AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కాం కీలక మలుపులు తిరుగుతోంది. విజయసాయిరెడ్డి ఎంట్రీతో కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతానికి బిగ్ బాస్ మాత్రం సేఫే అని తెలుస్తోంది. మేటర్ అంతా కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి చుట్టూనే తిరుగుతోంది. ఆ లింకులు ఎంపీ మిథున్‌రెడ్డి వరకూ వెళ్లాయి. సిట్ అధికారులు ఆయన్ను కూడా ప్రశ్నిస్తున్నారు. పరారీలో ఉన్న కసిరెడ్డి దొరికితేనే అసలు డొంక కదిలేదు. బిగ్ ఫిష్ చిక్కేది అని అంటున్నారు.
విజయసాయి ఇరికించేశారా?
ఇప్పటికే సిట్ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి చాలా తెలివిగా మాట్లాడారని తెలుస్తోంది. చెప్పాల్సిన మేరకే సమాధానం చెప్పారని.. అసలు గుట్టు తన గుప్పిట్లోనే దాచారని అంటున్నారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. విజయసాయిని సిట్ బృందం కేవలం నాలుగంటే నాలుగు ప్రశ్నలు మాత్రమే అడగడం. వాటికి ఆయన వ్యూహాత్మక సమాధానాలు చెప్పడం. లిక్కర్ కేసులో సాక్షిగానే విజయసాయిని సిట్ ప్రశ్నించింది. ఆయనపై ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదు. సాక్షిగా పిలిచారు కాబట్టి.. సాయిరెడ్డి సైతం తాను చెప్పాలని ముందే ఫిక్స్ అయిన మేటర్ మాత్రమే చెప్పొచ్చారని చెబుతున్నారు. ఆయన చెప్పిందంతా కసిరెడ్డి గురించే. ఆయనో తెలివైన క్రిమినల్ అని.. అంతా రాజ్‌కే తెలుసునని.. సిట్ ముందు ఫిక్స్ చేశారు విజయసాయిరెడ్డి.
ఆ రూ. 100 కోట్లు..
అయితే, అనుకోకుండా విజయసాయిరెడ్డి నోటి నుంచి 100 కోట్ల మేటర్ బయటకు రావడం ఆసక్తికరంగా మారింది. అదాన్ డిస్టలరీస్, డికాక్ కంపెనీలకు తాను అరబిందో ఫార్మా నుంచి తాను 100 కోట్లు అప్పుగా ఇప్పించానని విజయసాయి చెప్పారు. ఆ లిక్కర్ కంపెనీల వెనుక మిథున్‌రెడ్డి, కసిరెడ్డిలు ఉన్నారని అంటున్నారు. అదాన్‌కు 60 కోట్లు, డికాక్‌కు 40 కోట్లను.. రూపాయి వడ్డీకి ఇప్పించారట. దీంతో.. విజయసాయి చెప్పిన సమాచారం మేరకు మిథున్‌రెడ్డిని పిలిపించి ఆ వివరాలు ఆరా తీస్తోంది సిట్.
స్కాంలో మిథున్‌రెడ్డి?
ఏపీ లిక్కర్ స్కాం కేసులో తనను అరెస్ట్ చేయవద్దంటూ ఇప్పటికే సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు ఎంపీ మిథున్‌రెడ్డి. విచారణకు సహకరించాల్సిందేనని సుప్రీం తేల్చిచెప్పడంతో.. ఆయన సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. అయితే, మిథున్‌రెడ్డిపై ఇంకా ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదు. కేవలం విజయసాయి చెప్పిన 100 కోట్ల అప్పు గురించే ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. ఆ డబ్బులు ఎక్కడ పెట్టారు? ఎవరికి ఇచ్చారు? వెనుక ఎవరు ఉన్నారు? కిక్ బాక్స్ ఎవరికి అందాయి? ఇలా విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారం ప్రకారమే మిథున్‌రెడ్డిని ప్రశ్నించినట్టు సమాచారం.
Also Read : ఓడినా మారని నేతలు.. జగన్‌కు చికాకు!
కసిరెడ్డి కోసం కసికసిగా..
విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలతో ఆగిపోయే విచారణ కాదిది. కీలక సూత్రధారి కసిరెడ్డి చిక్కితేనే అసలు కథ మొదలవుతుంది. కింగ్ పిన్ ఆయనే కాబట్టి.. ఆయనను విచారిస్తే అసలు కింగ్ ఎవరో బయటకు వస్తుందని అంటున్నారు. ఇప్పటికే 3 సార్లు నోటీసులు ఇచ్చినా.. ఆయన కార్యాలయాల్లో సోదాలు చేసినా.. తండ్రిని సైతం ప్రశ్నించినా.. కసిరెడ్డి రాజ్ మాత్రం ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు. చిక్కడు, దొరకడు టైప్‌లో తప్పించుకుంటున్నారు. తాజాగా ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారని తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తాను ఐటీ సలహాదారుగా మాత్రమే ఉన్నానని.. తనకు లిక్కర్ స్కాంతో సంబంధం లేదని.. అయినా తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ.. రక్షణ కల్పించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. సోమవారం ఆ పిటిషన్‌పై విచారణ జరగనున్నట్టు తెలుస్తోంది.