AP New Airports: ఏపీలో కొత్త విమానాశ్రయాల గురించి కీలక ప్రకటన చేసింది కేంద్రప్రభుత్వం. కుప్పంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు ఏపీ ప్రభుత్వం దరఖాస్తు పంపినట్టు తెలిపింది. ప్రస్తుతం భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం జరుగుతోందన్నారు. దీనికితోడు మరికొన్ని విషయాలు వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్‌పోర్టుల అభివృద్ధిపై చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది. కనీసం రెండు జిల్లాలకు ఒక ఎయిర్‌పోర్టు చొప్పున ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల అధికారుల సమావేశంలో ఆయా అంశాలపై చర్చించారు. కేవలం ట్రావెలర్లకు మాత్రమే కాకుండా కార్గో రవాణాకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏవియేషన్ ఇంజనీరింగ్ కాలేజీకి ప్లాన్ చేశారు సీఎం చంద్రబాబు.
ఈ నేపథ్యంలో రాజ్యసభలో ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టుల గురించి పలువురు సభ్యులు లేవనెత్తారు. టీడీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు సోమవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు విమానయాన సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ కీలక ప్రకటన చేశారు. వాటిలో రెండు ఎయిర్‌పోర్టుల గురించి క్లారిటీ ఇచ్చారు. ఏపీ నుంచి వారానికి 1,194 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయని తెలిపారు.
ప్రస్తుతం ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో నాలుగేళ్ల నుంచి అందుబాటులో ఉందని తెలిపారు సదరు మంత్రి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతోందన్నారు. రీసెంట్‌గా కుప్పంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు అభివృద్ధికి ఏపీ సర్కార్ స్థలం కోసం దరఖాస్తు చేసిందన్నారు.
ALSO READ: అర్జెంటుగా పాదయాత్ర, జగన్ వ్యూహమేంటి?
దగదర్తి ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం 2018లో కుదుర్చుకున్న అగ్రిమెంట్‌ను ఆ తర్వాత రద్దు చేసుకుందని వెల్లడించారు. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల పాలసీ ప్రకారం కొత్త ఎయిర్‌పోర్టులు కావాలంటే డెవలపర్లను ఎంచుకోవాలన్నారు. ఆ తర్వాత భూసేకరణ, అనుమతులు, చివరకు ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలన్నారు. మొత్తానికి కుప్పం ఎయిర్‌పోర్టు గురించి కదలిక వచ్చింది.
దీనికితోడు సీ ప్లేన్ గురించి ప్రకటన చేశారు సదరు మంత్రి. ఉడాన్ పథకం 5.5 కింద కింద సీప్లేన్‌ల నిర్వహణకు అనుమతులు జారీ చేసినట్టు వెల్లడించారు. వాటి నిర్వహణకు ఎయిర్‌లైన్ ఆపరేటర్లకు లెటర్ ఆఫ్ ఇంటెంట్‌లు జారీ చేశామన్నారు. వాటిలో ఉత్తరాంధ్ర నుంచి రుషికొండ, అరకు, లంబసింగి ఈ ప్రాంతాలు ఉన్నాయి.
ఉభయగోదావరి నుంచి కాకినాడ, కోనసీమ, నర్సాపూర్ ప్రాంతాలున్నాయి. ప్రకాశం బ్యారేజీ, రాయలసీమ నుంచి తిరుపతి, గండికోట, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నుంచి సీప్లేన్‌ల నిర్వహణకు LOIలు జారీ చేసినట్టు తెలియజేశారు. వాటికి సంబంధించి డీజీసీఏ భద్రతా నిబంధనల్లో మార్పులు చేసిందని, శిక్షణ, అనుమతుల ప్రక్రియ సులభతరం అవుతుందన్నారు. అలాగే స్థలం ఎంపిక సులువుగా ఉంటుందన్నారు.