Pawan Kalyan on RGV Arrest: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కేసుకు సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా పవన్ పలు కీలక కామెంట్స్ చేశారు. ఇటీవల దర్శకుడు ఆర్జీవీపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యూహం సినిమా విడుదల సంధర్భంగా సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులను ఆర్జీవీ పోస్ట్ చేసినట్లు స్థానిక పోలీసులకు టీడీపీ కార్యకర్త ఫిర్యాదు చేశారు. అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసినట్లు ఫిర్యాదు అందగా పోలీసులు కేసు నమోదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు నేరుగా హైదరాబాద్ కు వచ్చి రామ్ గోపాల్ వర్మ కు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకు తనకు గడువు కావాలని ఆర్జీవీ రిప్లై ఇచ్చారు. మళ్లీ మరోమారు ప్రకాశం పోలీసులు, నోటీసులు అందించారు ఆర్జీవీకి.
ఆ నోటీసులు స్వీకరించిన ఆర్జీవీ మళ్లీ విచారణకు డుమ్మా కొట్టారు. ఈ దశలో ప్రకాశం పోలీసులు భారీగా ఆర్జీవీ ఇంటి వద్దకు చేరుకొని సర్చ్ వారెంట్ లేకపోవడంతో అక్కడే ఆయన కోసం పడిగాపులు కాశారు. ఈ దశలో ఆర్జీవీ షూటింగ్ నిమిత్తం వేరే చోటికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
ఇలా ఈ కేసు సాగుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. మీడియా ప్రతినిధులు ఆర్జీవీ అరెస్ట్ కు ఎందుకు జాప్యమవుతుందని అడిగిన ప్రశ్నకు పవన్ సమాధానమిస్తూ.. ఈ ప్రశ్న తనను కాదని సీఎం చంద్రబాబును కానీ, హోం మంత్రి అనిత ను అడగాలన్నారు.
గతంలో పోలీసులు చాలా స్పీడ్ గా ఉండేవారని, అందుకు భిన్నంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని మీడియా ప్రతినిధులు చెప్పగా.. తనను పంచాయతీ రాజ్ గురించి అడగాలని, ఏదైనా ఉంటే తాను సీఎం తో ప్రత్యేకంగా చర్చిస్తానన్నారు. పవన్ చేసిన ఈ కామెంట్స్ ని బట్టి, అసలు పోలీసులు ఏమి చేస్తున్నారో తెలియని పరిస్థితి పవన్ వద్ద ఉందని చర్చ సాగుతోంది.