Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో పోలీసులు కొన్ని గంటల్లోనే అగంతకుడిని గుర్తించినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ రాగా, ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ కు అధికారులు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు బెదిరింపు కాల్స్ వచ్చిన నెంబర్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి విజయవాడ లబ్బీపేట కు చెందిన మల్లికార్జున రావు గా పోలీసులు భావిస్తున్నారు.
కాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి వచ్చిన బెదిరింపు కాల్స్ కి కారణమైన ఫోన్ నెంబర్, గత రెండు రోజుల క్రితం హోం మంత్రి వంగలపూడి అనితకు కూడా అదే నెంబర్ ద్వారా బెదిరింపు కాల్ వచ్చినట్లు అధికారులు తెలుపుతున్నారు. పవన్ కళ్యాణ్ కు హోంమంత్రికి ఒకే నెంబర్ నుండి బెదిరింపు కాల్ రావడంతో స్వయంగా డీజీపీ రంగంలోకి దిగారు. వెంటనే ఐటీ కోర్ పోలీసులను అప్రమత్తం చేశారు. పవన్ కళ్యాణ్ ను నేరుగా చంపేస్తానంటూ, అలాగే దుర్భాషలాడుతూ మెసేజ్ లు రాగా పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు వేగవంతం చేశారు.
Also Read: Dos and Don’ts In Tirumala: తిరుమల శ్రీవారిని ఇలా దర్శనం చేసుకుంటున్నారా? అలా చేయకూడదని మీకు తెలుసా?
సాంకేతిక పరిజ్ఞానంతో ఫోన్ నెంబర్ ఆధారంగా అగంతకుడుని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నించి ఎట్టకేలకు సఫలీకృతులైనట్లు తెలుస్తోంది. అయితే అగంతకుడు ఎందుకిలా బెదిరింపు కాల్స్ చేయాల్సి వచ్చింది? మానసిక వ్యాధితో బాధపడుతున్నాడా లేక కావాలనే బెదిరింపులకు పాల్పడ్డాడా? అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ఇప్పటికే అగంతకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద పోలీసులు మాత్రం ఆగమేఘాల మీద ఆగంతకుడిని గుర్తించడంతో పలు రకాల వదంతులకు ఫుల్ స్టాప్ పడింది.