Nara Lokesh : టీడీపీకి ప్రతిపక్షం కొత్త కాదు.. అధికారం కూడా కొత్త కాదు. తెలుగు వాళ్లు ఇబ్బందుల్లో ఉంటే ముందుగా స్పందించేది తెలుగుదేశం పార్టీనే. కాలానికి తగ్గట్టే మార్పులు చేస్తూ వస్తోంది. ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతోంది. ప్రజలకు మరింత దగ్గర అయ్యేలా కార్యచరణ అమలు చేస్తోంది. అలాంటిదే మరో ప్రయత్నం. నా తెలుగు కుటుంబం అంటూ.. మహానాడులో ఆరు శాసనాలను ప్రతిపాదించారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే టీడీపీ మౌళిక సూత్రానికి కట్టుబడుతూ.. సరికొత్తగా 6 పాయింట్ ఫార్ములా తీసుకొచ్చారు. మరో 40 ఏళ్ల పాటు పార్టీని నడిపించేలా కీలక నిర్ణయాలపై మహానాడులో చర్చకు ఆహ్వానించారు నారా లోకేవ్.
టీడీపీ 6 శాసనాలు :
1. తెలుగుజాతి.. విశ్వ ఖ్యాతి
2. పేదల సేవలో.. సోషల్ రీఇంజనీరింగ్
3. స్త్రీ శక్తి
4. అన్నదాతకు అండగా..
5. యువగళం
6. కార్యకర్తే అధినేత
నాకు స్పూర్తి వాళ్లే..
టీడీపీలో పని చేసే వాళ్లకు ప్రోత్సాహం ఉంటుందని హామీ ఇచ్చారు నారా లోకేశ్. యువ శక్తికి సరైన ఉద్యోగా, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. మెగా డీఎస్సీతో జూన్ నెలలో 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. స్త్రీ శక్తి ద్వారా పార్టీ పదవులతో పాటు అన్ని రంగాల్లో మహిళలకు భద్రతా, బాధ్యత కల్పిస్తామని తెలిపారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి మహిళా మంత్రి చీరా, గాజులు పంపిస్తానంటూ తనను ఎగతాళి చేసిందని ఆనాటి రోజా టాపిక్ గుర్తు చేశారు. అసెంబ్లీలో తల్లిని అవమానించిన చరిత్ర వైసీపీదన్నారు. సొంతం తల్లిని, చెల్లినే మెడపట్టుకుని బయటకు గెంటేశారంటూ జగన్‌ను విమర్శించారు. చట్టాలు, శిక్షల వల్ల సమాజంలో మార్పు రాదు.. ఇంటి నుంచే మార్పు రావాలని పిలుపు ఇచ్చారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలం, బలంగా అన్నారు నారా లోకేశ్. మంజుల, తోట చంద్రయ్య, అంజిరెడ్డి తాతలే తనకు స్పూర్తి అన్నారు.