AP Assemble : ఏపీ అసెంబ్లీలో అధికార పార్టీ నాయకుల మధ్య జరిగిన చర్చ ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీ మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే మధ్య విభేదాలు రావడంతో అవి ఎలాంటి పరిణామాలకు, వివరణలకు దారితీస్తాయోనన్న ఉత్కంఠ నెలకొంది. వివిధ అంశాలపై ఏపీ శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇంతకీ.. వీరిద్దరి మధ్య ఏం జరిగింది అంటే..
ఏపీ శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఓ ప్రశ్నకు సమాధాం చెబుతూ.. గత ప్రభుత్వ హయాంలో అక్రమ మైనింగ్ అడ్డూ అదుపు లేకుండా సాగయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ముఖ్యంగా మైలవరం ప్రాంతంలోనూ మైనింగ్ కార్యక్రమాలు విరివిగా సాగయన్న మంత్రి..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి అడ్డుకట్ట వేసినట్లు వెల్లడించారు. అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో.. గత ఎమ్మెల్యే ప్రోద్భలంతో అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయని ఆరోపించారు. ప్రస్తుతం తాము.. చట్ట ప్రకారం అక్రమ మైనింగ్ ను కట్టడి చేశామంటూ ప్రకటించారు.
అప్పటి వరకు అంతా బాగానే ఉందనుకున్నారు. కానీ.. అంతలోనే మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మంత్రి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మైలవరంలో మైనింగ్ లో అక్రమాలు జరిగాయని మంత్రి ప్రకటించడాన్ని తప్పుపట్టారు. పైగా గత ఎమ్మెల్యే హస్తం ఉందని మంత్రి శాసన మండలిలో చెప్పారని, అది తన గురించే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలతో సభలో నా పరువుకు భంగం కలిగిందంటూ వసంత కృష్ణ ప్రసాద్ సభలో మంత్రి వ్యాఖ్యలపై తన నిరసన తెలిపారు.
మైలవరంలో జరిగిన మైనింగ్ అక్రమాల్లో నా పేరు ఎప్పడు రాలేదన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. అధికారులు ఏ కేసులోనూ తన పేరును పెట్టలేదని గుర్తు చేశారు. అయినా కూడా అక్రమాల్లో నా పాత్ర ఉందని మంత్రి ప్రకటించడం సరికాదంటూ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆగ్రహించారు. దాంతో.. సభలో కాస్త ఉత్కంఠ వాతావరణ ఏర్పడింది. వెంటనే స్పందించిన మంత్రి కొల్లు రవీంద్ర.. తాను వసంత కృష్ణ ప్రసాద్ గురించి ఏమీ అనలేదని వివరణ ఇచ్చారు. తాను పోలవరం కాలువల మట్టి తవ్వకాల అక్రమాలు జరిగాయని చెప్పానని, అందులో ఓ మాజీ శాసన సభ్యుడి పాత్ర ఉందని అన్నానని వివరించారు.
తాను మైలవరం ఎమ్మెల్యే గురించి అనలేదన్న మంత్రి కొల్లు రవీంద్ర.. తాను చేసిన వ్యాఖ్యాలు జోగి రమేష్ ను ఉద్దేశించి చేసినవిగా చెప్పుకొచ్చారు. దాంతో.. సభలో వాతావరణం శాంతించింది.
అయితే.. వాస్తవానికి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైసీపీ లో ఉన్నారు. అప్పుడు ఆయన పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారంటూ దేవినేని ఉమామహేశ్వర రావు ఉద్యమాలు చేశారు. అయితే.. ఎన్నికలకు ముందు పార్టీ మారిన వసంత కృష్ణ ప్రసాద్..టీడీపీలో చేరి విజయం సాధించారు. దాంతో.. మంత్రి కొల్లు చేసిన వ్యాఖ్యలు తనని ఉద్దేశించే అని.. కృష్ణ ప్రసాద్ ఫీల్ అయ్యారు. అటు పార్టీ వారు అటు, అటు వారు ఇటు అయితే.. ఇలాంటి సమస్యలే వస్తాయి మరి అన్నట్లుంది.. ఈ వ్యవహారం చూసిన వాళ్లకు.