ చిన్నారి కోరిక తీర్చి జగన్ పెద్ద మనసు చాటుకున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. అలాగే జగన్ తన పాలనలో అమ్మఒడి పథకాన్ని ప్రవేశ పెట్టడమే కాక, నాడు – నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చారని, అందుకే చిన్నారుల మనస్సులో చెరగని ముద్ర జగన్ వేసుకున్నారని వైసీపీ ప్రచారం చేస్తోంది.
Also Read: Fine for Drinking Water: నీటిని వృథా చేస్తున్నారా? ఏకంగా రూ. 5 వేలు ఫైన్ కట్టాల్సిందే..
మొత్తం మీద చిన్నారిని జగన్ దగ్గరికి తీసుకున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారగా వైసీపీ క్యాడర్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా మొన్నటికి మొన్న సీఎం చంద్రబాబు సభలో సెల్ఫీ కావాలని అడిగిన బాలిక కోరికను చంద్రబాబు తీర్చారని టీడీపీ అంటోంది. అయితే జగన్ జైలు వద్ద చేసిన కామెంట్స్ కంటే, ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి. జగన్ మాట్లాడుతూ.. పోలీసులు కూడా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు.. ఎల్లకాలం టీడీపీనే అధికారంలో ఉండదు.. అన్యాయాలు చేసిన వారిని బట్టలూడదీసి నిలబెడతామంటూ జగన్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
జగన్ విజయవాడ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం
జగన్ ను కలిసేందుకు కన్నీళ్లు పెట్టుకున్న ఓ చిన్నారి
చిన్నారిని దగ్గరికి తీసుకొని నుదిటిపై ముద్దు పెట్టి సెల్ఫీ ఇచ్చిన జగన్ pic.twitter.com/AvFvCupuuv
— BIG TV Breaking News (@bigtvtelugu) February 18, 2025