Posani Krishna Murali: పోసాని కృష్ణమురళి. సినిమాల్లోలానే సీఐడీ విచారణలోనూ మహానటుడిగా నటిస్తున్నారు. ఎంతగా గుచ్చి గుచ్చి అడిగినా.. పోసాని మాత్రం తనకు తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయా.. అనే సమాధానాలే మార్చి మార్చి చెబుతున్నాడు. ఎంతైనా నటుడు కదా.. ఆ మాత్రం పర్ఫార్మెన్స్ చూపిస్తాడులే అని.. సీఐడీ పోలీసులు సైతం పక్కా ఆధారాలతో పోసాని నుంచి మొత్తం మేటర్ రాబట్టే ప్రయత్నం చేసినా.. సక్సెస్ కాలేకపోయారు.
గతంలో చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌లపై అనుచిత కామెంట్స్ చేయడంతో పాటు చంద్రబాబు.. అమిత్ షా కాళ్లు మొక్కినట్టి మీడియాకు మార్ఫింగ్ ఫోటోలు చూపించారనేది పోసానిపై ఉన్న కేసు. గుంటూరు కోర్టు పర్మిషన్‌తో సీఐడీ పోలీసులు మంగళవారం పోసానిని నాలుగు గంటల పాటు ప్రశ్నించారు.
ఇప్పటికే సీఐడీ సేకరించిన ఆధారాలను పోసాని ముందు ఉంచి ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్, లోకేశ్‌లను విమర్శించడం వెనుక ఆనాటి ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందా? ఎవరి ప్రెజర్ తో అలా మాట్లాడారు? విమర్శల వెనుక పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయా? ఇలా అనేక యాంగిల్స్ లో సీఐడీ పోలీసుల పోసానిని ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. అయితే.. సీఐడీ అడిగిన ఏ ప్రశ్నకూ ఆయన సరైన సమాధానం ఇవ్వకుండా.. గుర్తులేదంటూ దాట వేశారని సమాచారం. పోసాని ఫోన్ డేటా గురించి పోలీసులు ఆరా తీసినా.. ఎలాంటి వివరాలు రాబట్టలేక పోయినట్టు చెబుతున్నారు. తనను అనవసరంగా ఈ కేసులో ఇరుకిస్తున్నారని.. తన ఆరోగ్యం బాగాలేదంటూ.. పోసాని సీఐడీ విచారణకు సహకరించలేదని తెలుస్తోంది.
విచారణ తర్వాత గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో పోసానికి వైద్య పరీక్షలు చేయించి.. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కోర్టులో హాజరు పరిచారు. ఎంక్వైరీలో CID పోలీసులు థర్డ్ డిగ్రీ ఏమైనా ప్రయోగించారా? అని పోసానిని న్యాయమూర్తి ప్రశ్నించారు. CID పోలీసులు తనను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని పోసాని కోర్టుకు చెప్పారు. ఆ తర్వాత ఆయన్ను గుంటూరు జైలుకు తరలించారు.
అయితే, జైల్లోకి వెళ్లే ముందు.. పోసానితో కొందరు సీఐడీ పోలీసులు ఫోటోలు దిగడం విమర్శలకు దారి తీసింది. పోసాని కేసులో సీరియస్‌నెస్ లేకుండా.. పోలీసులే ఆయనతో ఫోటోలు దిగడం ఏంటని ఈ విషయాన్ని ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. సదరు సీఐడీ సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మరోవైపు, కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్ పై విచారణ బుధవారానికి వాయిదా పడింది.