సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆసక్తికర సన్నివేశం జరిగింది. జగన్, ఆయన తల్లి విజయమ్మ ఇద్దరూ వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించేందుకు వచ్చారు. విడివిడిగా వచ్చిన వారు ఘాట్ వద్ద ఎదురుపడ్డారు. అయితే జగన్ మాత్రం తన తల్లిని చూసినా పలకరించేందుకు తటపటాయించారు. పట్టించుకోనట్టే ప్రవర్తించారు. కానీ విజయమ్మ మాత్రం కొడుకు తనని పలకరిస్తాడేమోనని అక్కడే కొంతసేపు వేచి చూశారు. చివరకు తానే కొడుకు దగ్గరకు వెళ్లి ఆయన్ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. అయినా కూడా జగన్ లో పెద్దగా స్పందన లేదు. ఆమెతో అంటీముట్టనట్టే ఉన్నారు. ఆ తర్వాత మరికొందరితో చనువుగా మాట్లాడిన జగన్ అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ఇదే వీడియోని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేయడంతో అది మరింత ఆసక్తికరంగా మారింది.
కొడుకు పట్టించుకోకపోయినా తల్లి ప్రేమ తల్లి ప్రేమే కదా!#PsychoJagan pic.twitter.com/Yn4VkMTjVE
— Lokesh Nara (@naralokesh) September 3, 2025
అసలేం జరిగింది?
వైఎస్ఆర్ ఫ్యామిలీలో కొన్నాళ్లుగా అంతర్గత కలహాలున్న విషయం తెలిసిందే. వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ, కుమార్తె షర్మిల.. ఓవైపు జగన్ కుటుంబం మరోవైపు అన్నట్టుగా ఉంది పరిస్థితి. వివేకా హత్య అనంతరం జరిగిన పరిణామాల్లో వివేకా కుమార్తె సునీతకు షర్మిల అండగా నిలవడంతో జగన్ తో మరింత గ్యాప్ పెరిగింది. ఇక ఏపీలో షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలు కావడంతో ఆస్తుల గొడవలు కాస్తా పొలిటికల్ గొడవలుగా మారాయి. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ జయంతి, వర్థంతి కార్యక్రమాలకోసం వైఎస్ఆర్ ఘాట్ కి వచ్చే కుటుంబ సభ్యులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటున్నారు. అయితే మీడియాకు లేనిపోని అవకాశం ఇవ్వకుండా పైకి కలిసే ఉన్నట్టుగా కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కూడా విజయమ్మ చొరవగా కొడుకు దగ్గరకు వచ్చినా, ఆయన అంటీముట్టనట్టు ఉండటం విశేషం. ఈ ఏడాది కూడా విజయమ్మ వైఎస్ఆర్ ఘాట్ వద్ద కొడుకుని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. అంతే కాదు, కోడలు భారతిని కూడా దగ్గరకు తీసుకుని పలకరించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లీకొడుకులు కలసిపోయారని వైసీపీ మీడియా, సోషల్ మీడియా హడావిడి చేసింది. కానీ అక్కడ జరిగింది వేరు అంటూ సోషల్ మీడియాలో మరికొన్ని వీడియోలు వైరల్ కావడం విశేషం. ఆ వీడియోలను మంత్రి నారా లోకేష్ రీపోస్ట్ చేస్తూ “కొడుకు పట్టించుకోకపోయినా తల్లి ప్రేమ తల్లి ప్రేమే కదా!” అనే కామెంట్ పెట్టారు.
ఎందుకీ దూరం..?
ఆస్తి గొడవలు జగన్, షర్మిల మధ్య ఉన్నాయి. మధ్యలో తల్లి విజయమ్మ ఏం చేసిందనేది వైఎస్ఆర్ అభిమానులను వేధిస్తున్న ప్రశ్న. జగన్, విజయమ్మ మధ్య దూరం పెరగడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వైఎస్ఆర్ సతీమణి విజయమ్మను దూరం పెట్టిన జగన్, వైఎస్ఆర్ పేరుని ఉపయోగించుకుంటూ రాజకీయం చేయాలనుకోవడం సరికాదని అంటున్నారు. ముందు కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలని, చెల్లెలికి సంతోషంగా ఆస్తి పంచి ఇవ్వాలని, ఆ తర్వాత ప్రజా సమస్యల పరిష్కారం కోసం జగన్ బయటకు రావాలని అంటున్నారు. కుటుంబ వ్యవహారం జగన్ కు రాజకీయంగా కూడా తలనొప్పిగా మారింది. తల్లిని, చెల్లిని పట్టించుకోని జగన్, ఇక రాష్ట్ర ప్రజల బాగోగుల్ని ఎలా చూస్తారని ఆయనపై సెటైర్లు పేలుతున్నాయి.