పోలవరం విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం మళ్లీ మొదలైంది. పోలవరంపై చంద్రబాబు సమీక్ష తర్వాత మాజీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెరపైకి వచ్చారు. పోలవరం గురించి, చంద్రబాబు వైఖరి గురించి సుదీర్ఘంగా విమర్శించారు. మంత్రిగా ఉండగా అసలు పోలవరం అర్థంకాని సబ్జెక్ట్ అని చెప్పిన అంబటి, ఇప్పుడు లెక్కలు చెప్పడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబుపై విమర్శలు చేసి నిజంగానే అంబటి వైసీపీ పరువు తీస్తున్నారనిపిస్తోంది.
చంద్రబాబు ఏమన్నారు..?
2027లో జరిగే గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకపోతే 2027 ఏప్రిల్ నాటికే పోలవరం పూర్తి చేస్తామన్నారాయన. ఒకవేళ ఇబ్బందులు ఎదురైనా 2027 డిసెంబరుకు పోలవరం కంప్లీట్ కావడం గ్యారెంటీ అన్నారు. జగన్ రాజకీయ కక్ష వల్లే ఈ ప్రాజెక్టులో ఇంత విధ్వంసం జరిగిందని అన్నారు చంద్రబాబు. 2019లో వైసీపీ ప్రభుత్వం రావడం వల్లే ప్రజల జీవనాడి అయిన పోలవరం ధ్వంసమైందన్నారు. రివర్స్ టెండర్ల వల్ల రూ.5,282 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. 2019లో కూడా టీడీపీ ప్రభుత్వం ఏర్పడి ఉంటే 2020 నాటికే పోలవరం పూర్తయ్యేదని అన్నారు చంద్రబాబు. అప్పుడు కాకపోయినా ఇప్పుడు టీడీపీ హయాంలో పోలవరం పూర్తయితే కచ్చితంగా అది వైసీపీకి ఇబ్బందిగా మారుతుంది. అందుకే సడన్ గా అంబటి ఎంట్రీ ఇచ్చారు. చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు.
అంబటి కౌంటర్లు..
పోలవరాన్ని సర్వనాశనం చేసింది, అక్కడ విధ్వంసం చేసింది చంద్రబాబేనని అంటున్నారు అంబటి రాంబాబు. వైఎస్ జగన్ హయాంలో పోలవరం పనులు శరవేగంగా నడిచాయని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అబద్ధాలు చెప్పటంలో అందరికన్నా పెద్దవాడని, నిజాలు చెప్పటంలో అందరికన్నా చిన్నవాడని అన్నారు. జగన్ పాలనలో పోలవరం నిధులు దారి మళ్లాయని చెప్పడం అబద్ధం అని అన్నారు అంబటి.
అప్పట్లో అనిల్..
అంబటి మాటలకు టీడీపీ కౌంటర్ ఇవ్వాల్సిన పని కూడా లేదు. అందుకే ఆ పార్టీ నేత చేసిన వ్యాఖ్యల్ని టీడీపీ రివర్స్ లో పోస్ట్ చేసింది. వైసీపీ హయాంలో జలవనరుల శాఖకు ఇద్దరు మంత్రులు పని చేశారు. తొలి సగం అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉంటే, మలి సగం ఆ బాధ్యతలు అంబటి తీసుకున్నారు. తాను ఉన్నంత వరకు పోలవరం పనుల్లో ఆటంకాలు లేవంటూ అప్పట్లో అనిల్ చెప్పారు. అంటే ఆ తర్వాతే దాని పనులు నత్తనడకన సాగాయనేది ఆయన వేసిన సెటైర్. సొంత పార్టీ నేతపై కూడా అయన జోక్ లు వేశారు. ఒకరకంగా గతంలో చంద్రబాబు పాలనలో కూడా పోలవరం ప్రాజెక్ట్ పనులు సజావుగా సాగాయని అనిల్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ కామెంట్లను హైలైట్ చేస్తూ ఇప్పుడు టీడీపీ కౌంటర్లిస్తోంది.
డయాఫ్రమ్ వాల్ ఎక్కడ కడతారో కూడా తెలియని వ్యక్తి జగన్. క్యూసెక్కుకి టిఎంసికి తేడా తెలియని వ్యక్తి అంబటి. ఈ అజ్ఞానులు ఈ రోజు చంద్రబాబు గారి పోలవరం ప్రాజెక్టు పరిశీలనపై విమర్శలు చేస్తున్నారు. పోలవరం అంటే నాకు తెలియదు, నాకు అర్ధం కాదు అని చెప్పే అంబటి, తనకి బాగా తెలిసిన విషయాల వరకు… pic.twitter.com/Z8Mi7EljxY
— Telugu Desam Party (@JaiTDP) March 27, 2025
అంబటి రాంబాబుకి అసలు పోలవరం గురించి మాట్లాడే అర్హత ఉందా అంటూ సోషల్ మీడియా ప్రశ్నిస్తోంది. తాను మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం గురించి అడిగితే సమాధానం చెప్పి అడ్డంగా బుక్ అయ్యారు అంబటి. అసలు పోలవరం ఎవరికీ అర్థం అయ్యే సబ్జెక్ట్ కాదని, ఎందుకంటే అది తనకు అర్థం కాలేదని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత నాలుక కరుచుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నానని చెప్పినా జనం నమ్మలేదు. అసలు అంబటికి జలవనరుల శాఖ ఎందుకిచ్చారో అంటూ జగన్ పై జాలి చూపారు. ఈ తప్పులన్నీ ఎన్నికల్లో వైసీపీకి తిప్పలుగా మారాయి. ఇప్పుడు చంద్రబాబు పోలవరాన్ని పుష్కరాల లోపు పూర్తి చేయగలిగితే మాత్రం కచ్చితంగా అది ఎన్నికలకు బ్రహ్మాండమైన ప్రచారాస్త్రంగా మారుతుంది.