Visakha Politics: విశాఖ సిటీలో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. మేయర్ పీఠం దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. వారం వరకు ధీమాగా ఉన్న వైసీపీ కౌన్సెలర్లు, క్రమంగా చేజారిపోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై కంటతడి పెట్టారు మేయర్ హరి వెంకటకుమారి.
జీవీఎంసీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. మేయర్ పీఠాన్ని కాపాడుకునేందుకు వైసీపీ తన ప్రయత్నాలు చేసింది. ఎలాగైనా దక్కించుకోవాలని టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు ఉన్నాయి. కార్పొరేటర్లు చేజారి పోకుండా ఉండేలా టీడీపీ, జనసేన కార్పొరేటర్లు మలేషియాకు తరలించారు. వైసీపీ కార్పొరేటర్లు శ్రీలంకు వెళ్తారని భావించినప్పటికీ విశాఖలో ఉండిపోయారు. అధినేత నుంచి అనుమతి లేకపోవడమే ఇందుకు కారణమట.
ఈనెల 19న (శనివారం) మేయర్ వెంకట కుమారిపై అవిశ్వాసం పెట్టింది టీడీపీ. ఇప్పటికే కలెక్టర్‌కు కార్పొరేటర్లకు లేఖ పంపారు కూడా. సమయం దగ్గరపడు తుండడంతో వైసీపీలో టెన్షన్ మొదలైంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై నోరువిప్పారు విశాఖ మేయర్ హరి వెంకటకుమారి. ఈ క్రమంలో బిగ్ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు ఆమె.
కుటిల రాజకీయాలు
సంఖ్యాబలం తమకు అనుకూలంగానే ఉందంటున్నారు మేయర్. కూటమి ప్రభుత్వం బెదిరింపు రాజకీయాలు చేస్తోందని మండి పడ్డారు. 19న జరిగే అవిశ్వాస ఓటింగ్‌లో మేయర్‌గా కొనసాగుతానని పూర్తి విశ్వాసం వ్యక్తంచేశారు. కార్పొరేటర్ల సంఖ్యా బలం మాకు అనుకూలంగా ఉందన్నారు.
ALSO READ: ఐదు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్, మంత్రి లోకేష్ ప్రకటన
వైసీపీ గుర్తుపై 58 మంది కార్పొరేటర్లు గెలిచారని, కూటమి ప్రభుత్వం బెదిరింపుల కారణంగా వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో పార్టీల కతీతంగా పరిపాలన సాగించామని, సిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్నారు.
యాదవ్ కమ్యూనిటీకి చెందిన మహిళగా తనకు మేయర్‌గా అధినేత జగన్ ఛాన్స్ ఇచ్చారని, ఆ పదవి నుంచి తప్పించడానికి ఎన్నో కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మాట్లాడుతున్న క్రమంలో కాసింత ఎమోషన్ అయి కంటతడి పెట్టారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని, సిటీ ప్రజలంతా గమనించాలన్నారు.
మేయర్‌పై జనసేన గరంగరం
మేయర్ వెంకటకుమారి వ్యాఖ్యలపై మండిపడ్డారు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్. ప్రస్తుతం జీవీఎంసీలో నలుగురు షాడో మేయర్లు ఉన్నారన్నారు. మేయర్, డెప్యూటీ మేయర్లు దోచుకున్నారని దుయ్యబట్టారు. ఇసుక తోటలో వసు దేవా ఫంక్షన్ హాల్ నిర్మాణానికి డబ్బులు ఎలా వచ్చాయి? ఆరిలోవ బీఆర్టీసీ రోడ్డులో వసు దేవా లాడ్జి మేయర్ పేరు మీద లేదా?
షొడో మేయర్ గోలగాని శ్రీనివాస్ పేరు మీద భవనం లేదా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. నేషనల్ హైవే సమీపంలో రిసార్ట్స్ నిర్మాణం ఎవరి చేపట్టారు? జీవీఎంసీ సంపాదన దోచుకున్నారని చెప్పడానికి ఆధారాలు చాలవా అంటూ ప్రశ్నించారు.
మేయర్ ఛాంబర్‌లో ఉండాల్సిన కుర్చీలు, సోఫా సెట్స్ ఎక్కడ ఉన్నాయి? ఇంట్లో ఫ్రిడ్జ్ లక్ష 30 వేల రూపాయాలు ఖర్చు చేశారని, అది జీవీఎంసీ సొమ్ము కాదా? దేశంలో రిచెస్ట్ డెప్యూటీ మేయర్ జియ్యని శ్రీధర్ కాదా అని అన్నారు. ఎన్‌ఏడీ కారు వాష్ స్థలం 4 కోట్ల డెబ్బై లక్షల రూపాయలని, ఆ స్థలం కొనడానికి ఆయనకు డబ్బులు ఎలా వచ్చాయి?
పార్టీ కార్యాలయం కోటి రూపాయలు పెట్టి కబ్జా చేయలేదా? సొంత వార్డులో 10 కోట్ల విలువ చేసే పోలీసుల స్థలం కబ్జా చేసేందుకు యత్నించారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పోలీసులు అప్రమత్తమై అరెస్ట్ చేయడానికి వస్తే ఆయన పారిపోలేదా అంటూ మండిపడ్డారు.
నేతాజీ రోడ్డులో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆయదేనని, 6 కోట్ల విలువైన 500 గజాల స్థలం కబ్జా చేసి రియల్ ఎస్టేట్ కి అమ్మలేదా అంటూ విమర్శించారు. దాదాపు 100 కోట్ల రూపాయల స్థలాలను ఆయన సెటిల్ మెంట్ చేశారని దుయ్యబట్టారు. చివరకు బంగారు షాపులను సైతం వదల్లేదన్నారు. ఐదు ప్రాంతాల్లో మసాజ్, యోగ సెంటర్స్ ఎవరి పేరు మీద లేవా అంటూ రుసరుసలాడారు.
విశాఖలో మేయర్ పీఠం కోసం రసవత్తరంగా రాజకీయాలు
కంటతడి పెట్టిన మేయర్ హరివెంకట కుమారి
సంఖ్యాబలం తమకు అనుకూలంగానే ఉందంటున్న మేయర్
కూటమి ప్రభుత్వం బెదిరింపు రాజకీయాలు చేస్తోందని మండిపాటు
ఈ నెల 19న విశాఖ కార్పొరేషన్లో అవిశ్వాస తీర్మానం pic.twitter.com/D13AEilSnL
— BIG TV Breaking News (@bigtvtelugu) April 16, 2025