Nara Lokesh: మీకు ఏవైనా సమస్యలు ఉంటే నాకు చెప్పండి. మీరు నాతో సమన్వయం చేసుకోండి.. నేను కూడా మీతో సమన్వయం చేసుకుంట. అంతేకానీ కూటమిలో విడాకులు లాంటివి ఉండవని మంత్రి నారా లోకేష్ తేల్చి చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించిన నారా లోకేష్ కూటమి నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కూటమి నాయకులకు నారా లోకేష్ క్లాస్ తీసుకున్నారని చెప్పవచ్చు.
లోకేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గత ఎన్నికల్లో 94% సీట్లు ఎన్డీఏ కూటమి సాధించిందన్నారు. ఐదు సంవత్సరాలు సైకో రాష్ట్రాన్ని పరిపాలించారని మాజీ సీఎం జగన్ ను ఉద్దేశించి సీరియస్ కామెంట్ చేశారు. కేంద్రం ఏది అడిగినా ఏపీకి అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన సహకరిస్తుందని తెలిపారు. గతంలో ఎక్కడైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై దాడి చేశారో, అక్కడే తనపై కూడా దాడి చేశారన్నారు. తాము వాటికి భయపడకుండా నిలబడినందుకే నేడు ఏపీలో ప్రజా ప్రభుత్వం వచ్చిందన్నారు.
151 స్థానాలు గెలిచిన పార్టీకి 11 స్థానాలు ప్రజలు ఇచ్చారంటే, మనం చాలా జాగ్రత్తగా పని చేయాల్సి ఉంటుందని కూటమినేతలకు లోకేష్ సూచించారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా, ఎన్డీఏ కూటమి పింఛన్ ను అందిస్తుందన్నారు. కూటమిలో మిస్ ఫైర్, క్రాస్ ఫైర్, విడాకులు లాంటి పదాలకు చోటు ఉండదని, కూటమిని విడదీసే పనిలో సైకో జగన్ నిరంతరం సహాయ శక్తులకు కృషి చేస్తున్నారని లోకేష్ విమర్శించారు.
RRR కు కొత్త అర్థం చెప్పిన లోకేష్..
RRR కు కొత్త అర్థం చెప్పారు మంత్రి నారా లోకేష్. ఉండి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన నారా లోకేష్ బహిరంగ సభలో మాట్లాడారు. ముందుగా ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజుతో కలిసి, ఉండి హై స్కూల్ నుండి రూ. 16 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును లోకేష్ ప్రారంభించారు. అనంతరం పెదఅమిరం గ్రామంలో ప్రముఖ దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా విగ్రహాన్ని లోకేష్ ఆవిష్కరించారు.
అలాగే స్థానిక ప్రభుత్వ పాఠశాలను లోకేష్ సందర్శించి, విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతమయ్యేలా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఇక ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గురించి మాట్లాడిన లోకేష్.. చంద్రబాబు అరెస్టు సమయంలో ఆయన అందించిన సహాయ సహకారాలను వివరించారు. మన కష్టనష్టాలు పంచుకునే స్నేహితులు మనకు జీవితంలో ఎంతో అవసరమని, చదువు ఎంత ముఖ్యమో స్నేహితులు కూడా అంతే ముఖ్యమన్నారు.
Also Read: AP Scheme: ఏపీలో మరో స్కీమ్.. ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు కానీ..!
రఘురామ కృష్ణంరాజును త్రిబుల్ ఆర్ అని అందరూ పిలుస్తారని, త్రిబుల్ ఆర్ అంటే రియల్ రెస్పాన్సిబుల్ రెబల్ అంటూ లోకేష్ కొత్త అర్ధాన్ని చెప్పారు. లోకేష్ తన గురించి చెబుతున్నంతసేపు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు చిరునవ్వులు చిందించారు. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త రతన టాటా జీవితం అందరికీ ఆదర్శమని లోకేష్ తెలిపారు. బసవతారకం వైద్యశాలకు విరాళం ఇచ్చిన దగ్గర నుండి, ఆయన చనిపోయే ముందు కూడా విశాఖలో టిసిఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసే వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టాటా ఎంతో మేలు చేశారని లోకేష్ అన్నారు. లోకేష్ పర్యటన సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున కరచాలనం చేసేందుకు అమిత ఆసక్తి చూపారు. అంతేకాకుండా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడంపై లోకేష్ కు స్థానిక విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు