Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు కొత్త కష్టాలు మొదలైనట్టు కనిపిస్తు న్నాయి. లిక్కర్ కుంభకోణంలో రేపోమాపో ఆయనకు నోటీసు ఇచ్చేందుకు సిట్ సిద్ధమవుతోంది. అదే సమయంలో కొత్త సమస్య మొదలైంది. వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలపై సీబీఐ-ఈడీతో దర్యాప్తు చేయించాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. వచ్చేవారం ఆ పిటిషన్ విచారణకు రానుంది.
వైసీపీ హయంలో జరిగిన అవినీతిపై ఒక్కోదానిపై విచారణ మొదలైంది. ఏ శాఖ పట్టుకున్నా అవినీతి జరిగిందంటూ కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అందుకు సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేసింది. ఇసుక, లిక్కర్, రేషన్ బియ్యం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇదే పాయింట్ పట్టుకుని ఓ అడ్వకేట్ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
కూటమి సర్కార్ బయటపెట్టిన శ్వేతపత్రాల ఆధారంగా వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అవకతవకలపై విచారణ జరిపించాలని ఢిల్లీకి చెందిన అడ్వకేట్ మెహెక్ మహేశ్వరి పిల్ వేశారు. కూటమి సర్కార్ విడుదల చేసిన శ్వేతపత్రాల ఆధారంగా సీబీఐ-ఈడీ-ఐటీ శాఖలతో దర్యాప్తు చేయించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ అందులో పేర్కొన్నారు.
ఆయా సంస్దలతో ఓ సిట్ ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు జరిగేలా చూడాలన్నది ప్రధాన పాయింట్. దీనిపై ఆగస్టు 6న హైకోర్టు సీజే ధీరజ్‌సింగ్ ఠాకూర్ ధర్మాసనం ముందు విచారణకు రానుంది.
ALSO READ: సింహాచలం ఆలయంలో వివాహాలు.. కొత్త రూల్స్ వచ్చేశాయి
ఆన్‌లైన్‌లో హాజరైన అడ్వకేట్ మహేశ్వరి.. తన వాదనలను స్వయంగా వినిపించడానికి కొంత సమయం కోరారు. ఇప్పటి వరకు ఎన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారని న్యాయస్థానం ప్రశ్నించింది. మూడు నుండి నాలుగు పిటిషన్లు దాఖలు చేశానని బదులిచ్చారు.
ఆయా అంశాలపై సిట్ దర్యాప్తు కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ హైకోర్టుకు వివరించారు. జగన్, సహచరులు పాల్పడిన అక్రమాలపై నిష్పాక్షికంగా దర్యాప్తు జరిగేలా చూడాలన్నారు. ఈ పిటిషన్‌పై విచారించనున్న న్యాయస్థానం, ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందన్న చర్చ అప్పుడే వైసీపీలో మొదలైంది.
దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తే, జగన్ ఇబ్బందుల్లో పడినట్టేనని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే వివిధ శాఖల్లో విచారణ కొనసాగుతోంది. లిక్కర్ విషయంలో దాదాపు డజను మందిని అరెస్టు చేశారు సిట్ అధికారులు. ఈ కేసులో రేపోమాపో కొందరికి నోటీసులు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి సమయంలో న్యాయస్థానం ఎటువైపు మొగ్గు చూపుతుందో చూడాలి.