ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్య అది. ప్రభుత్వాలు మారినా ఉప్పాడ వాసుల తలరాత మాత్రం మారలేదు. దీర్ఘకాల సమస్య పరిష్కారానికి గతంలో టీడీపీ ప్రభుత్వం కొంత చొరవ చూపినా పూర్తి స్థాయిలో ఉప్పాడ వాసుల కష్టాలు మాత్రం తీరలేదు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని ఉప్పాడ ప్రాంతంలో ఎన్నికల సమయంలో పర్యటించిన పవన్ కల్యాణ్ శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నెరవేర్చే క్రమంలో తాజాగా ఆయన ఓ ట్వీట్ వేశారు. ఆ ట్వీట్ ఉప్పాడ వాసులకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఇంతకీ పవన్ ఇచ్చిన హామీ ఏంటి..? ఇప్పుడు పడిన ముందడుగేంటి..?
A long-standing coastal erosion problem in the Uppada region of the Pithapuram constituency is set to get a permanent solution. The Central Government through National Disaster Management Authority (NDMA) is actively considering a proposal to develop coastal protection structures… pic.twitter.com/wgLNAWdSLL
— Pawan Kalyan (@PawanKalyan) July 18, 2025
తీరప్రాంతం కోత..
ఉప్పాడ ప్రాంతంలో భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా సముద్రం తీరంలోకి చొచ్చుకొని వస్తూ ఉంటుంది. ఇప్పటికే తీరప్రాంతం చాలా వరకు కోతకు గురైంది. ఇళ్లు నేలమట్టం అయ్యాయి. సముద్ర అలల తాకిడికి కూలిపోయాయి. తుఫాన్లు వస్తే ఇక అక్కడి పరిస్థితి చెప్పనలవి కాదు. సముద్రం ఇళ్లపై పడిపోతున్నట్టుగా ఉంటుంది ఆ వాతావరణం. అందుకే ఉప్పాడ వాసులు క్షణమొక యుగంలా కాలం గడుపుతుంటారు. ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్లలేక, అక్కడ ఉన్న ఇళ్లను ఖాళీ చేయలేక అవస్థలు పడుతున్నారు.
ఐదేళ్లలో..
గత ఐదేళ్లలో ఉప్పాడలో ఏటా సగటున 1.23 మీటర్ల తీరప్రాంతం కోతకు గురవుతోంది, దీని ఫలితంగా దాదాపు 12 మీటర్ల మేర సముద్రం ముందుకు చొచ్చుకుని వచ్చింది. సమీప గ్రామాలను, ముఖ్యంగా మత్స్యకారుల ఇళ్లను ఇది ముంచేస్తోంది. దీంతో ఈ సమస్యని పరిష్కరించాలంటూ ఎన్నికల సమయంలో స్థానికులు పవన్ కల్యాణ్ కి మొరపెట్టుకున్నారు. పిఠాపురం నియోజకవర్గానికి ప్రత్యేకంగా మేనిఫెస్టో రూపొందించిన పవన్ ఈ అంశాన్ని ప్రముఖంగా అందులో ప్రస్తావించారు. తీరప్రాంతం మరింతగా కోతకు గురికాకుండా ఉండాలంటే అక్కడ రక్షణ గోడ నిర్మించాల్సి ఉంటుంది. సముద్రానికి రక్షణ గోడ అంటే దానికి చాలా ఖర్చు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అంత ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఉండదు. అందుకే ఈ విషయంలో కేంద్రాన్ని అభ్యర్థించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. సొంత నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకునే క్రమంలో ఆయన ముందడుగు వేశారు.
రూ.323 కోట్లు..
పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ ప్రాంతంలో చాలా కాలంగా ఉన్న తీరప్రాంత కోత సమస్యకు శాశ్వత పరిష్కారం లభించబోతోందంటూ తాజాగా పవన్ కల్యాణ్ ట్వీట్ వేశారు. రూ.323 కోట్ల అంచనా వ్యయంతో ఉప్పాడ వద్ద తీరప్రాంత రక్షణ గోడ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆల్రడీ ఓ ప్రతిపాదన పంపించింది. ఈ ప్రతిపాదనను జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) ద్వారా కేంద్ర ప్రభుత్వం చురుకుగా పరిశీలిస్తోందని తన ట్వీట్ లో పేర్కొన్నారు పవన్. ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా.. తీర ప్రాంత ప్రజల ఆకాంక్షలను కచ్చితంగా గుర్తిస్తారని అన్నారు పవన్. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ఏపీకి అండగా ఉంటుందని చెప్పారు.
ఉప్పాడ వాసుల్లో సంతోషం..
పవన్ కల్యాణ్ ట్వీట్ తో ఉప్పాడ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్య శాశ్వత పరిష్కారానికి డిప్యూటీ సీఎం కృషి చేస్తున్నందుకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ రక్షణ గోడ పూర్తయితే ఉప్పాడ వాసులు పవన్ ని జీవితాంతం గుర్తుంచుకుంటారనడంలో అతిశయోక్తి లేదు.