పిఠాపురంలో టీడీపీ నేతలపై పోలీసులకు నాగబాబు ఫిర్యాదు..
పార్టీ అధికారంలో ఉన్నా కూడా టీడీపీ నేతలపై కేసులు..
కూటమిలో టీడీపీ వర్సెస్ జనసేన..
వైసీపీ అనుకూల మీడియాతోపాటు, మరికొన్ని సోషల్ మీడియా హ్యాండిళ్లలో ఈ వార్తలు వైరల్ గా మారాయి. ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పోటా పోటీగా టీడీపీ, జనసేన కార్యకర్తలు నినాదాలు చేసుకున్నారు. అది మినహా ఆ విషయానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఆ సంఘటనల తర్వాత టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయని వార్తలొస్తున్నాయి. కేసు పెట్టింది కూడా నాగబాబు అని అంటున్నారు. సాక్షి ఈ వార్తలకు అత్యథిక ప్రాధాన్యత ఇస్తోంది.
ఆ నాగబాబు కాదు..
అలజడి జరిగింది నాగబాబు పర్యటనలోనే అయినా, టీడీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది మాత్రం ఆయన కాదు. అయితే ఫిర్యాదు చేసిన జనసేన నేత పేరు కూడా నాగబాబే కావడంతో సాక్షి మరింత అత్యుత్సాహంతో కథనాలు వండి వారుస్తోంది. టీడీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు అందింది వాస్తవమే, అయితే ఫిర్యాదు చేసింది ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు కాదు, మొయిళ్ల నాగబాబు. ఆయన కూడా జనసేన నాయకుడే. ఆయన ఎవరిపై కేసు పెట్టారనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు టీడీపీ నేతలేనా, లేక పసుకు కండువాల ముసుగులో ఉన్న అల్లరి మూకలా..? పోలీస్ విచారణలో తేలాల్సి ఉంది.
పోలీస్ కేసులు
నాగబాబు పిఠాపురం పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రత్యేకంగా సీఎం చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి ధన్యవాదాలు చెబుతూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. తన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు స్థానిక జనసేన నేతలకు కూడా థ్యాంక్స్ చెప్పారు. అయితే టీడీపీ నేతలు రచ్చ చేయడంపై ఆయన ఎక్కడా పెదవి విప్పలేదు. నాగబాబు పిఠాపురం పర్యటనలో తనను అడ్డుకుని మోటార్ సైకిల్ అద్దాలు పగలగొట్టారని జనసేన నేత మొయిళ్ల నాగబాబు పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం. తన విధులకు ఆటంకం కలిగించారంటూ పిఠాపురం అడిషనల్ ఎస్సై జానీ భాషా కూడా మరో ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫిర్యాదులపై గొల్లప్రోలు పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేయడం విశేషం.
పిఠాపురం వ్యవహారం రెండు పార్టీల అధిష్టానాల వద్దకు వెళ్లింది. ప్రస్తుతానికి ఈ వ్యవహారంపై అధినేతలిద్దరూ సైలెంట్ గానే ఉన్నారు. నాగబాబు తొలి పర్యటనే ఇలా జరగడంతో అటు జనసేన నేతలు కూడా గుర్రుగా ఉన్నారు. పిఠాపురంలో జనసేనకు పక్కలో బల్లెంలా మారేందుకు టీడీపీ నేత వర్మ శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవి వచ్చి ఉంటే వర్మ సైలెంట్ గా ఉండేవారు. కానీ అటు సీటు త్యాగం చేసి, ఇటు పదవి రాకపోవడంతో ఆయన హర్ట్ అయ్యారు. దీంతో పిఠాపురం కాస్త హాట్ సీట్ గా మారింది. ప్రస్తుతానికి కేసుల వరకు వ్యవహారం వచ్చింది. ముందు ముందు ఇంకే జరుగుతుందో చూడాలి.