Ambati Rambabu: ఏమయ్యా అంబటి గారూ.. అంత పని చేశావు. ఇంతకు మన పార్టీ అధికారంలో ఉందనుకున్నావా ఏంటి? మన పార్టీ వాడిని నువ్వే దగ్గరుండి మరీ, పోలీసులకు పట్టించావు. అలా సవాల్ విసరడం ఎందుకు? దాగి ఉన్న అతడి రహస్యం చెప్పడమెందుకు? చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమెందుకు అంటున్నారట సొంత పార్టీ నేతలే.
ఇంతలా మాజీ మంత్రి అంబటి రాంబాబు ను కామెంట్ చేయడం వెనుక పెద్ద కథే ఉంది. ఏపీలో సోషల్ మీడియా వేదికగా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి భరతం పడుతున్నారు పోలీసులు. అందులో ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల పై ఓ కన్నేసి మరీ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.
ఈ తరహాలోనే పల్నాడు జిల్లా నకరికల్లుకు చెందిన రాజశేఖర్ రెడ్డి పై సైతం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదైన సమయం నుండి, రాజశేఖర్ రెడ్డి పరారీలో ఉన్నారు. అతడి కోసం పోలీసులు ముమ్మర గాలింపు సైతం సాగిస్తున్నారు. నాలుగు రోజులుగా ముప్పు తిప్పలు పెట్టిన రాజశేఖర్ రెడ్డి కోసం సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కూడా వెతుకుతున్నారు పోలీసులు.
అంతలోనే మాజీ అంబటి రాంబాబు చేసిన ఒకే ఒక్క ప్రకటన, పోలీసుల శ్రమను తగ్గించింది. అంబటి ఏమన్నారంటే.. పోలీసులు వెతుకుతున్న రాజశేఖర్ రెడ్డి తన సమక్షంలో భద్రంగా ఉన్నాడని, దమ్ముంటే పోలీసులు అరెస్ట్ చేసుకోవాలని సవాల్ విసిరారు. ఆ సవాల్ పోలీసులకు హింట్ ఇచ్చినట్లయింది.
ఇక రంగంలోకి దిగిన పోలీసులు మనసులో అంబటి కి థ్యాంక్స్ చెప్పుకొని, ఆయన కార్యాలయం వద్దకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ పోలీసులకు, అంబటి వాగ్వివాదం కూడా సాగింది. సరైన ఆధారాలు చూపించి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని అంబటి డిమాండ్ చేస్తున్న తరుణంలో పోలీసులు మాత్రం అతడిని ఎంచక్కా పోలీస్ జీప్ ఎక్కించేశారు.
పోలీసులు చేసిన ఈ అరెస్ట్ చూస్తే, చివరికి అంబటి రాంబాబు హింట్ ఇచ్చి మరీ రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ కి సహకరించినట్లయింది. అందుకే ఆవేశం పనికి రాదు అంబటి గారూ.. తొందరపడి సవాల్ విసిరారు.. పోలీసులు అరెస్ట్ చేశారు.. ఏమి సాధించారంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు.