పవన్ కల్యాణ్ ఓజీ నుంచి ఫస్ట్ సింగిల్ నిన్న(శనివారం) రిలీజైంది. అదే రోజు పవన్ ఆ సినిమా లుక్ లో పబ్లిక్ అప్పియరెన్స్ ఇచ్చారు. అది ప్రభుత్వ కార్యక్రమం. మంగళగిరిలో జాతీయ రహదారుల శంకుస్థాపన, ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం చంద్రబాబుతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. అయితే ఇక్కడ ఆయన లుక్ ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం ఓజీ షూటింగ్ లో పాల్గొంటున్న ఆయన, అటునుంచి అటే ఈ కార్యక్రమానికి వచ్చారు. దీంతో అందరూ ఆయన్ను ఆసక్తిగా తిలకించారు. క్రీమ్ కలర్ ఫ్యాంట్, వైట్ షర్ట్.. నీట్ గా టక్ చేసుకుని, తన మార్క్ హెయిర్ స్టైల్, లైట్ బియర్డ్ తో ఓజీ లుక్ తో ఈ కార్యక్రమానికి వచ్చారు పవన్ కల్యాణ్.
మంగళగిరిలో నిర్వహించిన జాతీయ రహదారుల శంకుస్థాపన, ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ @nitin_gadkari గారు, ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు pic.twitter.com/ThoFa1zImU
— JanaSena Party (@JanaSenaParty) August 2, 2025
ఓజీ లుక్ లో పవర్ స్టార్
సహజంగా పవన్ కల్యాణ్ రాజకీయ, ప్రభుత్వ కార్యక్రమాలకు లాల్చీపైజమాలో హాజరవుతుంటారు. కానీ ఇటీవల సినిమా షూటింగుల్లో బిజీగా ఉండటంతో ఆయా సినిమాల్లో కనిపించే తరహాలోనే ఆయన ప్రజల ముందుకు వస్తున్నారు. ఆ మధ్య హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ సమయంలో కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు ఓజీ షూటింగ్ టైమ్ లో కూడా ఆయన ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అయితే ఓజీ గెటప్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. పవన్ అప్పియరెన్స్ అందర్నీ ఆకట్టుకుంటోంది. అందులోనూ ఓజీ నుంచి ఫస్ట్ సింగిల్ రావడం, అదే రోజు పవన్ ‘ఓజాస్ గంభీర’గా బయటకు రావడం అభిమానులకు పండగలా మారింది.
అడవితల్లి బాట..
ఈ కార్యక్రమంలో డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ ప్రతిపక్ష వైసీపీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వంలో కొత్త రోడ్లు వేయలేదు సరికదా ఉన్న వాటిపై కనీసం గుంతలు కూడా పూడ్చలేదన్నారు పవన్. కేంద్రం నుంచి సాయం వచ్చినా వాటి అభివృద్ధిపై సరైన శ్రద్ధ చూపలేదని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో గుంతలు పూడుస్తున్నామని, కేంద్ర సహకారంతో హైవేల నిర్మాణం ముమ్మరంగా సాగుతోందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఇలానే కొనసాగాలంటే మరో 15 ఏళ్లు కూటమి బలంగా ఉండాలన్నారు పవన్. నేషనల్ హైవేస్ లాగే.. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ‘అడవి తల్లిబాట’ పేరుతో రవాణా సదుపాయాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.500 కోట్లు, రాష్ట్రప్రభుత్వ వాటా రూ.50 కోట్లతో వీటిని అభివృద్ధి చేస్తున్నామన్నారు. గిరిజన ప్రాంతాల్లో నిర్మిస్తున్న రహదారులు రాష్ట్రాభివృద్ధికి గర్వకారణంగా నిలుస్తున్నాయన్నారు పవన్. పర్యావరణ సమతుల్యానికి భంగం కలగకుండా అటవీశాఖ అనుమతులతోనే ఈ రోడ్లు నిర్మిస్తున్నట్టు స్పష్టం చేశారు. దీని ద్వారా ఎకో టూరిజం అభివృద్ధి చెందుతుందని, రహదారులు బాగుంటేనే పరిశ్రమలు వస్తాయన్నారు. తద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని చెప్పారు.
హైవే మ్యాన్..
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని హైవే మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రశంసించారు డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్. 2014 నాటికి దేశంలో 91వేల కిలోమీటర్ల జాతీయ రహదారులుండగా.. ఇప్పుడు 1.46 లక్షల కిలోమీటర్ల మేర అవి పెరిగాయన్నారు. నిర్మాణవేగం మూడురెట్లు పెరిగడంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాత్ర చాలానే ఉందన్నారు.