ఏపీ సీఎం చంద్రబాబు నాగబాబును మంత్రి చేయనున్నట్లు ప్రకటించేశారు. ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన,బీజేపీలు కలసి పోటీ చేశాయి. అయితే అప్పట్లో నాగబాబు కూడా పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ సీట్ల సర్ధుబాటులో భాగంగా నాగబాబు ఎన్నికల్లో పోటీ చేయకుండా కామ్‌గా ఉన్నారు. అప్పట్లో కూటమి గెలవడమే ధ్యేయంగా పని చేశారు. ఆ ఫలితం ఇప్పుడు జనసేనకు దక్కిన్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సీటును కూడా నాగబాబు వదులుకున్నారు. ఆ త్యాగ ఫలితమే ఇప్పుడు మంత్రి పదవి దక్కిందనే టాక్ వినిపిస్తోంది.
ఈ తరుణంలో.. మంత్రి పదవి ప్రకటనతో నాగబాబుపై ట్రోలింగ్ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లింది. పాత వీడియోలను పోస్ట్ చేస్తూ నాగబాబును ఎకిపారేస్తున్నారు తెలుగుతమ్ముళ్లు. అంతేకాదు.. అటు టీడీపీ, ఇటు జనసేనలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు వెల్లువెత్తాయి. చంద్రబాబు, పవన్ పై విరుచుకుపడుతున్నారు రెండు పార్టీల కార్యకర్తలు. ఒకప్పుడు చంద్రబాబు, బాలకృష్ణని ఇష్టమొచ్చినట్టు తిట్టిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడమేంటని సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాడు చంద్రబాబు టార్గెట్‌గా నాగబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ విషయంలో నేరుగా చంద్రబాబుపైనే విమర్శలు చేస్తున్నారు కార్యకర్తలు. టీడీపీ కోసం ఎంతోమంది కష్టపడ్డారని.. కానీ సామాజిక న్యాయం పేరుతో నాగబాబు లాంటివారికి పదవి కట్టబెట్టడం సరికాదంటున్నారు తెలుగుదేశం కార్యకర్తలు. ఇకపై తాము టీడీపీ తరఫున పోరాటం చేయబోమంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవికి అర్హులైన ఎంతోమందిని వదిలేసి అసలు ఎమ్మెల్యే కూడా కాని వ్యక్తిని.. కేవలం పవన్ సోదరుడనే కారణంతో మంత్రిపదవి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. కేబినేట్ అంతా జబ్బర్దస్త్ షో చేస్తారా అంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.
Also Read: అరెరే అంబటి.. జగన్ ఇలా చేస్తారని కలలో కూడా ఊహించి ఉండరు కదా!
మరోవైపు తమ పార్టీలో వారసత్వ రాజకీయాలు ఉండవంటూ గతంలో పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తనకు కులం లేదు.. మతం లేదంటూనే పార్టీలో మూడు మంత్రి పదవులను కేవలం కాపులకే ఇవ్వడంపై మిగిలిన సామాజిక వర్గాల వారు గుర్రుగా ఉన్నారు.
ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్ధులు ఖరారు అయ్యారు. బీజేపీ నుంచి ఒకరిని, టీడీపీ నుంచి ఇద్దర్ని ఎంపిక చేయాలని కూటమి అధిష్ఠానం నిర్ణయించింది. ఈ క్రమంలోనే టీడీపీ నుంచి సానా సతీష్, బీద మస్తాన్ రావును ఎంపిక చేయగా.. బీజేపీ ఆర్.కృష్ణయ్యకు ఛాన్స్ ఇచ్చింది. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నికలు వచ్చాయి. కానీ పార్టీ మారిన తర్వాత కూడా ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్ రావుకు మళ్లీ అవకాశం దక్కడం హాట్ టాపిక్ గా మారింది.