Nara Bhuvaneswari : ఏపీలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చేపట్టిన “నిజం గెలివాలి” యాత్ర కొనసాగుతోంది. ఒకవైపు చంద్రబాబు అరెస్ట్ తర్వాత మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు. మరోవైపు సభల్లో పాల్గొంటున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సభలో పాల్గొన్న ఆమె.. వైసీపీ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.
వైసీపీది ధన బలమైతే.. టీడీపీది ప్రజా బలమని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. 2024 కురుక్షేత్ర సంగ్రామంలో టీడీపీ-జనసేన కూటమి అఖండ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ రాజ్యాంగమే దేశాన్ని నడిపిస్తోందని వివరించారు. రాజ్యాంగాన్ని అమలు చేసే పాలకులు మంచివారైతేనే ప్రజలకు మంచి జరుగుతుందని స్పష్టం చేశారు. చెడ్డవారైతే ప్రజలకు కీడు జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని అంబేడ్కర్ ఆనాడే చెప్పారన్నారు.
ప్రస్తుతం ఏపీలో కమీషన్ కోసం కంపెనీలను బెదరగొడుతున్నారని భువనేశ్వరి విమర్శించారు. కరెంటు బిల్లులపై నిలదీస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. నిత్యావసరాల ధరలు అధికంగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మారిందన్నారు.
ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు ఆత్మగౌరవం తీసుకొస్తే.. చంద్రబాబు ఆత్మవిశ్వాసం తెచ్చారని భువనేశ్వరి స్పష్టం చేశారు. అలాంటి నాయకుడిని 49 రోజులుగా జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటయ్యేలా చేయడం , పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం తప్పా అని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన నేరం ఏంటి? అని భువనేశ్వరి నిలదీశారు.
భువనేశ్వరి తన ప్రసంగంలో బీజేపీ గుర్తించి ప్రస్తావించలేదు. ఒకవైపు ఏపీ బీజేపీ నేతలు జనసేనతో కలిసి పోటీ చేస్తామంటున్నారు. ఇప్పటికే కాషాయ పార్టీతో తెలంగాణలో పొత్తులు ఖరారయ్యాయి. ఈ సమయంలో ఏపీలో టీడీపీ-జనసేన కూటమిదే అధికారం అని భువనేశ్వరి చెప్పడం ఆసక్తిగా మారింది.