రాష్ట్రంలో ప్రభుత్వం మారితే సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవాల్సిందేనా. ఏ పథకాన్నీ ఆపేది లేదంటూ ఎన్నికల ప్రచారంలో కబుర్లు చెప్పినా, చివరకు నాయకులు చేసేదేంటి..? 2019లో ఏం జరిగింది..? 2024లో జరుగుతున్నదేంటి..? ఈ ప్రశ్నలకు తాజాగా మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పారు. గతంలో తాము మొదలు పెట్టిన సంక్షేమ కార్యక్రమాలను, పథకాలను 2019లో జగన్ నిర్దాక్షిణ్యంగా ఆపివేశారని.. కానీ తాము అధికారంలోకి వచ్చాక జగన్ పెట్టి వెళ్లిపోయిన బకాయిలను తిరిగి చెల్లిస్తున్నామని వివరించారు. ఈ విషయంలో తాము జగన్ లా కాదని చెప్పారు లోకేష్.
2024లో ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు సకాలంలో విడుదల చేయలేదనే ఆరోపణ ఉంది. అయితే అప్పటికప్పుడు ఆ బకాయిలు చెల్లించేందుకు ఖజానాలో డబ్బు లేదని సర్దిచెప్పుకుంటూ వచ్చారు నేతలు. ఆ తర్వాత క్రమక్రమంగా వాటిని తిరిగి చెల్లిస్తున్నామని అంటున్నారు. మొత్తంగా 4,271 కోట్ల రూపాయల బకాయిలు చెల్లిస్తున్నామని అన్నారు.
ఒక్క విద్యాశాఖలోనే వైసీపీ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు రూ.4271 కోట్లు చెల్లించలేదని చెప్పారు లోకేష్. ఇప్పటి వరకు తమ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్ మెంట్ కింద రూ.788 కోట్లు విడుదల చేసిందని, తాజాగా మరో 600 కోట్ల రూపాయలు కూడా విడుదల చేసిందని అన్నారు. త్వరలో 400 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పారు లోకేష్. వైసీపీ మిగిల్చి వెళ్లిపోయిన బకాయిలు ఆర్థికంగా భారంగా మారినా, చివరి రూపాయి వరకు చెల్లించడం.. విద్యార్థులు, తల్లిదండ్రులపై భారం లేకుండా చేయడం తమ ప్రభుత్వ బాధ్యత అని అంటున్నారు లోకేష్.
ప్రభుత్వం శాశ్వతం అని, రాజకీయాలు ఎన్నికలకే పరిమితం అని అన్నారు మంత్రి నారా లోకేష్. ఈ విషయాన్ని ఇప్పుడైనా జగన్ తెలుసుకోవాలని కోరారు. ప్రభుత్వం మారినా.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించే ప్రజాస్వామ్య స్ఫూర్తిని జగన్ తన విధ్వంసపాలనతో బ్రేక్ చేశారన్నారు లోకేష్. గత ప్రభుత్వ బకాయిలు తామెందుకు చెల్లిస్తామంటూ 2019లో జగన్ మొండికేశారని, చివరకు ప్రజల్ని ఇబ్బంది పెట్టారన్నారు. తమ హయాంలో ప్రారంభమైన అభివృద్ధి పనుల్ని కూడా నిలిపివేశారని, కొన్నిచోట్ల విధ్వంసం సృష్టించారన్నారు. అలాంటి నిరంకుశ మనస్తత్వం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అన్నారు లోకేష్. కానీ తమ ప్రభుత్వంలో.. గత ప్రభుత్వ బకాయిలను కూడా తిరిగి చెల్లిస్తున్నామని చెప్పారు.
ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ బకాయిల విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ముఖ్యంగా శాసన మండలిలో మంత్రి లోకేష్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య మాటల తూటాలు పేలాయి. గత ప్రభుత్వం బకాయిలు పెట్టి, నిధుల విడుదల ఆలస్యమైతే ఆ నెపం తమపై నెడుతోందని అన్నారు నారా లోకేష్. నాయకుల మధ్య వాదోపవాదాలు ఎలా ఉన్నా.. అప్పటి వరకు అమలవుతున్న పథకాల విషయంలో ఆలస్యం కావడంతో లబ్ధిదారులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక, సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కూడా ఇలాగే చేశారు. అంతకు ముందు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చనిపోయిన వారి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ అందలేదు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకూ అమలవుతున్న అమ్మఒడి ఆగిపోయింది. ఈ ఏడాది ఇస్తామన్నా, ఇంకా ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు కనిపించడం లేదు. తల్లికి వందనంగా రూపాంతరం చెందిన ఈ పథకం ఎప్పుడు అమలవుతుందో చూడాలి.