BigTV English

No takers for Janasena | జనసేన పదేళ్ల ప్రయాణం.. అసలు సీరియస్ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఉన్నారా?

No takers for Janasena | జనసేన పార్టీ అంటే అందరికీ గుర్తొచ్చేది సినీ నటుడు పవన్ కల్యాణ్ మాత్రమే. పవన్ కల్యాణ్ తప్ప పార్టీలో మరో నాయకుడు వెతికినా కనిపించరు. ఇప్పుడు ఈ అంశమే పార్టీ కొంపముంచిందని ప్రధానంగా చెప్పాలి. ఎన్నికలు వస్తే జనసేన కచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పే పరిస్థితి లేదు.

No takers for Janasena |  జనసేన పదేళ్ల ప్రయాణం.. అసలు సీరియస్ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఉన్నారా?

No takers for Janasena | జనసేన పార్టీ అంటే అందరికీ గుర్తొచ్చేది సినీ నటుడు పవన్ కల్యాణ్ మాత్రమే. పవన్ కల్యాణ్ తప్ప పార్టీలో మరో నాయకుడు వెతికినా కనిపించరు. ఇప్పుడు ఈ అంశమే పార్టీ కొంపముంచిందని ప్రధానంగా చెప్పాలి. ఎన్నికలు వస్తే జనసేన కచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పే పరిస్థితి లేదు.


జనసేన పార్టీ స్థాపించి పదేళ్ల కాలం పూర్తి కావొస్తున్నా జనసేనకు ప్రజలు ఓటేస్తారని నమక్మం లేదు. దానికి కారణం ఎవరు? అసలు జనసేన పార్టీ ఏ దిశలో ప్రయాణిస్తోంది? పార్టీ వైఫల్యానికి, పవన్ కల్యాణ్ ఒక్కరే కారణమా?

జనసేన పార్టీ గురించి చెప్పాలంటే.. ముందు పవన్ కల్యాణ్ రాజకీయ జీవితం గురించి మొదలుపెట్టాలి. ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పాలి.


సినిమా హీరోగా భారీ ప్రజాదరణ ఉన్న నటుడు పవన్ కల్యాణ్. ఆయన 2008 సంవ్సతరంలో తన అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ జీవితం మొదలుపెట్టాడు. ప్రజారాజ్యం పార్టీ యూత్ వింగ్(యువ రాజ్యం)కి లీడర్‌గా వ్యవహరించారు. అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ.. ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసేది. దీంతో కాంగ్రెస్ నాయకులకు, ప్రజారాజ్యం నాయకుల మధ్య గొడవలు జరిగేవి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ కాంగ్రెస్ నాయకులను గుడ్డలు ఊడదీసి కొట్టాలి.. అనే పరుష పదజాలంతో విరుచుకుపడేవారు.

2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చిరంజీవి పెద్దగా ఎవరినీ విమర్శించలేదు.. కానీ ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ మాత్రం సభలలో, మీడియా ముందు దూకుడుగా ఉండేవారు. ఎన్నికల్లో కేవలం 18 సీట్లు సాధించిన ప్రజా రాజ్యం పార్టీని చిరంజీవి ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ప్రజారాజ్యం పార్టీని, చిరంజీవిని నమ్ముకున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ప్రజారాజ్యం పార్టీ లేదనగానే అందరూ నిరాశకు గురయ్యారు. అప్పుడు చిరంజీవిని చాలా మంది విమర్శించారు. ఈ కారణంగానే అన్న చిరంజీవికి పవన్ కల్యాణ్ దూరమయ్యారు.

ఇది జరిగిన కొంత కాలానికి 2009 సెప్టెంబర్‌లో జననాయకుడు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక దుర్ఘటనలో అకాల మరణం చెందారు. అనంతరం తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. అలా కాలక్రమంలో తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఏర్పడింది. కానీ అంతకుమందు 2014 మార్చి 14న, హైదరాబాద్‌లోని మాధాపూర్‌లో పవన్ కల్యాణ్ సొంతంగా పార్టీ పెట్టారు. అదే జనసేన పార్టీ. జనసేన పార్టీ స్థాపన రోజు పవన్ కల్యాణ్ స్టేజి మీద నుంచి చేసిన ప్రసంగం. అందరినీ ఆకట్టుకుంది. ఆయన ఈసారి చాలా సీరియస్‌గా రాజకీయాలలో మార్పు తీసుకొస్తారని అందరూ ఊహించారు.

కానీ తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తరువాత 2014 ఎనిక్నల్లో జనసేన పార్టీ పోటీ చేయలేదు. లోక్ సభ ఎన్నికల్లో బిజేపీకి.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశానికి మద్దతు ప్రకటించింది. ఇక్కడే జనసేన పెద్ద తప్పు చేసిందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత ఏపీ రాజకీయాల్లో ఒక శూన్యం ఏర్పడింది. తెలుగుదేశం తరపున చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడు ఒకవైపు.. రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి మరోవైపు ఉన్నారు.

ఇలాంటి సమయంలో జనసేన పార్టీ స్థాపించాక కనీసం అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒక్కరే అయినా పోటీ చేసి ఉంటే ఆయనకు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపించాయి. ఆయన అసెంబ్లీ కెళ్లే ఛాన్స్ ఉండేది. కానీ అలా జరగలేదు. పవన్ కల్యాణ్ పోటీ చేయలేదు.. సరే అప్పటికి కొత్త పార్టీ ఎన్నికలకు సంసిద్ధమయ్యేందుకు సమయం సరిపోలేదు అని సర్దిచెప్పుకున్నారు.

2014 ఎన్నికల తరువాత టిడిపి విజయం సాధించడంతో చంద్రబాబు నాయుడు మరోసారి ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు. కట్ చేస్తే.. 2019 సంవత్సరంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల జరిగాయి. అప్పుడు మొదటిసారి జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేసింది. అది కూడా మొత్తం 175 సీట్లపై అభ్యర్ధులను బరిలోకి దింపింది. ముఖ్యంగా అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరం రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఏపీ ప్రత్యేక హోదా అంశం చుట్టూ ఎన్నికల ప్రచారం నడిచింది. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో టిడిపి విఫలమైందని వైసీపీ ప్రచారం చేస్తే.. టిడిపి మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోదీ ప్రభుత్వం మోసం చేసిందని ప్రచారంలో చెప్పింది. జనసేన మాత్రం ప్రత్యేక హోదా అంశంపై సీరియస్‌గా ప్రచారం చేయలేదు.

అయితే ఎన్నికల ఫలితాలు చూస్తే వైసీపీ 151 సీట్లు గెలిచి.. ఒక ప్రభంజనం సృష్టించింది. టిడిపి 23 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కానీ మొదటిసారి పోటీ చేసిన జనసేన కేవలం ఒక్క సీటుతో ఖాతా తెరిచింది. రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాద్ గెలిచారు. మరి అంతమంది సినీ అభిమానులున్న పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల నుంచి ఓడిపోయారు. అయితే ఇక్కడే ఒక విచిత్ర పరిస్థితి గురించి చెప్పాలి.


2019 ఎన్నికల ఫలితాల రోజున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కార్యకర్తలతో నిండిపోయింది. అక్కడంతా పండుగ వాతావారణం. అదే సమయానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయం బోసిపోయింది. చంద్రబాబు నాయుడు విలేకర్ల సమావేశం పెట్టినా.. పెద్దగా హడావుడి లేదు. టిడిపి కార్యకర్తలెవరూ చంద్రబాబు ఇంటి బయట కానీ, చుట్టు పక్కల కనిపించలేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. మరి ఇలాంటి సమయంలో జనసేన పరిస్థితి ఎలా ఉండాలి?

కానీ జనసేన ఆఫీస్ వద్ద పూర్తి భిన్నమైన వాతావరణం ఉంది. పార్టీ ఓడిపోయినా.. పవన్ కళ్యాణ్ కూడా విలేకర్ల సమావేశం నిర్వహించారు. కానీ పరిస్థితి టిడిపి కంటే పూర్తిగా భిన్నం.

జనసేన ఘోర పరాజయం తర్వాత కూడా విజయవాడ పార్టీ కార్యాలయం ముందు వందలాది అభిమానులు గుమిగూడి ఉన్నారు. విలేకర్ల సమావేశం కోసం తెరచిన హాల్ అభిమానులతో నిండిపోయింది.

హాలు తలుపులు మూసేసినా మెట్లపైనా, రోడ్డుపైనా జనం నిలబడి ఉన్నారు. పవన్ కల్యాణ్ రెండున్నర నిమిషాలు మాత్రమే సమావేశంలో మాట్లాడేసి వెళ్లిపోయారు. పవన్ కళ్యాణ్ సమావేశం నుంచి బయటకు రాగానే, అప్పటి వరకూ మౌనంగా ఉన్న అభిమానులంతా గోలగోల చేశారు.

పవన్‌ కల్యాణ్ కారు వెంట కేకలు వేస్తూ పరుగులు తీశారు. ఈ దృశ్యం చాలు జనసేన పరిస్థితి చెప్పడానికి. జనసేన ఓడినా అభిమానుల్లో పవన్ కల్యాణ్‌కు తగ్గని క్రేజ్ ఒక వైపు ఉంటే.. అంత క్రేజ్‌నీ సరిగా ఉపయోగించుకోలేని దీనమైన పార్టీ వ్యవస్థ మరోవైపు.

జనసేన ప్రభావం ఎలా ఉంటుదన్న ప్రశ్నకు సమాధానం ఆరు నెలలుగా మారిపోతూ వచ్చింది. కానీ ఈ ఫలితాలను మాత్రం ఎవరూ ఊహించలేదు. ఒక చోట నుంచైనా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడతారని భావించారు అభిమానులు. కానీ ఫలితాలు అంతకంటే ఘోరంగా వచ్చాయి. కారణాలు ఎన్నో ఉన్నాయి.

ప్రతి పార్టీకి ఒక వ్యవస్థ ఉంటుంది. అధినేత ఆదేశాలు అమలు చేసే ఆ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటే పార్టీ అంత బలంగా ఉన్నట్టు. కానీ పవన్ కళ్యాణ్ తన పార్టీ వ్యవస్థను ఏమాత్రం శ్రద్ధగా నిర్మించలేకపోయారు.

అందుకు ఆయనకు తగిన సమయం లేదు అనే మాట సరికాదు. 2014 ఎన్నికల తర్వాత నుంచి లెక్కేసుకున్నా ఐదేళ్ల సమయం ఏ పార్టీ నిర్మాణానికైనా సరిపోతుంది. కానీ రాష్ట్ర, జిల్లా కమిటీలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల నుంచి వార్డు మెంబర్ల వరకూ కమిటీలు.. ఇలా ఏదీ పక్కాగా జనసేన పార్టీ చేయలేకపోయింది.

పవన్ కళ్యాణ్‌కున్న అభిమానులను అవసరమైనట్టు మలచుకుని సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో జనసేన విఫలం అయింది. అభిమానులు కార్యకర్తలుగా మారడం అంత తేలిక కాదు. అంతకుమించి పక్కా ప్రయత్నం జరగలేదు.

మామూలుగా ఏ పార్టీకీ ఉండని ఈ అదనపు బలాన్ని జనసేన.. వాడుకోలేకపోయింది. ఆ మేరకు వారికి సమగ్ర శిక్షణ ఇవ్వలేకపోయింది. ఎక్కడికక్కడ స్థానికంగా తమకు తోచిన రీతిలో అభిమానులు పార్టీ కోసం కష్టపడ్డారు. మూమూలుగా రాజకీయ నాయకులు బహిరంగ సభలు పెడితే లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి ఆ సభలు నిర్వహిస్తారు. సభకు భారీ సంఖ్యలో జనం రావాలంటే.. వచ్చే వారికి రూ.200, రూ.500 బిర్యానీలు, మందు బాటిళ్లు సరఫరా చేయాలి.

కానీ జనసేనకు ఈ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సభ అంటే చాలు.. ఆయన అభిమానులు లక్షల్లో తరలి వస్తారు. ఆయనకున్న అభిమానుల గురించి చెప్పాలంటే.. తెలుగు సినిమా రంగంలో ఇప్పుడున్న టాప్ నటులు ఎవరికీ పవన్ కల్యాణ్ కున్నంత అభిమాన గణం లేదు. ఇది జనసేనకు చాలా పెద్ద ప్లస్ పాయింట్. అయితే ఈ అభిమానగణాన్ని పవన్ కళ్యాణ్ లేదా జనసేన నాయకులెరూ సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోయారు.

జనసేనకు కాపు సమాజం ఓటు?

తెలంగాణ, ఏపీలో కాపు, కమ్మ, రెడ్డి అనే కుల రాజకీయాల పిచ్చి కూడా ఉంది. దీనికి ఏ పార్టీ కూడా అతీతం కాదు. జనసేన విషయానికి వస్తే కాపు కుల నాయకులు తమ మద్దతు పవన్ కల్యాణ్‌కే అని పలుమార్లు ప్రకటించారు. కానీ 2019 ఎన్నికల ఫలితాలు చూస్తే ఈ కుల సమీకరణలు పనిచేయలేదనే చెప్పాలి. వైసీపీ 151 సీట్లు సాధించిందంటే ఆ పార్టీకి అన్ని వర్గాల వారు ఓట్లు వేశారనే అర్థం.

తాజాగా చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో పవన్ కల్యాణ్ టిడిపితో పొత్తు ప్రకటించారు. దీనిపై కాపు నాయకులు స్పందించారు. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సెప్టెంబర్ నెలలో కాకినాడలో కాపు నాయకుల సభ జరిగింది. ఆ సభలో కాపు నాయకులు, న్యాయవాదులు, జనసేన కార్యకర్తలు, చిరంజీవి, పవన్ కల్యాణ్ అభిమానులు హాజరయ్యారు. జనసేన ఒంటరిగా పోటీ చేస్తేనే తమ ఓట్లు జనసేనకు లభిస్తాయని.. లేకపోతే జనసేనకు ఓటు వేసేది లేదని కాపు నాయకులు తేల్చి చెప్పారు. టిడిపితో పొత్తు పెట్టుకుంటే.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటారని.. పవన్ కల్యాణ్ సిఎం ఎలా అవుతారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని కొట్టిపారేయలేం. చంద్రబాబు లాంటి అపార అనుభువమున్న వ్యక్తి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టుకొని.. పవన్య కల్యాణ్‌కి ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది. కానీ పొత్తు పెట్టుకుంటే కూటమికి కట్టుబడి ఉండాలి మరి.. తప్పదు.

నాయకులు కరువైన పార్టీ. జనసేన

నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో జనానికి తెలిసిన ముఖం, కార్యకర్తలు లేదా అభిమానులకు అందుబాటులో ఉండగలిగే నాయకత్వం ప్రతీ ఒక్క పార్టీకి ఉండాలి. వారు ప్రధాన నాయకత్వానికి వారధిలా పనిచేస్తారు.
ఎక్కువ మంది కొత్త వాళ్లే కావడంతో జనసేనకు అటువంటి నాయకత్వం చాలా చోట్ల లేదు. నాదెండ్ల మనోహర్ తప్ప ఇక ప్రముఖులెవరూ ఆ పార్టీలో లేరు.

సాధారణంగా పవన్ కల్యాణ్ సంవత్సరానికి రెండు సినిమాలు లేదా ఒక సినమా మాత్రమే చేస్తారు. అందులోనూ ఒక సినిమా చేయడానికి 40రోజులు మాత్రమే కేటాయిస్తారని సినీవర్గాలు చెబుతున్నాయి. మరి ఈ లెక్కన సంవత్సరానికి రెండు సినిమాలు చేసినా.. ఆయన 80 రోజులు మాత్రమే సినిమాల కోసం పనిచేస్తారు. మిగతా 285 రోజుల్లో కనీసం 200 రోజులు ఆయన పార్టీ నిర్మాణం కోసం సిన్సియర్‌గా కష్టపడినా ఈ పాటికి జససేనకు జిల్లాల వారిగా, నియోజకవర్గాల వారీగా నేతలు దొరికేవారు. పార్టీ స్థాపించిన పదేళ్ల తరువాత కూడా నాయకులు లేరంటే.. పవన్ కల్యాణ్ ఎంత చిత్తశుద్ధితో జససేన కోసం పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఇంకా చెప్పాలంటే చాలా రాజకీయ విషయాల్లో జనసేన స్పష్టమైన వైఖరి చూపలేదు. చంద్రబాబుతో బంధం తెగక ముందు, చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి చేయించిన పనులు ఏమీ లేవు.

చంద్రబాబుతో బంధం తెగిపోయిన తర్వాత.. 2019 ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన తప్పులను బలంగా ఎత్తిచూపలేదు. గుంటూరు బహిరంగ సభలో లోకేశ్ అవినీతిపై ఆరోపణలు.. అవి కూడా వాళ్ళూ వీళ్లూ అంటున్నారు అనడం, పవన్ ఒక కీలక రాజకీయ విషయాన్ని ఎంత తేలిగ్గా హ్యాండిల్ చేశారు అన్నదానికి చిన్న ఉదాహరణ.

ఇక శ్రీకాకుళం జిల్లా ఉద్దానం పోరాటం మాత్రమే చెప్పుకోవడానికి ఉంది. రాజధాని రైతుల గురించి చేసిన ఆందోళన ఆ స్థాయిలో కొనసాగలేదు.

పవన్ కల్యాణ్ సాధారణ అభిమానులకు కాకపోయినా, సమాజంలో ప్రభావం చూపగలిగే కీలక వ్యక్తులకు కూడా అందుబాటులో ఉండకపోవడం చాలా పెద్ద సమస్య. మీడియా, వివిధ రంగాల ప్రముఖులు పవన్ కల్యాణ్‌ను కలవడం చాలా కష్టమైపోయింది. పవన్ మేలు కోరి ఆయనను కలవాలనే వారికి పవన్ కోటరి.. అడ్డుగా ఉంటుంది.

2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి విజయానికి ప్రధాన కారణాలు.

  1. ఆయన చేసిన పాదయాత్ర,
  2. ఏపీకి ప్రత్యేకహోదాపై చంద్రబాబు వైఫల్యాన్ని ఎత్తి చూపడం.
  3. ఒక్క అవకాశం ఇవ్వండి.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని జనాన్ని కోరడం

ఇలాంటి ప్రయత్నాలు పవన్ కల్యాణ్ బలంగా చేయలేదనేది అందరూ చెబుతున్న మాట. జనసేన ఎన్నికల్లో గెలుస్తుందనే భావన అందరిలో లేకపోయినా.. మరీ ఒక్క సీటుకే పరిమితమవుతుందని ఎవరూ ఊహించలేదు. పైగా పవన్ కల్యాణ్ ఆ సమయంలో కూడా లోలోపల టిడిపితో కలిసే ఉన్నారని వైసీపీ ఎన్నికల ప్రచారం చేసింది. దీంతో తెలుగుదేశం వ్యతిరేక ఓట్లు కూడా జనసేనకు పడలేదు.

సరే ఎలాగైతేనేం వైసీపీ గెలిచింది. జనసేన, తెలుగుదేశం ఓడిపోయి దీన స్థితిలో ఉన్నాయి. పోనీ ఓటమి నుంచి జనసేన ఏమైనా పాఠాలు నేర్చుకొని మళ్లీ 2024 ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్దమవుతోందా అనే ప్రశ్నకు లేదు అనే స్పష్టమైన సమాధానం వస్తుంది. ఎందుకంటే 2019 ఎన్నికల వేళ పార్టీకి జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయిలో ఎలాగైతే నాయకులు కరువయ్యారో.. ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ తప్ప పార్టీలో ఏ నాయకుడు కనిపించడు.

జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ అయిదేళ్లలో ఏపీలో అభివృద్ధి దాదాపు శూన్యం. అయినా వైసీపీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశే నాయకులు జనసేనలో లేరు.

ఈ సారి జరగబోయే ఎన్నికలకు ముందే జనసేన, టిడిపి పొత్తు పెట్టుకున్నాయి. మరోవైపు బిజేపీతో జనసేన పొత్తు ఉంది. కానీ ఆ బిజేపీతో పొత్తు తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో జనసేన కొంపముంచింది. పవన్ కల్యాణ్.. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. బిజేపీ కాస్తో కూస్తో 8 సీట్లు దక్కించుకుంది. కానీ జనసేన మాత్రం పోటీ చేసిందే.. 8 స్థానాల్లో. ఆ 8 స్థానాల్లోనూ ఓడిపోయింది. విచిత్రమేమిటంటే.. జనసేనకు వచ్చిన ఓట్ల కంటే ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన బర్రెలెక్కకు ఎక్కువ ఓట్లు రావడం.

ఈ ఫలితాలను బట్టి అర్థమవుతోంది. జనసేనను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదని.

మరోవైపు ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో టిడిపి తరపున నారా లోకేష్ పాదయాత్రకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇదే తరుణంలో జగన్ ప్రభుత్వం చంద్రబాబుపై పలు కేసులు పెట్టి జైలుకు పంపింది. ఇలాంటి సందర్భంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ టిడిపి-జనసేన పొత్తు ప్రకటించారు. జనసేన కార్యక్రమాల్లో తనకు కూడా సిఎం పదవి చేపట్టేందుకు అర్హత ఉందని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. వారాహి విజయ యాత్ర పేరుతో అప్పుడే ఎన్నికల కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పవన్ కల్యాన్ వారాహి యాత్రకు కూడా జనం భారీ సంఖ్యలో వస్తున్నారు.

అయితే ఇదంతా పవన్ కల్యాణ్ అభిమానుల పవర్ అని ఎవరైనా చెబుతారు. ఇందులో కొత్త విషయం ఏమీలేదు. కానీ మళ్లీ అదే ప్రశ్న ఎదురవుతుంది. ఎన్నికల వేళ పవన్ కల్యాణ్‌కున్న అపారమైన అభిమానుల పవర్ ఓట్ల రూపంలో ఎందుకు మారడం లేదు?

ఇప్పుడు టిడిపితో పొత్తు పెట్టుకొని.. మొత్తం 175 సీట్లలో బేరమాడి జనసేన 40 స్థానాల్లో పోటీ చేయబోతోందని సమాచారం. మరి కనీసం ఆ 40 స్థానాల్లో పోటీ చేసి జనసేన తరపున ప్రచారం నిర్వహించేందుకు స్థానికంగా బలమైన నాయకులున్నారా? అంటే లేదు అనేది మరోసారి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే 2019 ఎన్నికల సమయంలో జనసేన పరిస్థితి ఏమిటో ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితి అని చెప్పాలి.

చివరగా ఒక మాట.

ఒక పార్టీ స్థాపించి..దాని నిర్వహణ ఎలా ఉండకూడదో అని చెప్పడానికి జనసేన ఒక ఉదాహరణ. అలాగే దాదాపు జనసేన స్థాపన సమయంలోనే దేశంలో మరో పార్టీ ఆవిర్భవించింది. ఆ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్, బిజేపీ లాంటి జాతీయ పార్టీలకు కొరకరాని కొయ్యాగా మారింది. పార్టీ స్థాపించి.. మంచి కేడర్.. మంచి వాక్చాతుర్యం ఉన్న నాయకులు ఆ పార్టీలో చేరి పార్టీకి అద్భుత విజయాలను అందించారు. ప్రజలలో ఆ పార్టీ పట్ల అంత నమ్మకం ఏర్పడింది. ఆ పార్టీ మరేదో కాదు ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ.

అధికార పార్టీ చేస్తున్న అవినీతిని ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా ప్రజల్లో తీసుకెళ్లింది. ప్రజల సమస్యలపై గ్రౌండ్ లెవెల్లో పనిచేసింది. పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ సమాజంలోని బుద్ధిజీవులను పార్టీలోకి తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేశారు. ముఖ్యంగా కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థుల నుంచి భారీ మద్దతు ఆమ్ ఆద్మీ పార్టీకి లభించింది.

ఆమ్ ఆద్మీ పార్టీని చూసి జనసేన పార్టీ పాఠాలు నేర్చుకుంటే కొంతైనా పవన్ కల్యాణ్‌కి రాజకీయంగా ఉపయోగపడుతుందేమో?

.

.

.

Related News

East Godavari News: కాసేపట్లో పెళ్లి.. మొదటి భార్యతో పెళ్లికొడుకు పరార్‌, అసలు మేటరేంటి?

Pulivendula ByPoll: పులివెందులలో పోలింగ్.. నన్ను బంధించారన్న వైసీపీ అభ్యర్థి, జగన్ ఖర్చు రూ100 కోట్లు

AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసు.. ఐపీఎస్ ఆంజనేయుల పేరు, ముడుపుల చేర్చడంలో వారే కీలకం

Pulivendula bypoll: పులివెందుల జెడ్పీ బైపోల్.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Big Stories

×