Pawan Kalyan : యుద్ధం పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలంటూ జనసేనాని పిలుపు ఇచ్చారు. మత కలహాలు సృష్టించే వారిపై అప్రమత్తంగా ఉండాలని.. వారిని కలిసికట్టుగా ఎదుర్కోవాలని అన్నారు. పాకిస్తాన్‌కు సపోర్ట్‌గా మాట్లాడటం సరికాదని.. అలాంటి వాళ్లు ఆ దేశానికే వెళ్లిపోవాలని తేల్చి చెప్పారు పవన్ కల్యాణ్. పహల్గాం టెర్రర్ అటాక్‌లో చనిపోయిన వారికి జనసేన తరఫున నివాళులు అర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఉగ్రదాడిలో దుర్మరణం పాలైన మధుసూదన్‌రావు కుటుంబానికి పార్టీ తరఫున రూ. 50 లక్షలు సాయం అందించారు. జనసేన తరఫున ఆ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు.
అతి మంచి.. అతి సహనం..
కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్. కొంతమంది ఇండియాలో ఉండి పాకిస్తాన్‌కు మద్దతుగా మాట్లాడటంపై మండిపడ్డారు. అతి మంచితనం మంచిది కాదని.. అతి సహనం కూడా ప్రమాదకరమని అన్నారు. పాకిస్తాన్‌ను మూడుసార్లు ఓడించామనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. హిందువులకు ఉన్నది ఒక్కటే దేశమని.. ఇక్కడ కూడా టార్గెట్ చేస్తే ఇంకెక్కడికి పోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి పాలనలో..
ఐడీ కార్డులు అడిగి.. హిందువా? ముస్లింవా? అని తెలుసుకుని మరీ దారుణంగా చంపేశారని.. అమాయకులైన నిరాయుధుల ప్రాణాలు తీశారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఉన్నంత వరకు ప్రశాంతంగా ఉందని.. అధికారం రాష్ట్రం చేతిలోకి వెళ్లగానే ఇలా ఉగ్రవాదులు రెచ్చిపోయారని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు జనసేనాని. ఉగ్రవారం, హింసపై ప్రజలంతా ఒకేలా స్పందించాలని.. సత్యం మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలన్నారు పవన్ కల్యాణ్.