Pawan kalyan: రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు జాగ్రత్తగా వేయాలి. తేడా వస్తే మునిగిపోయినట్టే. సమయం, సందర్భాన్ని బట్టి అడుగులు వేస్తే రాజకీయాల్లో రాణించవచ్చు. ఇప్పుడు అలాంటి అడుగులే వేస్తున్నారు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ‘అడవితల్లి బాట’ పేరుతో ఏజెన్సీలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీని వెనుక అసలు కారణమేంటి?
ఒకప్పుడు కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ కంచుకోట ఏజెన్సీ ఏరియాలు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ కొన్ని సీట్లు వచ్చాయంటే అందులో ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి. ఏపీలో ఆ తరహా నియోజకవర్గాలు ఉమ్మడి జిల్లాల చొప్పున చూస్తే.. జిల్లాకు ఒకటి లేదా రెండు నియోజకవర్గాలు ఉండవచ్చు. పట్టణ ఓటర్లు మొగ్గు చూపకపోయినా, రూరల్ ఓటు బ్యాంకుపై చాలామంది దృష్టి పెడతారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా అదే చేస్తున్నారు.
విశాఖ ఏజెన్సీలో డిప్యూటీ సీఎం
అధికారంలోకి వచ్చాక కీలక నేతలు ప్రజల వద్దకు వెళ్లిన సందర్భం తక్కువగా ఉంటుంది. నేతలు, శాఖలతో సమావేశాలతో సమయం గడిచిపోతుంది.జనసేన అధినేత పవన్‌కల్యాణ్ రూటు మార్చారు. ‘అడవితల్లి బాట’ కార్యక్రమంతో ఏజెన్సీ ప్రాంతాలను చుట్టేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో రోడ్లు లేక గిరిపుత్రులు నానా కష్టాలు అనుభవిస్తున్నారు. ఇప్పుడు వాటిపై దృష్టి పెట్టారు.
సోమవారం ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీకి వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. డుంబ్రిగూడ మండలం పెద్దపాడుకు వెళ్తారు. అక్కడ రోడ్డు కనెక్టివిటీ లేకపోవడంతో కాలినడకన ఆ గ్రామానికి చేరుకున్నారు. రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం గ్రామస్తులతో సమావేశమయ్యారు. ముఖాముఖిలో గ్రామస్తులు అడిగిన 12 సమస్యలను ఆరు నెలల్లోపు పరిష్కరించాలని కలెక్టర్ దినేష్ కుమార్‌కు డిప్యూటీ సీఎం సూచించారు. మీ గ్రామానికి మరింత సదుపాయాలను సమకూర్చేందుకు ప్రయత్నిస్తానని అన్నారు.
మీతో పాటు నడిచి మీ కష్టాన్ని చూశానని, అందుకే రహదారులను పోరాడి సాధించామన్నారు పవన్ కల్యాణ్. ఈ నియోజకవర్గంలో మాకు ఓటు వేయకపోయినా సీఎం చంద్రబాబు, తాను చర్చించుకుని రహదారులను మంజూరు చేయించామన్నారు. ఆ తర్వాత పాడేరులో గిరిజనులను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది.
ALSO READ: రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ మృతి, మరో నలుగురికి గాయాలు
ఏప్రిల్ 8న సుంకరమెట్ట వద్ద అటవీ శాఖ నిర్మించిన ‘కానోపీ వాక్–వుడెన్ బ్రిడ్జి’ని ప్రారంభిస్తారు డిప్యూటీ సీఎం. మంగళవారంతో ఆయన పర్యటన పూర్తి కానుంది. అధినేత రావడంతో ఉమ్మడి విశాఖ జిల్లాలోని నేతలంతా పాడేరు ఏజెన్సీకి తరలివెళ్లారు. ఒక్క అల్లూరి సీతారామరాజు జిల్లాలో 167 గ్రామాలకు రోడ్డు కనెక్ట్‌విటీ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
డిసెంబర్‌లో పార్వతీపురం
అన్నట్లు గతేడాది డిసెంబర్ మూడోవారంలో పార్వతీపురం మన్యం జిల్లాకు వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అక్కడ రెండు రోజులు గడిపారు. వర్షం పడుతున్నా బురదలో కాలిబాటన ఆయా గ్రామాలకు చేరుకున్నారు. రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. అక్కడి గిరిపుత్రులతో మమేకం అయ్యారు. ఇప్పుడు అల్లూరి జిల్లా వంతు అయ్యింది. తర్వాత తూర్పుగోదావరి ఉంటుందని అంటున్నారు ఆ పార్టీ నేతలు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏజెన్సీల టూర్‌పై రకరకాల విశ్లేషణలు లేకపోలేదు. పార్టీని బలోపేతం చేసేందుకు వేసిన స్కెచ్‌లో భాగమని అంటున్నారు. టీడీపీకి ఎలాగూ సంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంది. ఎస్సీ వర్గకరణతో కొంతభాగం టీడీపీకి మళ్లవచ్చని అంటున్నారు. ఇక వైసీపీ వంతుకు వద్దాం. అధికారం కోల్పోయిన తర్వాత అధినేత జగన్ ఏ జిల్లాల్లో పర్యటించిన సందర్భం లేదు. వైసీపీ లోటును జనసేన భర్తీ చేయడం ఖాయమనే వాదన సైతం బలంగా వినిపిస్తోంది.