Republic day : జనవరి 26 వచ్చిందంటే దేశమంతా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతాయి. మిగతా వారికి ఏమో కానీ.. పాఠశాల పిల్లలకైతే ఆ రోజు పండగే. ఉదయం సరదాగా కొత్త బట్టలు వేసుకొని బడికి వెళ్లడం, జాతీయ జెండాని ఆవిష్కరించుకుని వేడుకలు నిర్వహించుకోవడం వారికి ఎంతో ఇష్టం. అలా మధ్యాహ్నం వరకు పాఠశాల వివిధ కార్యక్రమాలు నిర్వహించి.. మధ్యాహ్నం నుంచి సెలవు ఇస్తుంటారు. కానీ.. ఇకపై పాఠశాలలకు సెలవులు ఇవ్వడం కుదరదంటోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం.. రిపబ్లిక్ డే రోజు సెలవుల కోసం కాదని, ఆరోజును పిల్లల్లో దేశ భక్తిని పెంపొందించేందుకు వినియోగించాలని ఆదేశించింది. ఇంతకీ.. ఏమన్నదంటే.?
ఉదయం జాతీయ జెండా ఎగురవేసిన తర్వాత.. విద్యార్థులకు రోజంతా దేశ భక్తిని పెంపొందించేలా వివిధ సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలలన్నిటికీ మహారాష్ట్ర విద్యాశాఖ సర్కులర్ జారీచేసింది. రిపబ్లిక్ డే నాడు రోజంతా విద్యార్థులను సాయంత్రం వరకు పాఠశాలలోనే ఉంచాలని, సెలవు ఇవ్వద్దని సూచించింది. ఆ సమయంలో వారికి ఇష్టమైన విభాగాల్లో పోటీ పడేలా.. వివిధ పోటీలు నిర్వహించాలని, విద్యార్థులు ఆనందంతో పాటు విజ్ఞానం నేర్చుకునేలా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించింది.
గణతంత్య్ర దినోత్సవం నాడు భారత దేశ ఘనమైన చరిత్ర, మన అద్భుతమైన సంస్కృతి, సంప్రదాయాలతో పాటు.. దేశ భవిష్యత్తుకు సంబంధించిన వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమాలు, పోటీలు నిర్వహించాలని అన్ని పాఠశాలలకు సూచించింది.
ఇదే ఉత్తర్వుల్లో పాఠశాలల్లో తప్పనిసరిగా నిర్వహించాల్సిన 8 కాంపిటీషన్స్, ఈవెంట్స్ ను ప్రభుత్వం ప్రస్తావించింది. వాటి ప్రకారం.. ఉదయం మార్నింగ్ మార్చ్ తర్వాత జెండా ఆవిష్కరణ సహా వకృత్వ పోటీలు, కవితలు, డాన్సింగ్, డ్రాయింగ్, క్రీడా పోటీలను ఏర్పాటు చేయాలని.. విద్యార్థులకు ఇష్టమైన వాటిలో పోటీ పడేలా ప్రోత్సహించాలని సూచించింది. అయితే ఇవన్నీ కూడా జాతీయ భావజాలాన్ని, దేశభక్తిని పెంపొందించేలా ఉండాలని నిర్దేశించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో తప్పనిసరిగా ఈ ఉత్తర్వులను పాటించాలన్న రాష్ట్ర విద్యాశాఖ అధికారులు.. పాఠశాలల్లోని కార్యక్రమాలను సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు ఉపాధ్యాయులు అభినందిస్తున్నారు. ఈ రోజు.. విద్యార్థులు సంతోషంగా గడపడంతో పాటు వివిధ కార్యక్రమాల ద్వారా వినోదాన్ని, విజ్ఞానాన్ని పొందాలనే ఆలోచన మంచిదని అభిప్రాయపడుతున్నారు. దేశ భక్తి, దేశాభిమానం చిన్నప్పటి నుంచే పిల్లల్లో పెంపొందించడం చాలా అవసరమని అంటున్నారు.
Also Read : భోపాల్ గ్యాస్ దుర్ఘటన.. 40 ఏళ్ల తర్వాత వ్యర్థాల తొలగింపు.. ఇంత టైమ్ ఎందుకు తీసుకున్నారు?
కాగా.. మరికొందరు మాత్రం పాఠశాలల పని దినాలు చాలా తక్కువగా ఉంటున్నాయని, పిల్లలకు సిలబస్ పూర్తి చేసేందుకు సమయం ఉండడం లేదంటున్నారు. కాబట్టి.. ఆరోజును తరగతుల నిర్వహణకు కేటాయిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. పిల్లలు సాధారణ రోజులతో పాటు గణతంత్య్ర దినోత్సవానికి ముందు నుంచే వివిధ క్రీడలు, సాంస్కృతిక పోటీల్లో పాల్గొంటున్నారని.. మళ్లీ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.