BigTV English

Maoist Encounter : చంద్రబాబుపై అలిపిరి దాడి మాస్టర్ మైండ్ మావోయిస్ట్ చలపతి ఎన్‌కౌంటర్

Maoist Encounter : చంద్రబాబుపై అలిపిరి దాడి మాస్టర్ మైండ్ మావోయిస్ట్ చలపతి ఎన్‌కౌంటర్

Maoist Encounter : 


⦿ కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి హతం
⦿ చంద్రబాబుపై అలిపిరి బాంబు దాడిలో కీలక సూత్రధారి
⦿ ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ ఎదురుకాల్పుల్లో మృతి
⦿ చలపతి తలపై ఏకంగా రూ.1 కోటి రివార్డ్
⦿ నక్సల్స్‌కు భారీ ఎదురుదెబ్బ
⦿ భద్రతా బలగాలకు భారీ విజయం
⦿ నక్సలిజం కొనఊపిరితో ఉందన్న హోంమంత్రి అమిత్ షా

గరియాబంద్, స్వేచ్ఛ: మావోయిస్టుల అత్యున్నత స్థాయి నిర్ణయాధికార విభాగమైన ‘కేంద్ర కమిటీ’ సభ్యుడు, 2003 అక్టోబరు 1న నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు టార్గెట్‌గా మావోయిస్టులు జరిపిన క్లెమోర్‌ మైన్స్‌ దాడిలో కీలక సూత్రధారి అయిన చలపతి అలియాస్ రామచంద్రా రెడ్డిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్‌లో సోమవారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో చలపతి చనిపోయాడని భద్రతా దళాలు వెల్లడించాయి. చలపతి స్వస్థలం రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా.


బస్తర్‌లోని అబుజ్‌మద్‌ దండకారుణ్యంలో అతడు చాలాకాలం పాటు చురుకుగా కార్యకలాపాలు కొనసాగించాడు. మావోయిస్టులకు వ్యూహరచన చేయడంలో, కార్యకలాపాలను నడిపించడంలోనూ చలపతి కీలక పాత్ర పోషించాడు. అతడికి ఎల్లప్పుడూ 8 నుంచి 10 మంది వ్యక్తిగత గార్డులు భద్రత కల్పించేవారు. చలపతి తలపై ఏకంగా రూ.1 కోటి రివార్డు కూడా ఉంది. అబుజ్‌మద్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ల సంఖ్య పెరిగిపోవడంతో భద్రత కోసం కొన్ని నెలల క్రితమే చలపతి తన స్థావరాన్ని ఒడిశా సరిహద్దుకు మార్చాడని ఇంటలిజెన్స్ సంస్థలు పసిగట్టాయి. ఈ విషయాన్ని భద్రతా దళాలకు చేరవేశాయి. దాంతో.. పక్కా వ్యూహంతో, సమాచారంతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు.. చలపతిని మట్టుబెట్టాయి.

మొత్తం 20 మంది నక్సల్స్ హతం

గరియాబంద్ ఎన్‌కౌంటర్‌లో చలపతితో పాటు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు కూడా చనిపోయినట్టు భద్రతా దళాలు వెల్లడించాయి. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతుండడంతో ఈ సంఖ్య పెరగవచ్చని భద్రతా దళాల అధికారులు చెబుతున్నాయి. జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ), సీఆర్‌పీఎఫ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కోబ్రా, ఒడిశాకు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్‌నకు చెందిన దాదాపు 1,000 మంది భద్రతా దళాలు సంయుక్తంగా ఈ భారీ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. మావోయిస్టుల్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి కాల్పులు జరుపుతుండడంతో.. ఈ స్థాయిలో మావోలు మృత్యువాత పడ్డుతున్నారని అధికారులు తెలుపుతున్నారు.

ఒడిశాలోని నుపద జిల్లా సరిహద్దుకు కేవలం 5 కిలోమీటర్ల లోపల ఛత్తీస్‌గఢ్‌లోని కులారిఘాట్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఎన్‌కౌంటర్ జరుగుతోందని చెప్పారు. ఇంటలిజెన్స్ సమాచారం ఆధారంగా ఎన్‌కౌంటర్ మొదలుపెట్టామని వివరించారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్‌తో పాటు పెద్ద సంఖ్యలో తుపాకులు, మందుగుండు సామగ్రి, ఐఈడీలను స్వాధీనం చేసుకున్నామని ఒక అధికారి ప్రకటించారు. ఎదురుకాల్పులు జరిగిన ప్రదేశంలో భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని వివరించారు.

కొనఊపిరితో మావోయిజం

నక్సల్స్ రహిత భారతదేశాన్ని ఆవిష్కరించాలనే లక్ష్యంలో భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. గరియాబంద్ ఎన్‌కౌంటర్‌‌పై ఆయన ఈ విధంగా స్పందించారు. ‘‘నక్సలిజానికి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నక్సల్స్ రహిత భారత్ దిశగా మన భద్రత బలగాలు మరో భారీ విజయాన్ని సాధించాయి. సీఆర్‌పీఎఫ్, ఒడిశా స్పెషల్ గ్రూప్, ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఉమ్మడిగా చేపట్టిన ఆపరేషన్‌లో పెద్ద సంఖ్యలో నక్సల్స్ మృత్యువాతపడ్డారు. భద్రతా బలగాల ఉమ్మడి కృషితో నక్సలిజం కొనఊపిరితో ఉంది’’ అని అమిత్ షా పేర్కొన్నారు.

ఒడిశా ముఖ్యమంత్రి విష్ణు డియో సాయి కూడా భద్రతా బలగాలను మెచ్చుకున్నారు. భద్రతా దళాలు వరుస విజయాలు సాధిస్తున్నాయని, లక్ష్యం దిశగా ముందుకు దూసుకెళుతున్నారని ప్రశంసించారు. ‘‘మన సైనికులు సాధించిన అద్భుత విజయం ఇది. వారి ధైర్యానికి నేను సలాం చేస్తున్నాను’’ అని సీఎం పేర్కొన్నారు.

2024లో 200 మంది నక్సల్స్ ఖతం

దేశాన్ని 2026 మార్చి నాటికి ‘నక్సల్స్ రహిత భారత్‌’గా రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ క్రమంలోనే 2024లో దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ఒక్క ఛత్తీస్‌గఢ్‌లోనే భద్రతా బలగాల చేతిలో 200 మందికి పైగా నక్సల్స్ హతమయ్యారు. గతేడాది దేశవ్యాప్తంగా 219 మంది మావోయిస్టులు చనిపోగా, అందులో 217 మంది బస్తర్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో చనిపోయారు.

బస్తర్ ప్రాంతంలోని బస్తర్, దంతేవాడ, కాంకేర్, బీజాపూర్, నారాయణ పూర్, కొండగావ్, సుక్మా జిల్లాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచి 800 మంది నక్సల్స్ అరెస్టవ్వగా, 802 మంది జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. 2024లో మావోయిస్టులపై వ్యతిరేక పోరులో 18 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టుల హింసలో 65 మంది సాధారణ పౌరులు చనిపోయారు. ఇక 2025లో ఇప్పటి వరకు దాదాపు 40 మందికిపైగా నకల్స్ ఎన్‌కౌంటర్ అయ్యారని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×