Tirumala News: తిరుమల పవిత్రతను కాపాడడంలో ఏ చిన్న నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చినా సహించనని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించిన నేపథ్యంలో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుమలకు వచ్చే ప్రతి భక్తునికి శ్రీవారి దర్శనం కలిగేలా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. ఈవో శ్యామలరావు సారథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుంటుండగా, భక్తులు సైతం టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాలను స్వాగతిస్తున్న పరిస్థితి తిరుమలలో నెలకొని ఉంది. తొలి పాలక మండలి సమావేశంలో చైర్మన్ బీఆర్ నాయుడు తనదైన మార్క్ తో కీలక నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో, టీటీడీ అధికారులు అలర్ట్ అయ్యారు.
కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమలకు కూడా భారీగా భక్తులు చేరుకుంటున్నారు. తిరుమల మాడవీధులు గోవిందా నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఎటుచూసినా భక్తజనసందోహం తిరువీధులలో కనిపిస్తోంది. అలిపిరి నుండి గల కాలినడక దారి భక్తులతో నిండుగా కనిపిస్తోంది. శ్రీ శ్రీనివాసా శరణు.. శరణు అంటూ భక్తులు కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దీనితో భక్తుల సేవలో తరించే టీటీడీ, ఎటువంటి అసౌకర్యం కలుగకుండా.. అన్ని చర్యలు చేపట్టింది.
శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే సోమవారం స్వామి వారిని 67,626 మంది భక్తులు దర్శించుకోగా.. 22,231 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 3.75 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే శ్రీవారి దర్శనం కోసం 3 కంపార్ట్ మెంట్ లలో భక్తులు వేచి ఉన్నట్లు టీటీడీ ప్రకటించింది.
Also Read: AP Heavy Rains: ఏపీకి భారీ వర్షసూచన.. లేటెస్ట్ అప్ డేట్.. అంతా అలర్ట్
నేటి నుండి శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నేటి నుండి డిసెంబరు 6వ తేదీ వరకు వైభవంగా జరుగనున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. తమిళనాడు రాష్ట్రం నుండి భక్తులు అధిక సంఖ్యలో ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం సాంప్రదాయంగా వస్తోంది. ఈ అమ్మవారి ఆశీస్సులు పొందితే చాలు, సర్వపాపాలు హరిస్తాయని భక్తుల విశ్వాసం.