Pithapuram Development: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
రూ. 1500 కోట్లతో పిఠాపురం ప్రగతి..
రాష్ట్ర, దేవ అభివృద్ధిలో భాగమయ్యేలా పిఠాపురం ప్రజలు అందించిన మద్దతుకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. రూ. 1500 కోట్ల నిధులతో పిఠాపురాన్ని మరింతగా అభివృద్ధి చేయబోతున్నట్లు ప్రకటించారు. కేవలం పేరుకే శిలాఫలకాలు వేయకుండా.. అన్ని అనుమతులు, ఆర్థిక వనరులు సిద్ధమయ్యాకే పనులు ప్రారంభించే సరికొత్త పద్ధతిని పాటిస్తున్నానని చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం..
ఉప్పాడ జియో ట్యూబ్ ప్రొటెక్షన్ వాల్, ఆర్వోబీ నిర్మాణం వంటి కీలక ప్రాజెక్టులకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీలకు అలాగే సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్రంలో ఉన్న గుడ్‌విల్ నియోజకవర్గ ప్రగతికి ఎంతగానో ఉపయోగపడుతోందని అన్నారు. ఎన్నికల్లో విజయం కోసం శ్రమించిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి క్యాంప్ ఆఫీస్..
స్థానిక ప్రజలకు, కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేందుకు త్వరలోనే పిఠాపురంలో క్యాంప్ కార్యాలయం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల ముందు కలిసి పనిచేసిన నాయకుల్లో ఇప్పుడు కాస్త సమన్వయం తగ్గినట్లు కనిపిస్తోందని, సమస్యలను ఎలా సర్దుబాటు చేయాలో తనకు తెలుసని పేర్కొన్నారు.
మౌలిక సదుపాయాలు..
పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి 100 పడకల ఆసుపత్రిగా మారుస్తున్నట్లు, రైల్వే స్టేషన్‌ను ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. అంతే కాకుండా, శ్రీ పాదగయ పుణ్యక్షేత్రం పక్కన ఉన్న చెత్త డపింగ్ యార్డ్‌ను తొలగించి, ఆ స్థలంలో ‘పీఠికాపురం వనం’ నిర్మించినట్లు తెలిపారు. పిఠాపురం చరిత్రలో ఏ ఎమ్మెల్యే చేయని రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Also Read: అరెస్టులకు భయపడేది లేదు.. అన్నదాతల తరఫున పోరాటం ఆపేది లేదు!- రామచందర్ రావు