Nara Lokesh Help poor boy Fraud| బాల్యం అనేది ఒక వరం లాంటిది. బుడి బుడి అడుగులు వేసుకుంటూ, కల్ల-కపటం తెలియని చిన్నారులు సందడి చేస్తుంటారు. మనకు ఎన్ని టెన్షన్లు ఉన్నా, ఎంత ఒత్తిడిలో ఉన్నా, చిన్నారుల పనులు చూస్తే వెంటనే నవ్వు వస్తుంది. ఆ ఒత్తిడిని మరచిపోతుంటాం. అందుకే ప్రతి ఒక్కరూ తమ బాల్యాన్ని గుర్తుచేసుకుని, చిన్నప్పుడు బాగుండేదని అనుకుంటుంటారు. అయితే, ఇటీవల దీనావస్థలో ఉన్న ఒక చిన్న పిల్లాడిని చూసి ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ చలించిపోయారు. ఆ పిల్లాడికి తప్పకుండా సహాయం చేసేందుకు హామీ ఇచ్చారు. కానీ ఇదంతా మోసమని, ఆ పిల్లాడి చేత స్కామ్ చేయిస్తున్నారనే అరోపణలు వస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నంలోని ఓ ప్రాంతంలో ఒక పిల్లాడు.. ఒళ్లంతా సిల్వర్ రంగు పూసి.. జాతిపిత గాంధీ వేషంలో రోడ్డుపై యాచిస్తూ కూర్చొని ఉన్నాడు. పాపం.. పిల్లాడి పరిస్థితి చూసి ఒక యూట్యూబర్ అతని వద్దకు వెళ్లి అతని సమస్యలు తెలుసుకున్నాడు. ఆ పిల్లాడు తన తల్లిదండ్రుల అనారోగ్యం గురించి చెబుతుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ తరువాత మంత్రి నారా లోకేష్ కి ట్విట్టర్ ఎక్స్‌లో ట్యాగ్ చేసి.. పిల్లాడికి ఏదైనా సాయం చేయండని కోరాడు.
దీంతో మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందిస్తూ ఓ పోస్ట్ చేశారు. ” ఆడుతూ పాడుతూ, పెరగాల్సిన వయసులో కుటుంబ భారాన్ని భుజాన వేసుకున్న ఈ బాలుడి మాటలు వింటుంటే నా హృదయం చలించిపోయింది. తల్లిదండ్రులకు అండగా ఉండటం కోసం ఆ బాలుడు పడుతున్న కష్టం నన్ను కలచివేసింది. వెంటనే బాలుడు వివరాలు సేకరించి ఆ కుటుంబానికి ఒక అన్నగా అండగా ఉంటానని మాట ఇస్తున్నాను.” అని ట్వీట్ లో రాశారు.
Also Read: వివేకా కేసులో అసలేం జరుగుతుంది..? రంగన్న డెడ్ బాడీకి రీ పోస్టుమార్టం..
కానీ నవీన్ రామ్‌సింగ్ అనే ఛానెల్ నడుపుతున్న మరో యూట్యూబర్ షాకింగ్ విషయాలు వెల్లడించాడు. ఈ పిల్లాడి గురించి, అతని కుటుంబం గురించి తనకు తెలసునని.. ఇదంతా ఫ్రాడ్ అని.. ఆ పిల్లాడి తల్లిదండ్రులు అతని చేత ఇలా భిక్షాటన చేయిస్తూ.. చాలా మంది ప్రముఖల వద్ద డబ్బులు తీసుకుంటున్నారని చెప్పాడు. వారు చేసే మోసాలు నిరూపించేందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయంటూ ఒక వీడియోలో తెలిపాడు.
పది నెలల క్రితం వైజాగ్ ఆర్ కె బీచ్ లో ఆ పిల్లాడు తనకు కనిపించాడని.. అతని తల్లికి క్యాన్సర్ అని, బ్రెయిన్ ట్యూమర్ అని చెబితే తాను చలించిపోయి.. పిల్లాడి ఇంటికి వెళ్లి.. అతని తల్లిని కిమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లి పరీక్షలు చేస్తే.. ఆమెకు ఏ ఆరోగ్య సమస్యలు లేవని డాక్టర్లు మండిపడ్డారు. ఇది విని తాను షాక్ కు గురయ్యానని ఆ యూట్యూబర్ తెలిపాడు.
“ఈ పిల్లాడి కుటుంబం గాజువాక ఎమ్మెల్యేని కూడా మోసం చేయడానికి ప్రయత్నించారు. ఆ పిల్లాడు తన తండ్రి వికలాంగుడని, తల్లికి క్యాన్సర్ అని చెబుతూ తమకు సాయం చేయాలని కోరాడు. దీంతో గాజువాక ఎమ్మెల్యే స్పందిస్తూ.. ముఖ్యమంత్రి గారితో చెప్పి ఆర్థిక సాయం అందించేందకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే విజయనగరంలో చరణ్ అనే సామాజిక కార్యకర్త వద్ద మోసం చేసి డబ్బులు తీసుకున్నారు. ఇలాగే యూట్యూబర్ హర్హసాయిని కూడా మోసం చేశారు. నేను కూడా వారికి ఆర్థిక సమస్యలు తీరిస్తే.. పిల్లాడిని స్కూల్ పంపిస్తారని భావించి ఫైనాన్స్ ఇబ్బందుల్లో ఉన్న పిల్లాడి తండ్రి ఆటోని విడిపించేందుకు రూ.50,000 ఇచ్చాను. కానీ ఆ డబ్బులు తీసుకొని ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. మళ్లీ ఆ పిల్లాడి చేత తల్లిదండ్రులు ఇలా అబద్ధాలు చెబుతూ రోడ్డుపై యాచకుడిగా చేశారు. ఆ పిల్లాడి తల్లికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని నా దెగ్గర మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి. అవి తదుపరి వీడియోలు బహిర్గతం చేస్తాను. దయచేసి ఎవరికైనా సాయం చేసేటప్పుడు వారు చెప్పేది నిజమేనా అని ఆరా తీయండి” అని యూట్యూబర్ నవీన్ రామ్ సింగ్ అన్నాడు.
మంత్రి నారాలోకేష్ సాయం చేయాలని భావించిన ఈ పిల్లాడు ఇప్పుడు ఫ్రాడ్ అని తెలియడంతో ఇక ముందు ఎవరైనా ఇలా సాయం అడుగుతూ దీన స్థితిలో కనిపిస్తే.. ఇదంతా మోసం అని భావించే అవకాశం ఉంది. అందుకే మంత్రి నారాలోకేష్ లాంటి ప్రముఖులు ఎవరైనా దీనావస్థలో కనిపిస్తే.. వారి గురించి పూర్తిగా తెలుసుకొని కావాల్సిన సాయం చేయాలి కానీ.. కళ్లుమూసుకొని డబ్బులు ఇవ్వడం సరికాదు.
ఆడుతూ పాడుతూ, పెరగాల్సిన వయసులో కుటుంబ భారాన్ని భుజాన వేసుకున్న ఈ బాలుడి మాటలు వింటుంటే నా హృదయం చలించిపోయింది. తల్లిదండ్రులకు అండగా ఉండటం కోసం ఆ బాలుడు పడుతున్న కష్టం నన్ను కలచివేసింది. వెంటనే బాలుడు వివరాలు సేకరించి ఆ కుటుంబానికి ఒక అన్నగా అండగా ఉంటానని మాట ఇస్తున్నాను. https://t.co/FmMOK6tcsk
— Lokesh Nara (@naralokesh) March 7, 2025