Big Stories

MODI: మోదీతో భేటీ కానున్న జనసేనాని.. రెండురోజులపాటు విశాఖలోనే జగన్,పవన్

మోదీతో పవన్ భేటీ
MODI : ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన రాజకీయంగా వేడిని పెంచేసింది. విశాఖకు వస్తున్న ప్రధానితో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ అవుతారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, తాజా రాజకీయాలపై 30 నిమిషాలపాటు చర్చించే అవకాశముందని సమాచారం. మరోవైపు విశాఖలో బీజేపీ నిర్వహించే ర్యాలీలో పవన్‌ పాల్గొంటారా? లేదా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.నవంబర్ 11న బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పవన్‌ విశాఖ చేరుకుంటారు. రెండ్రోజులపాటు నగరంలో పర్యటిస్తారని జనసేన వర్గాలు తెలిపాయి. ఇటీవల విశాఖలో వైఎస్ఆర్ సీపీ గర్జన సమయంలోనూ పవన్ జనవాణి కార్యక్రమం పేరుతో పర్యటించారు. ఆ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో మరోసారి విశాఖకు పవన్ వస్తారనే వార్త హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

బహిరంగ సభ
ప్రధాని మోదీ నవంబర్ 11న నగరానికి వస్తున్నారు. నవంబర్ 12న విశాఖలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. మరో రెండు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. ప్రధాని కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధపెట్టింది. వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

- Advertisement -

విశాఖకు సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవంబర్ 11 సాయంత్రం విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు.అక్కడ నుంచి ఐఎన్‌ఎస్‌ డేగాకు వెళ్లి ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారు.రాత్రి పోర్టు గెస్ట్‌హౌస్‌లో సీఎం జగన్ బస చేస్తారు. నవంబర్ 12 ఉదయం ఏయూ గ్రౌండ్‌లోని హెలీప్యాడ్‌ వద్దకు చేరుకుని ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారు. ప్రధానితో కలిసి పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు.ఆ తర్వాత ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకొని ప్రధానికి వీడ్కోలు పలుకుతారు.

స్టీల్ ప్లాంట్ కార్మికుల హెచ్చరిక
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు కార్మికులు ఆందోళనలు ఉద్ధృతం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న తర్వాతే మోదీ విశాఖలో అడుగుపెట్టాలని హెచ్చరించారు. ప్రధాని పర్యటనకు ముందే ర్యాలీ, పాదయాత్ర చేపట్టి తమ ఉద్ధేశాన్ని చాటిచెప్పారు. ఈ నేపథ్యంలో ప్రధాని టూర్ సందర్భంగా ఎలాంటి ఆందోళన చేస్తారో అనే ఉత్కంఠ నెలకొంది.

ప్రధాని పర్యటన, మోదీతో పవన్ కల్యాణ్ భేటీ, సీఎం వైఎస్ జగన్ టూర్, స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన మొత్తంగా రెండురోజులపాటు విశాఖ కేంద్రంగా రాజకీయాలు హీటెక్కనున్నాయి. ఇప్పుడు ఏపీలో ఈ టాపిక్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News