Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత పర్యావరణ పరిరక్షణలో ఒక అద్భుతమైన మైలురాయి నమోదైందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మిష్టి’ పథకం కింద మడ అడవుల పునరుద్ధరణలో మన రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానాన్ని కైవసం చేసుకోవడం ఎంతో గర్వకారణం. పర్యావరణ సమతుల్యతను కాపాడుకుంటూ.. వాతావరణ మార్పులను తట్టుకునే దిశగా అటవీ శాఖ వేసిన అడుగులు ఈరోజు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకోవడం విశేషం.
అటవీ శాఖ శ్రమకు లభించిన గుర్తింపు
ఈ అసాధారణ విజయానికి రాత్రింబవళ్లు కృషి చేసిన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, సీనియర్ అధికారులు , ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలోని ప్రతి ఒక్క సిబ్బందికి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అధికారులు ప్రదర్శించిన దార్శనికత, క్షేత్రస్థాయి సిబ్బంది చూపిన అంకితభావం వల్లే ఈ అరుదైన గౌరవం సాధ్యమైందని కొనియాడారు.
2,047 హెక్టార్ల అడవుల పునరుద్ధరణ
కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, సుమారు 2,047 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో మడ అడవులను విజయవంతంగా పునరుద్ధరించడం అటవీ శాఖ పనితనానికి నిదర్శనం. ఆధునిక, వినూత్న పరిరక్షణ పద్ధతులను అవలంబిస్తూ, తుపానులు మరియు సముద్ర కోత నుంచి మన తీరప్రాంత పర్యావరణ వ్యవస్థలను కాపాడుకోవడంలో రాష్ట్రం ముందు వరుసలో నిలిచిందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
సుస్థిర భవిష్యత్తు వైపు సామూహిక అడుగులు
మడ అడవులు కేవలం చెట్లు మాత్రమే కాదు, అవి తీరప్రాంత జీవ వైవిధ్యానికి ప్రాణవాయువు. సముద్ర జీవుల మనుగడకు, మత్స్యకారుల జీవనోపాధికి ఇవే ప్రధాన ఆధారం. జీవవైవిధ్యాన్ని కాపాడుకుంటూ, భవిష్యత్ తరాలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించడమే మన అందరి లక్ష్యం. మరింత పచ్చని, స్థితిస్థాపకత కలిగిన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించే ఈ పవిత్ర కర్తవ్యంలో మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం అని పవన్ కళ్యాణ్ పిలుపు నిచ్చారు.
Also Read: ‘మీ వీపు మీరు చూసుకోండి’.. రాహుల్ గాంధీకి డీకే అరుణ ఘాటు సెటైర్లు!