Palnadu District News: పందెంలు చాలా రకాలు. పరుగు పందెం.. కోళ్ల పందెం.. పొట్టేళ్ల పందెం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పందెంలు మనం వింటూ ఉంటాం.. చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ జరిగిన పందెం ఎక్కడా జరిగి ఉండదు.. ఎక్కడా విని ఉండరు కూడా. అదేమి పందెం తెలుసా.. నిద్ర మాత్రల పందెం.
అదొక సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం. అక్కడి విద్యార్థులు సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. వారిలో సతీష్ కుమార్, గురు అనే విద్యార్థులు కూడా ఉన్నారు. అందరూ పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ ఆనందంగా ఉన్నారు. అయితే ఈ విద్యార్థుల మదిలో ఉన్నట్లుండి పందెం కాయాలన్న ఆలోచన తట్టింది. ఇక అంతే పందెం కాసేందుకు తాము రెడీ అంటూ సతీష్, గురు లు సిద్ధమయ్యారు. ఇంతకు ఆ పందెం ఏమిటి? ఇదెక్కడ జరిగిందో తెలుసుకుందాం.
పల్నాడు జిల్లా ఈపూరులో సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విద్యార్థులు నిద్ర మాత్రలు మింగాలని, ఎవరు ఎక్కువ మింగితే వారు గెలిచినట్లంటూ పందెం కాశారు. సతీష్ కుమార్, గురు లు మాత్రం మేము రెడీ అంటూ సిద్ధమై, ఒకరేమో 10 మాత్రలు, మరొకరేమో ఏకంగా 20 మాత్రలు మింగారట. మిగిలిన విద్యార్థులు వీరిద్దరి నిర్వాకం చూసి ఖంగు తిన్నారు.
పరుగులు పెడుతూ వార్డెన్ సార్.. అంటూ జరిగిన విషయం చెప్పేశారు. వార్డెన్ వెంకటేశ్వర్లు నాయక్ కు చెమటలు పట్టాయి.. ఉరుకులు, పరుగుల మీద వారిద్దరినీ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అసలు ఈ విద్యార్థులకు ఆ టాబ్లెట్స్ ఎక్కడ దొరికాయి? ఎవరు ఇచ్చారు? ఎక్కడ కొనుగోలు చేశారన్నది తెలియాల్సి ఉంది.
Also Read: Lady Aghori In Kurnool: అఘోరీ మాత కారు మొరాయింపు.. పాదయాత్రగా పయనం.. ఎక్కడికో తెలుసా?
వార్డెన్ తీసుకున్న ప్రత్యేక చొరవతో విద్యార్థులకు సకాలంలో వైద్యం అందగా, ప్రాణాలకు ఎటువంటి అపాయం లేదని వైద్యులు చెప్పారట. కానీ సరదా పందెంలు రన్నింగ్, కబడ్డీ, ఇలా క్రీడల్లో పందెంలను చూసి ఉంటాం కానీ, ఇలా టాబ్లెట్స్ మింగే పందెం మాత్రం ఇదేనని చెప్పవచ్చు. ఇప్పటికైనా సరదా విషాదం కాకుండా విద్యార్థులు నడుచుకోవాలని ఆ విద్యార్థులకు వార్డెన్ క్లాస్ తీసుకున్నారట. ఏమైనా సకాలంలో స్పందించి విద్యార్థుల ప్రాణాలు రక్షించిన వార్డెన్ కి అభినందనలు చెప్పాల్సిందే. కొసమెరుపు ఏమిటంటే.. ఆ విద్యార్థులు మింగిన మాత్రలు నిద్రమాత్రలు కాదని కూడా ఓ వాదన వినిపిస్తోంది.