Pawan With Nagababu: రాజకీయాలు ఎప్పుడు ఏ విధంగా టర్న్ అవుతాయో చెప్పడం కష్టం. ఏపీ రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్షణానికి ఒక్కో రకంగా అక్కడ రాజకీయాలు మారుతాయి. ఎమ్మెల్సీ పదవి నాగబాబు దూరమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్సీకి బదులుగా ఆయనకు ఛైర్మన్ పదవి ఇస్తారంటూ ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఇంతకీ జనసేన పార్టీలో ఏం జరిగింది.. జరుగుతోంది? ఏపీ అంతా దీనిపై చర్చ మొదలైపోయింది.
రాజ్యసభకు నాగబాబు మొగ్గు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు రేపో మాపో ఎమ్మెల్సీ అయిన ఆ తర్వాత మంత్రి అయిపోతారని వార్తలు జోరందకున్నాయి. ఎవరికి తగ్గట్టుగా వారు రాసుకొచ్చారు. కొందరైతే ఫలానా మంత్రి పదవి ఇస్తున్నారంటూ పుంకాను పుంకాలుగా వార్తలు రాసుకొచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఎమ్మెల్సీ, మంత్రి పదవిపై నాగబాబుకు ఆసక్తి లేదని తెలుస్తోంది. పెద్దల సభకు వెళ్లాలన్నది ఆయన కోరిక అని సమాచారం. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఆలోచనను మార్చుకున్నట్లు తెలుస్తోంది.
రెండు రోజుల కిందట చర్చ
రెండురోజుల కిందట అసెంబ్లీ ఛాంబర్‌లో సీఎం చంద్రబాబు-డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య దాదాపు గంటపాటు మాట్లాడుకున్నారు. ఇరువురు నేతలు ఏయే అంశాలపై మాట్లాడుకున్నారనే దానిని కాసేపు పక్కన బెడదాం. ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీట్లలో మండలికి ఎవర్ని పంపాలనే దానిపై చర్చ జరిగిందని పార్టీల వర్గాలు చెబుతున్నాయి.
నాగబాబుకు ఎమ్మెల్సీకి బదులు రాజ్యసభకే పంపాలని పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు వద్ద తన ఆలోచనను బయటపెట్టారట. ఎమ్మెల్సీ ఇస్తామని ఇప్పటికే బయట పెట్టామని, ఇప్పుడు మార్చితే రకరకాలుగా వార్తలు వస్తాయని చర్చించారట. ప్రత్యర్థులకు ఛాన్స్ ఇచ్చేవాళ్లమి అవుతామని అనుకున్నారట ఇరువురు నేతలు.
ALSO READ: ఆ ఇద్దరు నేతలెవరు?
తొలుత కార్పొరేషన్ ఛైర్మన్‌గా
జనసేన ప్రతిపాదనకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తొలుత నాగబాబుకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చి కొద్దిరోజుల తర్వాత రాజ్యసభకు పంపాలని ఇరువురు నేతలు నిర్ణయించినట్టు సమాచారం. ఈ క్రమంలో కార్పొరేషన్ ఛైర్మన్‌గా నాగబాబు రేపో మాపో బాధ్యతలు చేపట్టనున్నట్లు కూటమి వర్గాల నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది.
ఒకవేళ ఎంపీ సీటు నాగబాబుకు ఇస్తే.. ఆయనకు కేటాయించాలనుకున్న ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ అడిగే అవకాశాలున్నాయి. ఇక నాగబాబు పదవి విషయానికొద్దాం. రాష్ట్రంలో పర్యటనలు చేస్తూ పర్యావరణానికి దోహదం చేసే పోస్టు అయితే బాగుంటుందని అన్నారట డిప్యూటీ సీఎం.
ఇదీ అసలు కారణం ?
జనసేన నిర్ణయం వెనుక కారణాలు చాలానే ఉన్నాయట. నాగబాబును కేబినెట్‌లోకి తీసుకుంటే జనసేనలో సామాజిక సమతుల్యతతోపాటు రాజకీయంగా ఇబ్బందులు రావచ్చని భావించారట అధినేత. ఈ క్రమంలో పవన్ ఈ ప్లాన్ చేశారన్నది కొందరు జనసేన నేతల మాట.
ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చింది. వాటిలో ఒకటి నాగబాబుకు ఖాయమని భావించారు. ఆయన రాజ్యసభ వైపు మొగ్గు చూపారు. దీంతో జనసేన ఆ ఎమ్మెల్సీ సీటును ఎవరికి ఇస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సీటును నాగబాబుకు ఇవ్వాలని భావిస్తున్నారు నేతలు.