మాజీ మంత్రి విడదల రజినిపై ఏసీబీ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ఆదివారం ఈ కేసు వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని, ఇందులో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హస్తం ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలపై ఎంపీ లావు ఈరోజు స్పందించారు. విడదల రజిని తనపై చేసిన వ్యక్తిగత ఆరోపణలను ఆయన ఖండించారు. అసలు కథ ఇదీ అంటూ ఆయన మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టారు.
ఏసీబీ కేసుని పక్కదారి పట్టించేందుకే..
విడదల రజిని ఎవరి ప్రోద్బలంతోనో తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు. ఆమె వెనక ఎవరో ఉండి మాట్లాడిస్తున్నారని చెప్పారు. తనపై చేసిన వ్యక్తిగత ఆరోపణలన్నిటికీ ఆయన వివరణ ఇచ్చారు. విద్యాసంస్థల కోసం తాము ఏ ప్రభుత్వం వద్దనుంచి కూడా భూములు తీసుకోలేదని అన్నారు. కేవలం ఆమెపై నమోదైన ఏసీబీ కేసుని పక్కదారి పట్టించేందుకే తనపై వ్యక్తిగత ఆరోపణలు చేశారన్నారు. కాల్ డేటా తీశారంటూ అంటూ తన క్యారెక్టర్ ని తప్పుబట్టేందుకు కూడా ఆమె ప్రయత్నించడం సరికాదన్నారు ఎంపీ.
బెదిరించింది మీరు కాదా..?
విడదల రజినిపై తానేదో పోలీసులకు ఫిర్యాదు చేయించానని ఆమె అంటున్నారని, కానీ స్టోన్ క్రషర్ కంపెనీతో ఆమెకున్న గొడవలకు సాక్ష్యాలివేనంటూ కొన్ని ఆధారాలు బయటపెట్టారు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు. గతంలో స్టోన్ క్రషర్ యాజమాన్యంపై ఎమ్మెల్యే హోదాలో ఆమె పోలీసులకు, విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అదే సమయంలో పోలీసులు పట్టించుకోవట్లేదని, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి వద్దకు వెళ్లారని కూడా చెప్పారు. ఓ సాక్షి రిపోర్టర్ ని తీసుకుని ఆమె బాలినేని వద్దకు వెళ్లారని అన్నారు. ఆయనతో ఫోన్ కూడా చేయించారన్నారు. చివరకు స్టోన్ క్రషర్ యాజమాన్యంపై విజిలెన్స్ దాడులు చేయించారని చెప్పారు.
ఎంపీ వార్నింగ్..
మీరు మొదలు పెట్టారు, దీన్ని నేను కొనసాగిస్తా, ఎక్కడికి వెళ్తుందో చూసుకుందాం అంటూ మీడియా ముందే సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు. ఇప్పటి వరకూ తాను ఎవరి గురించి వ్యక్తిగత విమర్శలు చేయలేదని, ఎవరిపై కూడా ఫిర్యాదులు చేయలేదని, కానీ విడదల రజిని సహా మరికొందరు తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, వారే దీన్ని మొదలు పెట్టారన్నారు. తాను కూడా అన్ని అవకాశాలు వినియోగించుకుని ప్రతీకారం తీర్చుకుంటానని పరోక్షంగా హెచ్చరించారు ఎంపీ లావు.
మొత్తమ్మీద మాజీ మంత్రి విడదల రజిని, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయల మధ్య విమర్శల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన వైసీపీలో ఉన్నప్పుడే తన ఫోన్ కాల్ డేటా తీసుకున్నారంటూ రజిని ఇప్పుడు ఆరోపించడం ఆసక్తికరం. అప్పటి సీఎం జగన్ వద్ద పంచాయితీ కూడా జరిగిందని ఆమె అంటున్నారు. అయితే అప్పుడే ఆ విషయాన్ని విడదల రజిని ఎందుకు బయటపెట్టలేదని వైరి వర్గాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి. ఆ ప్రశ్నకు రజిని దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు ఎంపీ లావు టీడీపీలో పార్టీలో ఉన్నారు కాబట్టి, రజిని సునాయాసంగా ఆరోపణలు చేస్తున్నారు. ఎంపీ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. మీరు మొదలు పెట్టారు, మేం ముందుకు తీసుకెళ్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు.