Ysrcp Leaders: వైసీపీ నేతల టార్గెట్ ఫిక్స్ అయ్యిందా? నెక్ట్స్ రేసులో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, పేర్నినాని, రోజాలు ఉన్నారా? హోంమంత్రి ఎలాంటి సంకేతాలు ఇచ్చారు? ప్రస్తుతం పలు కేసులపై విచారణ జరుగుతోందని, పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు మంత్రి అనిత.
ఏపీలో వరుసగా నమోదైన కేసులు వైసీపీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ విషయంలో మాజీమంత్రుల జాబితాలో రెడీ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం లిక్కర్ కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ కేసులో రేపో మాపో కొందరు నేతలను విచారణకు పిలిచేందుకు సిట్ రెడీ అయినట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. కాసేపు ఈ కేసు పక్కకు పెడదాం.
వైసీపీలో మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్నారు పేర్నినాని. కృష్ణా జిల్లా పామర్రులో కార్యకర్త మీటింగ్‌లో రప్పా రప్పా అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు సుప్రీంకోర్టుకి వెళ్లే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కోసం ప్రత్యేక పోలీసులు బృందాలు గాలిస్తున్నాయి.
ఒకవేళ ఆయన కనిపిస్తే అరెస్టు చేయాలని సిద్ధంగా ఉన్నారు పోలీసులు. ఈ వ్యవహారంపై ఇటీవల హైకోర్టు తలుపుతట్టారు. తనపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం ఆ పిటిషన్ విచారణకు రానుంది. అరెస్టు నుంచి రక్షణ ఉండదని భావించిన ఆయన అజ్ఞాతంలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
ALSO READ: ఏపీలో కొత్త ఎయిర్ పోర్టులపై కేంద్రమంత్రి ప్రకటన
మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైసీపీ అధినేత జగన్ ఆయన్ని కుడి భుజంగా చెబుతుంటారు ఆ పార్టీ నేతలు . ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. మదనపల్లి ఫైల్స్ దగ్దం కేసులో మాజీ ఆర్డీవో మురళిని అరెస్టు చేశారు సీఐడీ అధికారులు. వెంటనే బెయిల్‌పై విడుదలయ్యారు.
ఈ వ్యవహారంపై హోంమంత్రి అనిత కీలక కామెంట్స్ చేశారు. మదనపల్లి ఫైల్స్, అటవీ భూముల్లో అక్రమ నిర్మాణాలపై కేసులపై విచారణ జరుగుతున్నాయని అన్నారు. ఆధారాలు దొరికితే ఏమైనా జరగొచ్చని పరోక్షంగా పెద్దాయన అరెస్టుపై సంకేతాలు ఇచ్చారు.
మరో మంత్రి రోజా గురించి చెప్పనక్కర్లేదు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పేరిట 100 కోట్ల రూపాయలను గోల్‌మాల్ అయినట్టు వార్తలు వచ్చాయి. దానిపై విచారణకు కమిటీ వేసింది ప్రభుత్వం. వచ్చేవారం ప్రభుత్వానికి నివేదిక చేరనుంది.
ఆ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత అందులో ప్రమేయమున్న అప్పటి వైసీపీ నేతలు, అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. మొత్తానికి వైసీపీ కీలక నేతల చుట్టూ ఉచ్చు బిగిసుకుంటుందని చెప్పవచ్చు. లిక్కర్ కేసుకు ముందు ఆ నేతలను అరెస్టు చేసే అవకాశాలున్నట్లు ఇంకోవైపు పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం మొదలైంది.