MithunReddy Arrest: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక వికెట్ పడింది. శనివారం ఏడుగంటలపాటు మిథున్‌రెడ్డిని విచారించింది సిట్. విచారణలో ఆయనేం చెప్పారు? తెలీదు, గుర్తులేదు, మరిచిపోయానని చెప్పారా? అధికారుల ప్రశ్నలకు నీళ్లు నమిలారా? కొడుకు అరెస్టు విషయం తెలియగానే మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఏమన్నారు?
ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్‌రెడ్డికి అన్నిదారులు మూసుకుపోయాయి. కింది కోర్టు మొదలు సుప్రీంకోర్టు వరకు అన్ని న్యాయస్థానాలు ఆయనకు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో బెంగుళూరు నుంచి ఢిల్లీ నుంచి విజయవాడకు చేరుకున్నారు. ఆ తర్వాత శనివారం ఉదయం సిట్ ముందుకి వచ్చారు. అప్పటివరకు ఆయన ఎక్కడ ఉన్నారో తెలీదు. కాకపోతే బెంగుళూరులో యలహంక పాలెస్‌లో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల మాట.
లిక్కర్ కేసులో ఏ4 గా ఉన్న మిథున్‌రెడ్డిని శనివారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో అరెస్టు చేసింది సిట్. దాదాపు ఏడుగంటలపాటు ఆయన్ని విచారించింది. విచారణలో చాలా ప్రశ్నలకు తెలీదు, మరిచిపోయాను, గుర్తు లేదు అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. కీలకమైన ఆధారాలు బయటపెట్టి మిథున్‌రెడ్డిని అధికారులు ప్రశ్నించారు. దానికి ఆయన మౌనంగా ఉండిపోయారట.
చివరకు వీడియోలు చూపించి ప్రశ్నలు సంధించినప్పటికీ సైలెంట్‌గానే ఉన్నారట మిథున్‌రెడ్డి. చివరకు ఆయన కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి అరెస్టు చేశారు. కొడుకు అరెస్టు విషయంలో తెలియగానే షాక్‌కు గురయ్యారట మాజీ మంత్రి పెద్దిరెడ్డి. కొడుకును రాజకీయాల్లోకి తీసుకొచ్చి పెద్ద తప్పు చేశానని తన సన్నిహితుల వద్ద వాపోయారట.
ALSO READ: మిథున్ రెడ్డి అరెస్టుతో టెన్షన్ ఛార్జిషీటులో జగన్ పేరు
మిథున్‌రెడ్డి అరెస్టు విషయం తెలియగానే కొందరు వైసీపీ పెద్దలు పెద్దిరెడ్డికి ఫోన్ చేసి దైర్యం చెప్పారట. బెయిల్ కోసం ప్రయత్నాలు చేద్దామని సముదాయించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన తొలి రాజకీయ నేత మిథున్‌రెడ్డి. ఈ కుంభకోణం తొలుత 3 వేల కోట్లు అని భావించినప్పటికీ, 22 వేల కోట్లకు అంచనా వేస్తున్నారట అధికారులు.
విచారణలో సందర్భంలో మిథున్‌రెడ్డి వ్యవహరించిన తీరుని సిట్ వివరించింది. విచారణలో ఆయన సహాయ నిరాకరణ చేశారని, కస్టడీకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ స్కామ్‌లో లోతైన నేరం ఉందని, ఆనాటి ప్రభుత్వంలో కీలక వ్యక్తులు, అధికారులు పాత్ర ఉందని, దీనికి సంబంధించిన వివరాలు సేకరించినట్టు ప్రస్తావించింది.
కొత్త మద్యం పాలసీ విధానం మొదలు.. ముడుపులు సేకరణలో ఆయనదే కీలకపాత్ర అని చెప్పారు. ఐఏఎస్ హోదా ఇస్తామని చెప్పి ఏ3గా ఉన్న సత్యప్రసాద్‌ను కుట్రలోకి లాగింది ఆయనేనని పేర్కొంది. మిథున్ పాత్ర గురించి ముగ్గురు వ్యక్తులు కీలక సమాచారం ఇచ్చారని తెలిపారు.
తీసుకున్న ముడుపులు ఎక్కడ దాచారు? అనేది పూర్తి సమాచారం మిథున్ రెడ్డికి తెలుసని, ఆయన్ని నుంచి మరిన్ని వివరాలు రాబట్టాలన్నారు. డబ్బులు తరలించేందుకు షెల్ కంపెనీల గుట్టు తెలుసుకోవాల్సివుందని సిట్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది. మొత్తానికి లిక్కర్ కేసు పరిశీలిస్తే రీసెంట్‌గా విడుదలైన ‘కుబేర’ సినిమా గుర్తుకు వస్తుంది.