Weather Report: రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే బయపడుతున్నారు. అయితే ఉత్తరాంధ్రలో భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు చర్యల్లో భాగంగా విశాఖ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నేడు సెలవు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.
దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో కొనసాగుతోన్న అల్పపీడనం..
పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం మరింత బలపడి నేడు వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది, రేపు మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటవచ్చని తెలిపింది. నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ సూచించింది.
అల్పపీడనం మరింత బలపడి నేడు వాయుగుండంగా మారే అవకాశం..
దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం అల్లూరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.
Also Read: మారిన ఆదిమూలం స్వరం.. భయమా? మార్పా?
తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు..
ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేడు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఆదిలాబాద్, హన్మకొండ, కామారెడ్డి, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబా్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది.