Perni Nani on Vijayamma: మొన్నటి వరకు ఆ పార్టీ గౌరవ అద్యక్షురాలుగా వ్యవహరించారు ఆ మహిళా నేత. అంతేకాదు ఆమె దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి కూడా. వైఎస్సార్ సక్సెస్ లో సతీమణిగా ఈమె పాత్ర కీలకం. అంతేకాదు ఈ మహిళా నేత కుమారుడు మొన్నటి వరకు సీఎంగా కొనసాగారు. కుమార్తె కూడా ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కూడా. తన భర్త, బిడ్డల సక్సెస్ లో ఈమెదే కీలక పాత్ర అంటారు ఆ ఫ్యామిలీ అభిమానులు. ఇంతగా చెప్పిన తరువాత ఆ మహిళా నేత ఎవరో తెలుసుగా.. ఆమెనే వైఎస్సార్ సతీమణి విజయమ్మ.
అటువంటి ఘనకీర్తి గల విజయమ్మను ఉద్దేశించి, తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్స్ పై సొంత పార్టీ నాయకులే విబేధిస్తున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇంతకు నాని ఏమన్నారు? ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారో తెలుసుకుందాం.
ఇటీవల మాజీ సీఎం జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిళ మధ్య విభేదాలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆస్తుల విషయంలో వీరి మధ్య మాటల యుద్దం సాగుతుండగా, ఇటీవల షర్మిళ మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుటుంబానికే చెందిన ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నా, చెల్లెల మధ్య సాగుతున్న వివాదంలో జోక్యం చేసుకొని షర్మిళపై విమర్శలు చేశారు. అలాగే వైసీపీ నేత విజయసాయి రెడ్డి కూడా షర్మిళను టార్గెట్ చేస్తూ మీడియా సమావేశం నిర్వహించారు.
ఇలా వివాదం సాగుతున్న క్రమంలో వైఎస్సార్ సమీప బంధువు, మాజీ మంత్రి బాలినేని కూడా స్పందించి ఈ వివాదానికి తెర పడాలంటే జడ్జిగా విజయమ్మ వ్యవహరించాలని, కుటుంబ సమస్యను బహిరంగ పరచుకోవడం బాగా లేదంటూ తన వాదన వినిపించారు. ఇటీవల జనసేనలో చేరిన బాలినేని.. కూటమికి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు మద్దతుగా, ఫ్యామిలీ తగాదాలో వీరికి ఏమి సంబంధం అంటూ ప్రశ్నించారు.
బాలినేని కామెంట్స్ పై స్పందించిన మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ నేరుగా విజయమ్మనే దృష్టిలో ఉంచుకొని చేసిన వ్యాఖ్యలు వైసీపీలోని నేతలకే రుచించడం లేదని సమాచారం. బాలినేని ఆస్తుల వివాదంలో విజయమ్మ జడ్జిగా ఉండాలి అంటే జడ్జిగా ఉండేవారు మధ్యస్థంగా ఉండాలని, ఒకరివైపు మాట్లాడేవారు జడ్జి ఎలా అవుతారంటూ ప్రశ్నించారు. ఇప్పుడు ఈ మాటలే మరో వివాదానికి దారి తీయనున్నాయట. బాలినేని కామెంట్స్ పై ఆయనను విమర్శించాలి కానీ, విజయమ్మను విమర్శించడం ఏమిటన్నది ఇప్పుడు చర్చ.
తల్లికి ఇద్దరు బిడ్డలలో ఎవరు కావాలని ప్రశ్నిస్తే, చెప్పే సమాధానం ఇద్దరూ అనే వస్తుంది. అటువంటి తల్లి హోదాలో గల విజయమ్మను, ఒకరి వైపే మద్దతుగా నిలుస్తారనే రీతిలో నాని కామెంట్స్ చేయడం ఎంతవరకు సబబని వైఎస్సార్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. విజయమ్మ ఏనాడూ వివాదాల జోలికి వెళ్ళకుండా, కుటుంబాన్ని విజయవంతంగా సాగించారని, అటువంటి సంధర్భంలో విజయమ్మ జడ్జిగా తీర్పు చెప్పలేరని నాని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ కామెంట్స్ పై విజయమ్మ స్పందిస్తారా, లేక షర్మిళ స్పందిస్తారా అన్నది వేచిచూడాలి.