Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులు, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులపై జరిగిన దాడి ఉదంతం తీవ్ర రాజకీయ, సామాజిక దుమారాన్ని రేపుతోంది. గతంలో ఉపాధ్యాయులను వైన్ షాపుల వద్ద కాపలాదారులుగా నియమించారనే వివాదం నుంచి, నేడు వారిపై ప్రత్యక్ష దాడుల వరకు చోటుచేసుకున్న పరిణామాలు రాష్ట్రంలో ఉపాధ్యాయుల గౌరవ భద్రతలపై పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.
ఉపాధ్యాయులపై దాడి..
స్పోర్ట్స్ కోటా ద్వారా డీఎస్సీ ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు తమకు ఎదురవుతున్న సమస్యలు, నిందలపై వివరణ ఇచ్చేందుకు విజయవాడలోని శాప్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే, అక్కడ శాంతియుతంగా తమ ఆవేదనను వ్యక్తపరిచేందుకు వచ్చిన ఉపాధ్యాయులపై ఒక్కసారిగా దాడి జరగడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
వైన్ షాపుల కాపలా నుండి రాడ్ల దాడి వరకా?
మంత్రి లోకేష్ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ‘అందరూ దైవంతో సమానంగా భావించే గురువులను గత ప్రభుత్వం వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టింది. అటువంటి వైకాపా నుంచి ఉపాధ్యాయులకు గౌరవం దక్కుతుందని అనుకోవడం మన పొరపాటే. క్రీడల్లో ప్రతిభ చూపి దేశ పతాకాన్ని గర్వంగా రెపరెపలాడించిన వారిపై ఫేక్ ఆరోపణలు చేయడమే కాకుండా, శాప్ కార్యాలయం వద్ద రౌడీ షీటర్లు, గంజాయి-బ్లేడ్ బ్యాచ్‌లతో రాడ్లు, కర్రలతో దాడులు చేయించడం అత్యంత హేయమైన చర్య’ అని వ్యాఖ్యానించారు.
టీచర్ల జోలికొస్తే వదిలే ప్రసక్తి లేదు!
ఉపాధ్యాయులపై దాడికి పాల్పడిన నేరగాళ్లను, వారి వెనుక ఉన్న శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దాడికి దిగిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయుల జోలికి వస్తే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. ఈ ఘటనపై పోలీసు యంత్రాంగం కూడా సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
Also Read: 190 ఎకరాల భూ కబ్జా.. ఆధారాలు ఉన్నాయి.. తాడిపత్రిపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు