JC Prabhakar: వైసీపీ హయాంలో జరిగిన భారీ భూకబ్జాలు, అధికారుల తీరుపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అధికారుల చర్యలపై హర్షం
అక్రమాలకు సహకరించిన బస్వరాజు, మంజునాథ్‌లపై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన డీఐజీకి జేసీ ధన్యవాదాలు తెలిపారు. ‘మేము అధికారులకు వ్యతిరేకం కాదు, వ్యవస్థలో ఉన్న లోపాలకు, అక్రమాలకే వ్యతిరేకం’ అని స్పష్టం చేశారు.
190 ఎకరాల కబ్జా – ఆధారాలు స్పష్టం
వైసీపీ పాలనలో తాడిపత్రి చుట్టుపక్కల దాదాపు 190 ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయని, దీనికి సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నాయని తెలిపారు. వైసీపీ నేత K.రమేష్ రెడ్డి టౌన్ చుట్టూ ఉన్న విలువైన భూములను కబ్జా చేశారని ఆరోపించారు. సీలింగ్ పరిధిలోని 2.42 సెంట్ల భూమిని మేనేజ్ చేసి మరీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, దీనిపై అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైందని వివరించారు.
కలెక్టర్ ఆదేశాలనూ పట్టించుకోని వైనం
రమేష్ రెడ్డి తన బినామీ నటరాజ్ రెడ్డి పేరుతో మరో 6.75 సెంట్ల భూమిని ఆక్రమించారని జేసీ పేర్కోన్నారు. కలెక్టర్ ఆఫీసులో కూడా రికార్డులను ట్యాంపర్ చేస్తున్నారని, స్వయంగా కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చినా కింది స్థాయి అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు.
వ్యక్తిగత ఆరోపణలపై ఘాటు స్పందన
‘సొంత ప్రభుత్వం అధికారంలో ఉన్నా, అక్రమాలపై ప్రతిసారీ పోరాడి సాధించుకోవాల్సి వస్తోంది. నేను ఆధారాలు లేకుండా ఊరికే మాట్లాడటం లేదు. నేను ఈ భూకబ్జాలను బయటపెడుతున్నందుకే నాపై బెట్టింగ్, గంజాయి, మట్కా అంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నాయకుల తీరు చూస్తుంటే ప్రజలు ప్రశ్నించడం కాదు, కొట్టకుండా ఉంటే చాలు’ అని వ్యాఖ్యానించారు.
Also Read: సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసుల దాడిలోనే మరణించాడని సిట్ నిర్ధారణ!