Srikakulam : ఏపీలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా శ్రీకాకుళం పోలీసులకు చిక్కింది. వారి వద్ద నుంచి రూ.4.90 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. రిమాండ్ కు తరలించారు. కాగా.. వీరిపై గతంలోనూ భారీగానే కేసులు నమోదైనట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే జిల్లా ప్రజలకు పోలీసులు పలు సూచనలు చేశారు. సంక్రాంతి సందర్భంగా దొంగతనాలు మరింత పెరిగే అవకాశాలున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాల్లో ఇటీవల దొంగతనం ఘటనలు పెరిగిపోతున్న తరుణంలో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. జిల్లాలోని దొంగతనాల్లో మెజార్టీ వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారు చేస్తున్న వాటిగానే గుర్తించిన పోలీసులు.. వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే ఓ ముఠా సభ్యుల్ని అదుపులోకి తీసుకున్న శ్రీకాకుళం జిల్లా పోలీసులు.. వారి వద్ద నుంచి 7.1/3 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ 4.90 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఈ ముఠా సభ్యుల్ని మీడియా ఎదుట ప్రవేశపెట్టిన శ్రీకాకుళం జిల్లా ఎస్పీ పీ.మహేశ్వర్ రెడ్డి.. నిందితులపై గతంలో నమోదైన కేసుల గురించి వివరించారు.
దొంగతనం కేసుల్ని ప్రత్యేకంగా పరిగణించి.. ఆయా కేసులపై స్పెషల్ గా ఫోకస్ పెట్టినట్లు జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. అదుపులోకి తీసుకున్న నిందితులు ఇప్పుడే కాదని.. గతంలోనూ అనేక దొంగతనాలకు పాల్పడ్డారని వెల్లడించారు. వారి హిస్టరీని పరిశీలిస్తే.. శ్రీకాకుళం జిల్లాలోనే భారీగా దొంగతనాలకు పాల్పడ్డట్టు గుర్తించామని వెల్లడించారు. వారి వద్ద నుంచి రికవరీ చేసిన బంగారాన్ని.. బాధితులను గుర్తించి అందజేస్తామని ప్రకటించారు.
ఈ అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులు.. 2016-24 మధ్య శ్రీకాకుళం జిల్లాలోనే అనేక దొంగతనాలకు పాల్పడగా.. వీరిపై జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లల్లో దాదాపు 32 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. అంతేకాదు.. వీరులో చాలా మంది గతంలో వివిధ కేసుల్లో నిందితులుగా జైలుకు కూడా వెళ్లి వచ్చారని గుర్తించినట్లు ఎస్పీ మహేశ్వర రెడ్డి వెల్లడించారు. జిల్లాలోని కొత్తూరు పోలీస్ స్టేషన్ లలో ఈ ముఠా సభ్యులపై పలు కేసులు నమోదు అయినట్లు తెలిపారు. కొత్తూరు, మందస, ఎచ్చెర్ల, కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ లలో గతంలో నమోదైన కేసుల్లో వీరంతా నిందితులుగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. నిందితులపై కేడీ షీట్లు తెరుస్తున్నట్లు వెల్లడించారు.
Also Read : నడిరోడ్డుపై కత్తితో తోటి ఉద్యోగిని హత్య.. కారణం తెలిస్తే అంతా షాక్..
కాగా.. ప్రస్తుత అంతా సంక్రాతి పండుగ సీజను కావడంతో… ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రయాణ సమయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో తెలియని వారిని నమ్మొద్దని సూచించిన జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి.. మీమీ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. బస్సుల్లో, ఆటోల్ల ప్రయాణించే సమయాల్లో విలువైన బ్యాగుల్ని తీసుకువెళుతుంటే.. ఓ కంట కనిపెట్టుకుని ఉండాలన్నారు.