Pawan Kalyan: పాపులారిటీ ఉన్నంత మాత్రాన ఎవరు మేధావులు కారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అలాగే ఇంగ్లీష్ వచ్చినంత మాత్రాన జ్ఞానం అందినట్లు కాదని పవన్ వ్యాఖ్యానించారు. విజయవాడ లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం సాయంత్రం 35వ పుస్తక మహోత్సవ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. పుస్తక ప్రదర్శన ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పవన్ కళ్యాణ్ పలు నూతన పుస్తకాలను సైతం ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో పవన్ కళ్యాణ్ కీలక కామెంట్స్ చేశారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తాను ఎప్పుడు ఓటమి ఎదుర్కొన్న, తను కేవలం పుస్తకాలు చదివి ధైర్యం పొందానన్నారు. తనకు బాల్యం నుండే పుస్తక పఠనం అలవాటుగా మారిందని, తన తల్లి వల్ల సాహిత్యం పై అభిమానం తనకు అలవాటుగా మారిందన్నారు. తాను కోట్లు ఇచ్చేందుకు కూడా వెనుకడుగు వేయనని, ఒక పుస్తకం ఇచ్చేందుకు మాత్రం ఎక్కువగా ఆలోచిస్తానంటూ పవన్ అన్నారు. పుస్తక పఠనం ద్వారా మానసిక శక్తి లభిస్తుందని, ప్రతి ఒక్కరు పుస్తక పఠనం అలవాటును కొనసాగించాలని పవన్ కోరారు.
పార్వతీపురం మన్యంలో తాను పర్యటించేందుకు కేశవరెడ్డి రచించిన అతడు అడవిని జయించాడనే పుస్తకం ప్రోత్సహించిందన్నారు. పుస్తక పఠనం అలవాటుగా మారడం ద్వారా మన సంస్కృతి పట్ల అవగాహన కలుగుతుందన్నారు. పాపులారిటీ ఉన్నంత మాత్రాన జ్ఞానం ఉన్నవారిగా మనం భావించరాదని, అలాగే మేధావులు కూడా కారన్నారు. తనకు కూడా ఈ మాట వర్తిస్తుందని పవన్ చెప్పడం విశేషం. తిరుపతి వారాహి సభలో ప్రసంగించిన ప్రసంగపాఠాన్ని 7 గంటలు శ్రమించి రాసినట్లు పవన్ తెలిపారు. తెలుగు వ్యాకరణం పై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని, మాతృభాషపై పట్టులేకుండా పరభాషను నేర్చుకోవడం సబబు కాదన్నారు.
Also Read: AP Govt: ఏపీలో రెట్టింపు సాయంకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. తక్షణం అమల్లోకి..
మాతృభాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉందని, పుస్తక ప్రదర్శన ద్వారానే అది సాధ్యమవుతుందన్నారు. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్న సమయంలో అభిమానులు ఓజీ, ఓజీ అంటూ గట్టిగా కేకలు వేశారు. దీనిపై స్పందించిన పవన్ మాట్లాడుతూ.. తన అభిమానులు ఓజీ.. ఓజీ అనకుండా శ్రీశ్రీ.. శ్రీశ్రీ అంటూ శ్రీరంగం శ్రీనివాసరావు రచించిన రచనలను పఠించాలని పవన్ సూచించారు. తనకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గురించి మాట్లాడే అర్హత తనకు లేదని, ఆయనకు పాదాభివందనం చేయాలన్న తలంపు తన మదిలో ఉంటుందన్నారు. అయితే దేశానికి విశిష్ట సేవలందించిన పీవీకి ఢిల్లీలో సమాధి లేకపోవడం శోచనీయమని పవన్ అన్నారు.