Pawan Kalyan: రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా అధికారులపై దాడులు జరిగితే ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే లేదని, ప్రజల కోసం పనిచేసే సమయంలో ఓట్ల గురించి ఆలోచించే వ్యక్తిని తాను కాదంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించినా కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
పిఠాపురం నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 12,500 గోకులాల ప్రారంభోత్సవ సభను పిఠాపురంలో నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న పవన్ సంచలన కామెంట్స్ చేశారు. పవన్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 12,500 గోకులాలను ఆరు నెలల్లోనే నిర్మించుకున్నామని, వీటి ద్వారా లబ్ధి పొందే వారు అంతా రైతులేనంటూ పవన్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబుల సహకారంతో కూటమి ప్రభుత్వంలో గోకులాల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. భవిష్యత్తులో మరో 20 వేల గోకులాలను నిర్మించడం జరుగుతుందని పవన్ సభ సాక్షిగా ప్రకటించారు.
ఇక తిరుమల ఘటనపై మాట్లాడిన పవన్ కళ్యాణ్ కాస్త ఆవేదన భరితంగా ప్రసంగించారు. ఈ సంక్రాంతి పండుగను ఊరంతా పందిరి వేసి చాలా అద్భుతంగా జరుపుకుందామని భావించానని, మొన్న తిరుమలలో జరిగిన సంఘటనతో బాధ కలిగి భారీగా పండుగను జరుపుకునేందుకు మనస్కరించలేదన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటానని పవన్ తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం తనకు ఇచ్చిన గెలుపును ఎప్పటికీ మరచిపోనని, నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానన్నారు.
తాను ఒక పోలీస్ కానిస్టేబుల్ కుమారుడిగా ప్రజలు చెల్లించిన పన్నుల ద్వారా ఈ స్థాయికి చేరుకున్నట్లు, అందుకే తాను దేశానికి, రాష్ట్రానికి, ఈ నేలకు రుణపడి ఉన్నానంటూ పవన్ మాట్లాడారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి కుమారుడిగా కడపలో జరిగిన ఎంపీడీవో దాడి ఘటనను సీరియస్ గా తీసుకొని వెంటనే స్పందించడం జరిగిందని, అటువంటి చర్యలకు ఎవరు పాల్పడినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్వాతంత్రం వచ్చి ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా, నేటికీ 419 కుగ్ గ్రామాలలో డోలీలు కట్టుకొని రాధారులు లేక ప్రజలు అవస్థలు పడుతున్న తీరును కూటమి ప్రభుత్వం గమనించిందన్నారు. అందుకే తాను పర్యటించి రూ. 39 కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు మంజూరు చేసినట్లు పవన్ అన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం పై పవన్ సంచలన కామెంట్స్ చేశారు. తలలు నిమరడం, ముద్దులు పెట్టడం వంటి చర్యలతో ఓట్ల కోసం మాజీ సీఎం జగన్ ప్రాకులాడారని, ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం సాధించిన ఘనతను గుర్తించలేని పరిస్థితుల్లో వైసీపీ కళ్ళు మూసుకుని ఉందన్నారు. గోమాత సంరక్షణను పూర్తిగా మరిచారని, ఆవులు బాగుంటే రైతు బాగుంటాడని, రైతు బాగుంటే దేశం బాగుంటుందంటూ పవన్ అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పాడి పరిశ్రమను, పాల డైరీ లను నిర్లక్ష్యం చేసి సొంత డైరీ లను పెట్టుకున్నారని, వారి వద్ద కోట్ల నిధులు ఉండడం కోసం గత ప్రభుత్వం ఎన్నో దారుణాలు చేసిందన్నారు.
Also Read: Sankranthi Celebrations 2025: ఏపీలో తొలిసారి పడవ పందాలు.. ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు..!!
కూటమి ప్రభుత్వంలో సకాలంలో జీతాలు అందించడం, పెన్షన్లు పెంచడం, దీపం 2.o ఇతర సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి రికార్డు సాధిస్తే, గత వైసీపీ ప్రభుత్వం స్కాముల్లో రికార్డులు సృష్టించిందని పవన్ విమర్శించారు. గోకులాల ద్వారా గుజరాత్ లోని మహిళలు 60 వేల రూపాయలు సంపాదిస్తున్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకొని ఏపీ మహిళలు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పవన్ ఆకాంక్షించారు. మొత్తం మీద పవన్ తన ప్రసంగంలో వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారని చెప్పవచ్చు. మరి ఈ కామెంట్స్ కి వైసీపీ ఎలా రిప్లై ఇస్తుందో వేచి చూడాలి.