Mutts Scam Tirumala: తిరుమల్లో మఠాల పేరిట గోల్ మాల్ జరుగుతోందా? లీజు పేరిట కోట్ల రూపాయల దందా నడుస్తోందా? వీటితో పాటు యధేచ్చగా ఆక్రమణలు చేస్తున్నారా? తిరుమలలో ఎన్నేసి మఠాలున్నాయ్.. వీరి అక్రమ వసూళ్లు ఆక్రమణల పర్వం ఎలాంటిది? చూద్దాం.. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవారు. గురువారం పూట కళ్లు తెరుస్తారని అంటారు. ఆలయంలో జరిగే కార్యకలాపాలపై ద్రుష్టి సారిస్తారనీ చెబుతారు. వీటిలో ఏవైనా అక్రమాలు, ఆక్రమణలుంటే వారి పని పడతారనీ నమ్ముతుంటారు. కూటమి ప్రభుత్వంలో ఈ మాటే నిజమైందా? మఠాల వసూళ్లు ఆక్రమణ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయా? అంటే అవుననే తెలుస్తోంది.
తిరుమలలో 30 వరకూ మఠాలు
తిరుమలలో 30 మఠాల వరకూ ఉన్నాయి. వీటిలో విశాఖ స్వరూపానందేంద్ర శారదా పీఠం ఆక్రమణల పర్వం తెలిసిందే. ఈ పీఠానికి 5 వేల చదరపు అడుగుల స్థలం మాత్రమే కేటాయించగా.. వీరు ఏకంగా 19 వేల 990 అడుగుల మేర ఆక్రమించేశారు. అక్రమ కట్టడాలు నిర్మించారు. తనకున్న రాజకీయ పలుకుబడితో.. తిరుమల్లో స్వరూపానంద ఆడింది ఆట పాడింది పాటగా సాగిందని అంటారు. ప్రభుత్వం మారాక.. టీటీడీ ధర్మకర్తల మండలి.. మొదటి సమావేశంలోనే శారదా పీఠం లీజు రద్దు చేసింది. అంతే కాదు మిగతా మఠాల ఆక్రమణలు, అక్రమ వసూళ్లపైనా ద్రుష్టి సారించింది.
కర్ణాటకకు చెందిన మఠానికి స్థలమిచ్చిన మాజీ చైర్మన్
తిరుమలలోని మెజార్టీ మఠాల్లో ఇచ్చిన స్థలాని కన్నా మించి కట్టినవే ఎక్కువ. వీటన్నిటిపైనా సమగ్ర విచారణ చేసిన టీటీడీ ఆ తర్వాత చర్యలు తీసుకోలేదు. అయితే టీటీడీ మాజీ చైర్మన్, కర్ణాటకకు చెందిన ఒక మఠానికి ఏర్పేడు వ్యాసాశ్రమం వెనక వైపున అనుమతులిచ్చారు. ఇక్కడ వన్ ప్లస్ త్రీ నిర్మాణాలకు మాత్రమే అనుమతులుండగా.. ఏకంగా ఐదు అంతస్తుల భవనం నిర్మించారు. విశాఖ శారదాపీఠాధిపతి తర్వాత ఈ మఠం మీదే చర్యలుండేలా తెలుస్తోంది.
డిప్యూటీ ఈవో, ఇంజినీర్ ఇన్ చీఫ్, విజిలెన్స్ వింగ్..
అంతే కాదు.. మఠాల వ్యవహారంలో లీజుకు సంబంధించి పలు వివాదాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిపైనా.. టీటీడీ ఉన్నతాధికారులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. డిప్యూటీ ఈవో, ఇంజినీర్ ఇన్ చీఫ్, విజిలెన్స్ వింగ్, హెల్త్ ఆఫీసర్, ఐదు మఠాలకు సంబంధించిన నిపుణులు ఈ కమిటీలో ఉంటారు. వీరు ఇచ్చే నివేదికల ఆధారంగా టీటీడీ మఠాల అద్దెతో పాటు, కళ్యాణాల అద్దెలను సైతం నిర్ణయించనున్నారు.
Also Read: నేటి నుండి బ్రహ్మోత్సవాలు.. పాల్గొంటే కలిగే భాగ్యం తెలుసా.. శ్రీవారి దర్శనం క్యూ లేటెస్ట్ అప్ డేట్
మఠాల లీజు, కళ్యాణాల అద్దె.. కంట్రోల్ చేసేలా చర్యలు
మఠాల విషయంలో అంతగా ఇక్కడేం జరుగుతుందో పరిశీలిస్తే.. తిరుమలలో మఠాలకు అవకాశమిచ్చింది. ధర్మ ప్రచారానికి వీలుగా ఉండేందుకు. అందుకే ఇక్కడ 23 ప్రముఖ మఠాలున్నాయి. వీటిలో 15 మఠాల్లో వివాహాలకు సైతం అనుమతులిస్తుంటారు. ఈ మఠాలలో కళ్యాణమండపాలు లేకున్నా.. హాళ్లలోనే పెళ్లిళ్లు జరిపించేస్తుంటారు.. మ్యారేజీ కాంట్రాక్టర్లు. ఇందుకోసమే కొందరు కాంట్రాక్టర్లు ఈ మఠాలను లీజుకు తీసుకుంటూ ఉంటారు. వీరి మధ్య బీభత్సమైన యుద్ధాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
తిరుమల మఠాల కేంద్రంగా రూ. 500 కోట్ల దందా?
గతంతో వైసీపీ నాయకులు కొందరు మఠాలను ఇలాగే లీజుకు తీసుకున్నారు. ఈ పంచాయితీలు పోలీస్టేషన్ల వరకూ వెళ్లాయంటే పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. ఒక్కో పెళ్లికి రూ. లక్ష నుంచి 10 లక్షల వరకూ వసూలు చేస్తుంటారు. ముఖ్యంగా పీఠాధిపతులు 10 నుంచి 50 లక్షల రూపాయల వరకూ లీజుదారుల నుంచి వసూలు చేస్తుంటారు. మఠాధిపతుల శిష్యులు ఏడాదికి ఒకట్రొండు సార్లు వచ్చి వెళ్తుంటారు. తిరుమల మఠాల కేంద్రంగా 500 కోట్ల రూపాయల మేర దందా జరుగుతున్నట్టు ఒక అంచనా.
వేసవిలో ఒక్కో గది అద్దె.. రూ. 5 వేలు
మరో వైపు ఒక్కో గది అద్దె కూడా భారీగానే వసూలు చేస్తుంటారట. వేసవి కాలంలో అయితే.. ఒక్కో గది అద్దె రూ. 5 వేల వరకూ పలుకుతుందట. అది కూడా పెద్ద స్థాయిలో రెకమండేషన్ ఉంటేనే ఇస్తారట. తిరుమల మఠాల చుట్టూ ఇంత పెద్ద ఎత్తున కాసుల వర్షం కురుస్తుండటంతో.. ఈ మఠాల లీజుకు ఎగబడుతుంటారట కొందరు కాంట్రాక్టర్లు. ఒక్కో లీజుదారుడు 2 నుంచి 5 వరకూ మఠాలను లీజుకు తీసుకుని లక్షల్లో వసూళ్లు సాగిస్తున్నారట. వీరికి రాజకీయ పలుకుబడి సైతం బలంగా ఉండటంతో ఒకరేంజ్ లో చక్రం తిప్పుతుంటారట. పోలీసుల సహకారం కూడా తీసుకుంటారట. టీటీడీలో పాతుకు పోయిన సీనియర్ ఉద్యోగుల సహకారం ఇందుకు అదనంగా తెలుస్తోంది.
కాంట్రాక్టర్ల వివరాల నమోదు, అనర్హులపై వేటు
ఈ వసూళ్ల వ్యవహారంపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో.. వెంటనే స్పందించింది టీటీడీ. ఐదుగురితో కూడిన కమిటీ వేసింది. కమిటీ ఏర్పాటు చేసిన ధరలే ఇకపై గదులు, కళ్యాణాల అద్దెలుకు వసూలు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. అదే విధంగా మఠాలను లీజుకు తీసుకున్న వారి వివరాలను సైతం రికార్డు చేయనున్నారు. మేనేజర్ పేరిట లీజు దారులు ఈ తతంగమంతా నడుపుతున్నట్టుగా తెలుస్తోంది. వీరందరి వివరాలను సేకరించి.. అనర్హులైన వారెవరైనా ఉంటే వెంటనే తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది టీటీడీ. ఇకనైనా శ్రీవారి ప్రాంగణంలో అక్రమ వసూళ్లు, ఆక్రమణల వ్యవహారం కంట్రోల్లోకి రావాలని ఆశిద్దాం.