Bowling Failure : పేసర్లలో స్వింగ్ మిస్ అయ్యింది. స్పిన్నర్లు తిప్పలేకపోయారు. బంగ్లాదేశ్ లాంటి ప్రత్యర్థి వణికించింది. చివరి ఓవర్లలో బౌలర్లు తేలిపోవడంతో దక్షిఫ్రికాపైనా ఓడిపోయారు. ఇదీ టీ20 వరల్డ్ కప్ లో భారత్ బౌలర్ల ప్రదర్శన.
పదును తగ్గిన పేస్
బూమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది. కీలక సమయాల్లో వికెట్లు తీసే బౌలర్ కరువయ్యాడు. భువనేశ్వర్ కుమార్ పొదుపుగా బౌలింగ్ చేసినా.. వికెట్లు తీయలేకపోయాడు. 6 మ్యాచ్ ల్లో భువి 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. బూమ్రా గాయపడటంతో జట్టులోకి వచ్చిన షమీ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. 6 మ్యాచ్ ల్లో 6 వికెట్లు మాత్రమే తీశాడు షమీ. పేసర్లలో అర్షదీప్ ఒక్కడే మెరుగ్గా రాణించాడు. అర్షదీప్ 6 మ్యాచ్ ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. అయితే పరుగులు మాత్రం ఎక్కువ ఇచ్చాడు. ప్రధాన బౌలర్ల కంటే ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా మెరుగ్గా బౌలింగ్ చేశాడు. ఈ టోర్నిలో 8 వికెట్లు తీశాడు.
స్పిన్నర్లు తేలిపోయారు
చాలా కాలం తర్వాత టీ20 జట్టులోకి వచ్చిన సీనియర్ స్పిన్నర్ అశ్విన్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. వికెట్లు తీయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. 6 మ్యాచ్ ల్లో 6 వికెట్లే తీసి పరుగులు భారీగా సర్పించుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ కు ముందు అద్భుతంగా రాణించిన మరో స్పిన్నర్ అక్షర్ పటేల్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. అక్షర్ ఆశించిన ప్రదర్శన చేయలేకపోయాడు. ఆసీస్ వికెట్లపై ఏ మాత్రం రాణించలేకపోయాడు. అక్షర్ పటేల్ 5 మ్యాచ్ ల్లో 3 వికెట్లు మాత్రమే తీశాడు. బౌలర్లలో అందరికంటే ఎక్కువ పరుగులు ఇచ్చింది అక్షర్ పటేలే. మరో స్పిన్నర్ చాహల్ కు ఒక్క మ్యాచ్ లో కూడా ఆడే అవకాశం దక్కలేదు. అక్షర్ , అశ్విన్ లో ఎవరో ఒకరిని తప్పించి చాహల్ కు అవకాశం ఇవ్వలేదు. వరసగా విఫలమైనా అశ్విన్, అక్షర్ పటేల్ కే కెప్టెన్ రోహిత్ శర్మ అవకాశం కల్పించాడు. చాహల్ ను పరీక్షించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. పార్ట్ స్పిన్నర్ కమ్ బ్యాటర్ దీపక్ హుడా వచ్చిన ఒక్క అవకాశాన్ని దుర్వినియోగం చేశాడు. హుడా దక్షిణాఫ్రికాపై డకౌట్ అయ్యి తీవ్ర నిరాశపర్చాడు. ఆ మ్యాచ్ లో హుడాకు బౌలింగ్ చేసే అవకాశం దక్కలేదు.
ఆ ఇద్దరూ లేకపోవడం లోటే
బూమ్రా గాయంతో వరల్డ్ కప్ కు దూరం కావడంతో భారత్ జట్టు బౌలింగ్ బలహీన పడింది. అన్ని మ్యాచ్ ల్లో చివరి ఓవర్లలో భారత్ బౌలర్లు తేలిపోయారు. డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసే బూమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది. ప్రారంభ ఓవర్లలో మెరుగ్గా బౌలింగ్ చేసిన భువి, షమీ చివరి ఓవర్లలో తేలిపోయారు. ఒక్క అర్షదీప్ ఒక్కడే కాస్త మెరుగ్గా బౌలింగ్ చేశాడు. గాయంతో రవీంద్ర జడేజా దూరం కావడం జట్టుకు లోటే. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో ఆ లోటు కనిపించింది. ఆ ఇద్దరూ ఉండుంటే జట్టులో సమతుల్యం వచ్చేది. బ్యాటింగ్ వైఫల్యాలు, బౌలర్లు విఫలం కావడం, ఫీల్డింగ్ లో కీలక సమయాల్లో క్యాచ్ లు నేలపాలు చేయడం ఇలా అన్ని రంగాల్లో టీమిండియా వైఫల్యం చెందింది. ఇంగ్లండ్ పై సెమీస్ లో ఓటమికి బౌలర్ల వైఫల్యమే కారణమైనా..టోర్నిలో బ్యాటింగ్ లోనూ రోహిత్ సేన అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయింది.