పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ నేతలపై ఘాటైన విమర్శలు చేశారు. మరోవైపు సనాతన ధర్మం, సౌత్-నార్త్ వాదనలు, హిందీ-తమిళ వివాదాలపై కూడా స్పందించారు. పనిలో పనిగా.. ‘‘పవన్ కళ్యాణ్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ’’ అంటూ జగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కూడా పవన్ తనదైన శైలిలో స్పందించారు.
‘‘పార్టీ పెట్టాలంటే నాన్న ముఖ్యమంత్రి అయ్యిండాలా? బాబాయిని చంపించి ఉండాలా? అలా అని ఎక్కడా రాసిపెట్టి లేదు కదా? అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లో పవర్ కోసం పని చేయాలని.. లేదా బలమైన సిద్ధాంతం ఉండాలని అన్నారు. పవర్ కోసం మర్డర్లు చేయిస్తాం.. వేల కోట్లు దోచేస్తాం.. కులాలను కెలికేస్తాం.. రకరకాలుగా లాభపడతాం.. కోడి కత్తిని వాడుకుంటాం అంటే నడవదన్నారు. అలాంటి వాటిని తాను ఎంచుకోలేదని, తాను సైద్ధాంతిక రాజకీయాన్ని మాత్రమే ఎన్నుకున్నాని.. అందుకే దేశ భద్రత కోసం ఆలోచిస్తున్నా అన్నారు పవన్.
రిజిస్ట్రార్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీగా జనసేన ఎదిగిందని తెలిపారు. సమాజంలో మార్పు కోసం పని చేయాలని వచ్చినవాడిని నేను. ఓట్ల కోసం వచ్చిన వాడిని కాదని అన్నారు. ఇన్ని మాటలు మాట్లాడే ఇంగ్లీష్ పత్రికల వాళ్లు.. ఒకసారి ఆలోచన చేసుకోవాలంటూ సెటైర్లు విసిరారు. దశాబ్దం పాటు పార్టీని నడపాడాలంటే ఎన్నో తిట్లు తినాలని పవన్ తెలిపారు. వ్యక్తిగత జీవితం నుంచి ఆరోగ్యం వరకు తాను ఎన్నో పోగొట్టున్నానని వ్యాఖ్యనించారు. మార్షల్ ఆర్ట్స్‌లో తాను మూడు గ్రానైట్ రాళ్లు పెట్టి పగులకొట్టించుకొనేవాడిని అని, అలాంటిది.. ఇప్పుడు తన రెండో కొడుకుని కూడా ఎత్తుకోలేనంత బలహీనపడ్డానని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో తిరిగి బలం తెచ్చుకుంటానని పవన్ పేర్కొన్నారు.
జనసేన పుట్టింది తెలంగాణలో..
జనసేన పార్టీ పుట్టింది తెలంగాణలో అని, కర్మస్థానం ఆంధ్రప్రదేశ్ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తన కోసం వచ్చిన తెలంగాణ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. కరెంట్ షాక్ కొట్టి చావుబతుకుల్లో ఉన్న తనకు కొండగట్టు అంజన్న ప్రాణం పోశాడని పవన్ అన్నారు. సగటు మధ్యతరగతి మనిషిగా బతకాలనేదే తన కోరిక అని పవన్ అన్నారు. ‘చంటి’ సినిమాలో హీరోయిన్ మీనాను పెంచినట్టు తనను పెంచారన్నారు. తనకు ఆస్తమా ఉండేదని, బయటకు వెళ్తే ఏమవుతానో అని ఇంట్లో వారు భయపడేవారని చెప్పారు. ఎప్పుడూ భయపడేవారు’’ అని పవన్ పేర్కొ్న్నారు. డిగ్రీ పూర్తి చేసి ఎస్‌ఐను కావాలని మా నాన్న అనేవారని పవన్ తెలిపారు. తాను రాజకీయ నేతను అవుతానని ఎవరూ ఊహించలేదని అన్నారు. 2003లో రాజకీయాల్లోకి వెళ్తానని అమ్మ, నాన్నకు చెప్పానని, అది విని మంచి కెరీర్‌ను వదిలి వెళ్తావా అని తిట్టారని పవన్ గుర్తు చేసుకున్నారు. తన జీవితం రాజకీయాలకే అంకితమని అన్నారు.
Also Read: తమిళ్-హిందీ వివాదంలో వేలు పెట్టిన పవన్.. హిందీలోకి డబ్బింగ్ చేయొద్దంటూ..